ప్రధాన మంత్రి కార్యాలయం

2023 వ సంవత్సరం జూలై 30 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లోమాట) కార్యక్రమం 103 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 30 JUL 2023 11:45AM by PIB Hyderabad

ప్రియమైన నా దేశవాసులారా, నమస్కారం. 'మన్ కీ బాత్' (మనసు లో మాట) కార్యక్రమాని కి మీ అందరి కి ఇదే స్నేహపూర్ణమైనటువంటి ఆహ్వానం. జులై నెల అంటే వర్షకాలం, వర్షాల నెల. ప్రకృతి వైపరీత్యాల కారణంగా గత కొన్ని రోజులు గా బాధాకరమైన, ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. యమున తో పాటుగా వివిధ నదుల లో వరదలు పోటెత్తడం తో పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొండ ప్రాంతాల లో కొండచరియలు కూడా విరిగిపడ్డ సంఘటన లు జరిగాయి. మరోవైపు కొంతకాలం క్రితం దేశంలో పశ్చిమ ప్రాంతం లో- గుజరాత్ లోని వివిధ ప్రదేశాల లో బిపర్ జాయ్ తుపాను వచ్చింది. అయితే మిత్రులారా,ఈ విపత్తు ల మధ్య, మన దేశవాసులం అందరమూ సామూహిక ప్రయాసల యొక్క బలం ఎంతటిదో మరో సారి చూపించాం. స్థానిక ప్రజలు, ఎన్ డిఆర్ఎఫ్ జవానుల తో పాటుగా స్థానిక అధికార యంత్రాంగం విపత్తుల ను ఎదుర్కోవడానికి రాత్రింబగళ్లు శ్రమించింది. ఏ విపత్తు ను అయినా ఎదుర్కోవడం లో మన సామర్థ్యం, వనరుల పాత్ర ప్రధానమైంది. కానీ దాంతోపాటే మన స్పందన, పరస్పరం సహకరించుకొనేటటువంటి స్ఫూర్తి కూడా అంతే ముఖ్యం. ప్రజలందరూ బాగుండాలన్న సర్వ జన హితాయ భావన భారతదేశాని కి గుర్తింపు గా ఉంది, మరి ఇది భారతదేశం యొక్క బలం గా కూడాను ఉంది.

 

మిత్రులారా,  వర్షాలు వచ్చే ఈ కాలమే మొక్కల పెంపకాని కి మరియు జల సంరక్షణ కు కూడా ప్రధానమైంది. స్వాతంత్ర్యం అమృత మహోత్సవాల సందర్భం లో ఏర్పాటు చేసిన 60 వేల కు పైచిలుకు అమృత సరోవరాలు కూడా వెలుగు లు వెదజల్లుతున్నాయి. ప్రస్తుతం మరో 50 వేలకు పైగా అమృత సరోవరాల ను ఏర్పాటు చేసే పనులు కొనసాగుతున్నాయి. మన దేశం ప్రజలు పూర్తి చైతన్యం తో, బాధ్యత తో ‘జల సంరక్షణ’ కు క్రొత్త క్రొత్త ప్రయాసల ను చేస్తున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, కొంతకాలం కిందట నేను, మధ్యప్రదేశ్ లోని శహ్ డోల్‌ కు వెళ్ళాను. అక్కడ నేను పకరియా గ్రామం లో ఆదివాసి సోదర, సోదరీమణుల తో భేటీ అయ్యాను. అక్కడే ప్రకృతి ని, నీటి ని కాపాడడం కోసం వారితో చర్చించాను. పకరియా గ్రామంలో ఆదివాసి సోదరులు, ఆదివాసి సోదరీమణులు దీనికి సంబంధించిన పని ని మొదలుపెట్టినట్టు అప్పుడు నాకు తెలిసింది. అధికారుల సహాయం తో అక్కడి ప్రజలు సుమారు వంద బావుల ను వాటర్ రీచార్జ్ సిస్టమ్ గా మార్చివేశారు. వాన నీరు ఇప్పుడు ఈ బావుల లోకి వెళ్తుంది. ఆ బావుల లో నుండి ఈ జలం భూమి లోపల కు వెళ్లిపోతుంది. దీంతో ఆ ప్రాంతం లో భూగర్భ జలం స్థాయి కూడాను మెల్ల మెల్ల గా మెరుగుపడుతుంది. ఇప్పుడు గ్రామస్తులంతా ఆ ప్రాంతం లో ఆ ప్రాంతంలోని సుమారు 800 బావుల ను రీచార్జ్ కోసం ఉపయోగం లోకి తేవాలి అని లక్ష్యం గా పెట్టకొన్నారు. అటువంటి ప్రోత్సాహకరమైన వార్త ఒకటి ఉత్తర్ ప్రదేశ్ నుండి వచ్చింది. కొద్ది రోజుల కిందట ఒక్కరోజు లో 30 కోట్ల మొక్కల ను నాటిన రికార్డు ను ఉత్తర్ ప్రదేశ్‌ సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రచారాన్ని అక్కడి ప్రజలు పూర్తి చేశారు. ఇటువంటి ప్రయత్నాలు ప్రజల భాగస్వామ్యం తో పాటుగా ప్రజల చైతన్యాని కి గొప్ప ఉదాహరణలు గా నిలుస్తాయి. మొక్కల ను నాటడం, నీటి ని ఆదా చేసేటటువంటి ప్రయాసల లో మనమందరం భాగస్వాములు కావాలి అని నేను కోరుతున్నాను.

