వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ప్రామాణీకరణ, అనుగుణ్యత మదింపులో సహకారం పెంపు కోసం 35 సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్'

Posted On: 05 AUG 2023 4:54PM by PIB Hyderabad

జాతీయ ప్రమాణాల సంస్థ 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్', ప్రామాణీకరణ, అనుగుణ్యతలో సహకారం పెంచుకోవడానికి దేశవ్యాప్తంగా 35 ప్రతిష్టాత్మక సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ ఎన్‌ఐటీలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు ఈ జాబితాలో ఉన్నాయి.

జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో, బ్యూరోకు చెందిన సాంకేతికత కమిటీలతో కలిసి ప్రామాణీకరణ కార్యకలాపాల్లో ఈ సంస్థలు పాల్గొనడానికి అవగాహన ఒప్పందం వీలు కల్పిస్తుంది. ఇంకా, సంబంధిత ఆర్‌&డీ ప్రాజెక్టుల మౌలిక సదుపాయాల కోసం ఆర్థిక సాయం పొందడం, ప్రామాణీకరణ & అనుగుణ్యత మదింపు కోసం ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించడం, ప్రచురణలను పరస్పరం పంచుకోవడం, విద్యాసంస్థల్లో ప్రామాణిక పాఠ్యాంశాలు పరిచయం చేయడం, ప్రామాణీకరణ, పరిశీలన, అనుగుణ్యత మదింపు, ప్రయోగశాలల సౌకర్యాలను పంచుకోవడం కోసం 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌'ను అన్వేషించడం కూడా ఈ ఒప్పందం ద్వారా వీలవుతుంది.

ప్రముఖ విద్యాసంస్థలతో అవగాహన ఒప్పందాలు ప్రమాణాల రూపకల్పన కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తాయని బీఐఎస్‌ డైరెక్టర్ జనరల్ శ్రీ ప్రమోద్ కుమార్ తివారీ చెప్పారు. ఈ కార్యక్రమం విధివిధానాలు, భవిష్యత్‌ పథంపై అభిప్రాయాలు వ్యక్తం చేసిన బీఐఎస్‌ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ చందన్ బహ్ల్, ఈ భాగస్వామ్యం ఎలా ఉంటుందో వివరించారు.

కేంద్ర వినియోగదార్ల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, వినియోగదార్ల రక్షణ కోసం 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్' పని చేస్తుంది. పరిశ్రమల కోసం ఉత్పత్తి ధృవీకరణ (ఐఎస్‌ఐ మార్కు), నిర్వహణ వ్యవస్థల ధృవీకరణ, బంగారం, వెండి ఆభరణాలు, కళాఖండాలకు హాల్ మార్కింగ్, ప్రయోగశాల సేవలను అందిస్తుంది.

*****



(Release ID: 1946167) Visitor Counter : 126