 

ప్రియమైన నా దేశ ప్రజలారా, ప్రస్తుతం పవిత్ర శ్రావణ మాసం కొనసాగుతోంది. శ్రావణ మాసం సదాశివ మహాదేవుడి ని ఆరాధించడం తో పాటుగా పచ్చదనం తో, ఆనందాల తో ముడి పడి ఉంటుంది. అందుకే ఆధ్యాత్మిక, సాంస్కృతిక దృష్టికోణం నుండి శ్రావణ మాసం చాలా ముఖ్యమైంది. శ్రావణ ఊయల లు, శ్రావణ గోరింటాకు, శ్రావణ ఉత్సవం- శ్రావణ మాసం అంటేనే ఆనందమూ, ఉల్లాసమూ ను.

 

మిత్రులారా, ఈ విశ్వాసాని కి, మన సంప్రదాయాల కు మరో కోణం కూడా ఉంది. ఈ పండుగ లు, సంప్రదాయాలు మనలను చైతన్యవంతం చేస్తాయి. చాలా మంది భక్తులు శ్రావణ మాసం లో శివుడి ని ఆరాధించేందుకు కావడ్ యాత్ర కు వెళ్తారు. చాలా మంది భక్తులు ఈ శ్రావణ మాసం లో 12 జ్యోతిర్లింగాలను దర్శించుకొంటున్నారు. బనారస్‌ ను సందర్శించే వారి సంఖ్య కూడా రికార్డు స్థాయి లో ఉంది అని తెలిస్తే మీకు ఆనందం గా ఉంటుంది. ఇప్పుడు ఏటా పది కోట్ల మంది పర్యటకులు కాశీ ని సందర్శిస్తున్నారు. అయోధ్య, మధుర, ఉజ్జయిని ల వంటి పుణ్యక్షేత్రాల ను సందర్శించే భక్తుల సంఖ్య కూడా వేగం గా పెరుగుతోంది. దీంతో లక్షల కొద్దీ పేద ప్రజానీకం ఉపాధి ని పొందుతూ జీవనాన్ని గడుపుతున్నారు. ఇది అంతా మన సాంస్కృతిక జన జాగరణ ఫలితం. దీని దర్శనం కోసం ఇప్పుడు ప్రపంచం నలు మూలల నుండి ప్రజలు తీర్థయాత్రల కు వస్తున్నారు. అమర్‌నాథ్ యాత్ర చేయడానికి కాలిఫోర్నియా నుండి ఇక్కడకు విచ్చేసిన ఇద్దరు అమెరికన్ మిత్రుల ను గురించి నాకు తెలుసు. ఈ విదేశీ అతిథులు అమర్‌నాథ్ యాత్ర కు సంబంధించి స్వామి వివేకనంద అనుభవాల ను గురించి ఎక్కడో విన్నారు. ఆ స్ఫూర్తి తో వారు అమర్‌నాథ్ యాత్ర కు తరలివచ్చారు. దీనిని భగవాన్ భోలేనాథ్ ఆశీర్వాదం గా వారు భావిస్తారు. ప్రతి ఒక్కరి ని తన వారు గా చేసుకోవడం, ప్రతి ఒక్కరి కి ఏదో ఒకటి ఇవ్వడం - ఇదే భారతదేశం యొక్క ప్రత్యేకత. అటువంటి ఒక ఫ్రెంచ్ శార్ల్ లోట్ శోపా. గతం లో నేను ఫ్రాన్స్‌ కు వెళ్లినప్పుడు ఆమె తో భేటీ అయ్యాను. శార్ లోట్ శోపా యోగ అభ్యాసకురాలు, ఆమె యోగ గురువు కూడా ను. ఆమె వయస్సు వందేళ్ల కంటే ఎక్కువ. ఆమె సెంచరీ ని దాటారు. గత నలభై ఏళ్లు గా యోగ ను సాధన చేస్తున్నారు. ఆవిడ తన ఆరోగ్యాని కి, ఈ వంద సంవత్సరాల వయస్సు కు కారణం యోగ యే అని అంటున్నారు. భారతదేశం యోగ విజ్ఞాన శాస్త్రాన్ని గురించి, భారతదేశం యోగ శక్తి ని గురించి ప్రపంచాని కి చాటిచెప్పే ప్రముఖురాలు గా ఆమె మారారు. ప్రతి ఒక్కరు ఆమె నుండి నేర్చుకోవాలి. మన వారసత్వాన్ని స్వీకరించడమే కాకుండా ప్రపంచానికి బాధ్యతాయుతం గా అందజేద్దాం. ఈ కాలం లో ఉజ్జయిని లో అటువంటి ప్రయత్నం జరుగుతూ ఉండడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఇక్కడ దేశ వ్యాప్తం గా ఉన్న 18 మంది చిత్రకారులు పురాణాల ఆధారం గా ఆకర్షణీయమైనటువంటి చిత్రాల ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాలు బూందీ శైలి, నాథ్ ద్వారా శైలి, పహాడీ శైలి, అపభ్రంశ శైలి ల వంటి అనేక విలక్షణమైన రీతుల లో తయారు అవుతున్నాయి. వీటిని ఉజ్జయిని లోని త్రివేణి మ్యూజియమ్ లో ప్రదర్శిస్తారు. అంటే కొంత కాలం తరువాత మీరు ఉజ్జయిని కి వెళ్ళినప్పుడు మీరు మహాకాల్ మహాలోక్‌ తో పాటుగా మరొక దివ్యమైన స్థలాన్ని కూడా చూడగలుగుతారు అన్నమాట.

 

మిత్రులారా, ఉజ్జయిని లో వేసిన ఈ చిత్తరువుల ను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు మరో ప్రత్యేకమైన రంగుల చిత్రం గుర్తు కు వచ్చింది. ఈ పెయింటింగు ను రాజ్‌ కోట్‌ కు చెందిన ప్రభాత్ సింహ్ మోడ్ భాయి బర్ హాట్ గారు అనే కళాకారుడు రూపొందించారు. ఈ పెయింటింగు ను ఛత్రపతి వీర్ శివాజీ మహారాజ్ జీవితం లోని ఒక సంఘటన ను ఆధారం గా చిత్రించడమైంది. పట్టాభిషేకం తరువాత ఛత్రపతి శివాజీ మహారాజ్ తన కులదైవం ‘తుల్ జా మాత’ ను దర్శించుకోబోతున్నట్టు, ఆ సమయం లో వాతావరణం ఎలా ఉందో చిత్రకారుడు ప్రభాత్ భాయ్ గారు చిత్రించారు. మన సంప్రదాయాల ను, మన వారసత్వాన్ని సజీవం గా ఉంచాలి అంటే వాటిని కాపాడుకోవాలి. సజీవం గా నిలపాలి. తరువాతి తరాని కి నేర్పించాలి. ఈ దిశ లో అనేక ప్రయాస లు జరుగుతూ ఉంన్నందుకు సంతోషిస్తున్నాను.

 

ప్రియమైన నా దేశవాసులారా, పర్యావరణం, వృక్షజాలం, జంతుజాలం, జీవ వైవిధ్యం వంటి పదాలు విన్నప్పుడు కొంతమంది ఇవి ప్రత్యేకమైన విషయాలు అని, నిపుణుల కు సంబంధించిన అంశాలు అని తలుస్తారు. కానీ అది వాస్తవం కాదు. మనం నిజం గా ప్రకృతి ని ప్రేమిస్తే మన చిన్న ప్రయాసల తో కూడా చాలా చేయవచ్చు. సురేశ్ రాఘవన్ గారు తమిళ నాడు లోని వాడవల్లి కి చెందిన మిత్రుడు. ఆయన కు చిత్రలేఖన కళ అంటే చాలా ఇష్టం. మీకు తెలుసా.. పెయింటింగ్ అనేది కళ. కాన్వాస్‌ కు సంబంధించిన పని. కానీ రాఘవన్ గారు తన పెయింటింగుల ద్వారా మొక్కల కు, జంతువుల కు సంబంధించిన సమాచారాన్ని భద్రపరచాలి అని నిర్ణయించుకొన్నారు. వివిధ వృక్షజాలం, జంతుజాలం చిత్రాల ను రూపొందించడం ద్వారా వాటికి సంబంధించిన సమాచారాన్ని ఆయన డాక్యుమెంటేజశన్ చేస్తారు. అంతరించిపోయే దశ లో ఉన్న డజన్ల కొద్దీ పక్షులు, పశువులు, ఆర్కిడ్ జాతి కి చెందిన అనేక పుష్పాల చిత్రాల ను ఇప్పటి వరకు ఆయన గీశారు. కళ ద్వారా ప్రకృతి కి సేవ ను చేసే ఈ ఉదాహరణ నిజం గానే అద్భుతం గా ఉంది.

ప్రియమైన నా దేశ వాసులారా, ఈ రోజు న మీకు మరో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాలి అని నేను అనుకొంటున్నాను. కొన్ని రోజుల క్రితం సామాజిక మాధ్యం లో అద్భుతమైన క్రేజ్ కనిపించింది. వందకు పైగా అరుదైనటువంటి, పురాతనమైనటువంటి మానవ నిర్మితమైన వస్తువుల ను అమెరికా మనకు వాపసు ఇచ్చింది. ఈ వార్త తెర పైకి రావడం తో, మనిషి సృష్టించిన ఈ కళాఖండాల ను గురించి సోశల్ మీడియా లో చాలా చర్చే జరిగింది. యువత వారి వారసత్వం పై గర్వాన్ని చాటుకొన్నారు. భారతదేశాని కి తిరిగి వచ్చిన ఈ కళాఖండాలు 2500 సంవత్సరాల నుండి 250 సంవత్సరాల కిందటివి. ఈ అరుదైన కళాఖండాలు దేశం లోని వివిధ ప్రాంతాల కు సంబంధించినవి అని తెలుసుకొంటే మీరు సంతోషిస్తారు. టెర్రకోట ను, రాతి ని, లోహాల ను, చెక్కల ను ఉపయోగించి వీటిని రూపొందించారు. వీటిలో కొన్ని మీలో ఆశ్చర్యాన్ని నింపే విధం గా ఉంటాయి. వాటిని చూస్తే అలా చూస్తూ ఉండిపోతారు!. వీటిలో 11వ శతాబ్దాని కి చెందిన అందమైన ఇసుక రాతి శిల్పాన్ని కూడా మీరు చూడవచ్చు. ఇది నృత్యం చేసే అప్సర కళాకృతి. ఇది మధ్య ప్రదేశ్‌ కు చెందింది. చోళుల కాలం నాటి అనేక విగ్రహాలు కూడా వీటిలో ఉన్నాయి. దేవత, భగవాన్ మురుగన్ విగ్రహాలు 12 వ శతాబ్దాని కి చెందినవి. తమిళ నాడు సంస్కృతి కి సంబంధించినవి. దాదాపు ఒక వేయి సంవత్సరాల నాటి గణేశుడి కాంస్య విగ్రహం కూడా భారతదేశానికి తిరిగి వచ్చింది. లలితాసనం లో కూర్చున్న ఉమా-మహేశ్వరుల విగ్రహం 11 వ శతాబ్దానికి చెందింది అని చెబుతారు. అందులో ఉమాదేవి, మహేశ్వరుడు ఇరువురూ నంది మీద ఆసీనులై ఉన్నారు. జైన తీర్థంకరుల రాతి విగ్రహాలు రెండు కూడా భారతదేశాని కి తిరిగి వచ్చాయి. సూర్య భగవానుని రెండు విగ్రహాలు కూడా మిమ్మల్ని ఆకర్షిస్తాయి. వీటిలో ఒకటి ఇసుకరాయి తో తయారైంది. తిరిగి వచ్చిన వస్తువుల లో కలప తో చేసిన ప్యానెల్ ఉంది. ఇది సాగరమథనం కథ ను మనకు గుర్తు కు తెస్తుంది. 16 వ - 17 వ శతాబ్దాని కి చెందిన ఈ ప్యానెల్ దక్షిణ భారతదేశాని కి సంబంధించింది.

 

మిత్రులారా, నేను ఇక్కడ చాలా కొన్నింటినే చెప్పాను. అయితే ఈ జాబితా చాలా పొడవు గా ఉంది. మన విలువైన ఈ వారసత్వ సంపద ను తిరిగి అందించిన అమెరికా ప్రభుత్వాని కి నేను కృతజ్ఞతల ను తెలియజేస్తున్నాను. నేను 2016 వ సంవత్సరం లోనూ, 2021 వ సంవత్సరం లోనూ అమెరికా ను సందర్శించినప్పుడు కూడా చాలా కళాకృతులు భారతదేశాని కి తిరిగి వచ్చాయి. ఇటువంటి ప్రయత్నాల తో మన సాంస్కృతిక వారసత్వ సంపద దొంగతనాన్ని అరికట్టడానికి దేశవ్యాప్తం గా చైతన్యం తప్పక పెరుగుతుంది అని నేను అనుకొంటున్నాను. మన సుసంపన్నమైన వారసత్వం తో దేశ ప్రజల అనుబంధాన్ని ఇది మరింత గా పెంచుతుంది.

 

ప్రియమైన నా దేశవాసులారా, దేవభూమి ఉత్తరాఖండ్‌ లోని కొంతమంది మాతృమూర్తులు, సోదరీమణులు నాకు రాసిన లేఖ లు హృదయాన్ని కదిలించాయి. వారు తమ కుమారుని కి, తమ సోదరుని కి అనేక దీవెనల ను ఇచ్చారు. మన సాంస్కృతిక వారసత్వమైన 'భోజపత్రం' తమ బ్రతుకుదెరువు సాధనం గా మారుతుంది అని ఎప్పుడూ ఊహించలేదు అంటూ వారు వ్రాశారు. ఇదంతాత ఏమిటి? అని మీరు ఆలోచిస్తూ ఉండి వుంటారు.

 

మిత్రులారా, ఈ ఉత్తరాన్ని చమోలీ జిల్లా నీతీ -మాణా లోయ లోని మహిళ లు నాకు వ్రాశారు. గత సంవత్సరం అక్టోబరు లో భోజపత్రం లో నాకు ఒక ప్రత్యేకమైన కళాకృతి ని అందించిన మహిళ లు వీరే. ఈ బహుమతి ని అందుకొన్న తరువాత నేను చాలా పొంగిపోయాను. అన్నింటి కంటే ముఖ్యం గా పురాతన కాలం నుండి మన గ్రంథాల ను, పుస్తకాల ను ఈ భోజపత్రాల పై భద్రపరచారు. మహాభారతం కూడా ఈ భోజపత్రాల పై రాశారు. దేవభూమి కి చెందిన ఈ మహిళ లు ఈ భోజ పత్రం నుండి చాలా అందమైన కళాఖండాల ను, స్మృతి చిహ్నాల ను తయారు చేస్తున్నారు. నేను మాణా గ్రామాన్ని సందర్శించినప్పుడు వారి ప్రత్యేకమైనటువంటి ప్రయాస ను మెచ్చుకొన్నాను. దేవభూమి ని సందర్శించే పర్యటకులు వారి సందర్శన కాలం లో వీలైనన్ని ఎక్కువ స్థానిక ఉత్పత్తుల ను కొనుగోలు చేయాలి అంటూ నేను విజ్ఞప్తి చేశాను. అది అక్కడ చాలా ప్రభావాన్ని చూపింది. నేడు భోజపత్రం సంబంధి ఉత్పత్తుల ను ఇక్కడ కు వచ్చే యాత్రికులు చాలా ఇష్టపడుతున్నారు. మంచి ధరల కు కొనుగోలు చేస్తున్నారు. పురాతన భోజపత్ర వారసత్వం ఉత్తరాఖండ్‌ లోని మహిళ ల జీవనం లో ఆనందం తాలూకు క్రొత్త వన్నెల ను నింపుతున్నాయి. భోజపత్రాల నుండి కొత్త ఉత్పత్తుల ను తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళల కు శిక్షణ ను కూడా ఇస్తోంది అని తెలిసి నేను సంతోషిస్తున్నాను.

రాష్ట్ర ప్రభుత్వం కూడా అరుదైన భోజపత్ర ప్రజాతుల ను సంరక్షించే ప్రచార ఉద్యమాన్ని మొదలుపెట్టింది. ఒకప్పుడు దేశాని కి చిట్టచివరి ప్రాంతాలు గా భావించే ప్రదేశాల ను ఇప్పుడు దేశం లో తొలి గ్రామాలు గా ఎంచి అభివృద్ధి చేయడం జరుగుతోంది. ఈ ప్రయాస లు మన సంప్రదాయాన్ని మరియు మన సంస్కృతి ని కాపాడుకోవడం తో పాటు గా ఆర్థిక ప్రగతి కి సాధనం గా కూడాను మారుతున్నాయి.

 

ప్రియమైన నా దేశవాసులారా, ఈసారి ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో మనసు కు ఎంతో సంతోషాన్ని ఇచ్చేటటువంటి ఉత్తరాలు పెద్ద సంఖ్య లో వచ్చాయి. ఈ లేఖల ను ఇటీవల హజ్ యాత్ర కు వెళ్ళివచ్చిన ముస్లిమ్ మహిళ లు వ్రాశారు. వారి ఈ ప్రయాణం చాలా రకాలుగా చాలా ప్రత్యేకమైంది. పురుష సహచరుడు-మెహ్ రమ్- లేకుండా హజ్ యాత్ర ను పూర్తి చేసిన మహిళ లు వీరు. వీరి సంఖ్య వందో, యాభయ్యో కాదు- నాలుగు వేల కంటే ఎక్కువ - ఇది భారీ మార్పు. ముస్లిమ్ మహిళ లు మెహ్ రమ్ లేకుండా ‘హజ్’ యాత్ర చేయడానికి ఇంతకు ముందు అనుమతి లేదు. ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం మాధ్యం ద్వారా సౌదీ అరేబియా ప్రభుత్వాని కి నా హృదయపూర్వక కృతజ్ఞతల ను వ్యక్తం చేస్తున్నాను. మెహ్ రమ్ లేకుండా ‘హజ్’ కు వెళ్లే మహిళ ల కోసం ప్రత్యేకం గా మహిళా సమన్వయకర్తల ను నియమించారు.

 

మిత్రులారా, గత కొన్నేళ్లు గా హజ్ విధానం లో చేసిన మార్పుల కు ఎన్నో ప్రశంస లు వస్తున్నాయి. మన ముస్లిమ్ మాతృమూర్తులు, సోదరీమణులు దీని గురించి నాకు చాలా వ్రాశారు. ఇప్పుడు ఎక్కువ మంది ‘హజ్’ కు వెళ్లే అవకాశం లభిస్తోంది. హజ్ యాత్ర నుండి తిరిగి వచ్చిన ప్రజలు-ముఖ్యం గా మన తల్లులు, సోదరీమణులు ఉత్తరాల ద్వారా అందజేసిన ఆశీర్వాదాలు చాలా స్ఫూర్తి ని ఇస్తాయి.

 

ప్రియమైన నా దేశవాసులారా, జమ్ము- కశ్మీర్‌ లో మ్యూజికల్ నైట్‌ లు అయినా, ఎత్తైన ప్రదేశాల లో బైక్ ర్యాలీలు అయినా, చండీగఢ్‌ లో స్థానిక క్లబ్‌ లు అయినా, పంజాబ్‌ లో క్రీడా సమూహాలు అయినా ఇవన్నీ వింటే మనం వినోదాన్ని గురించి, ఇంకా సాహసాన్ని గురించి మాట్లాడుకుంటున్నట్లు అనిపిస్తుంది. కానీ విషయం వేరు. ఈ కార్యక్రమం ఉమ్మడి ప్రయోజనాని కి సంబంధించింది. ఆ ఉమ్మడి కారణం - డ్రగ్స్‌ పై అవగాహన ప్రచారం. జమ్ము- కశ్మీర్ యువత ను డ్రగ్స్ నుండి రక్షించడానికి అనేక వినూత్న ప్రయత్నాలు జరిగాయి. మ్యూజికల్ నైట్, బైక్ ర్యాలీ ల వంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. చండీగఢ్‌ లో ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి స్థానిక క్లబ్‌ల ను దీనికి జోడించారు. వారు వీటి ని ‘వాదా (VADA) క్లబ్బులు’ అంటారు. వాదా అంటే విక్టరీ అగేన్ స్ట్ డ్రగ్స్ అబ్యూస్. మాదక ద్రవ్యాల దుర్వినియోగాని కి వ్యతిరేకం గా విజయం. పంజాబ్‌ లో అనేక స్పోర్ట్స్ గ్రూపు లు ఏర్పడ్డాయి. ఇవి ఫిట్‌నెస్‌ పై దృష్టి పెట్టడానికి, మాదకద్రవ్యాల వ్యసనం నుండి బయటపడడానికి అవగాహన ప్రచారాల ను నిర్వహిస్తున్నాయి. మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం లో యువత ఎక్కువగా పాల్గొనడం చాలా ప్రోత్సాహకరం గా ఉంది. ఈ ప్రయాస లు భారతదేశం లో డ్రగ్స్‌ కు వ్యతిరేకం గా ప్రచారానికి చాలా బలాన్ని ఇస్తున్నాయి. దేశం లోని భవిష్యత్తు తరాల ను కాపాడాలంటే డ్రగ్స్‌ కు దూరం గా ఉంచాలి. ఈ ఆలోచన తో ‘నశా ముక్త్ భారత్ అభియాన్’ 2020 వ సంవత్సరం లో ఆగస్టు 15 వ తేదీ నాడు ప్రారంభం అయింది. ఈ ప్రచారం తో 11 కోట్ల మంది కి పైగా జత పడ్డారు. రెండు వారాల కిందట మాదక ద్రవ్యాల పై భారతదేశం పెద్ద ఎత్తున చర్య తీసుకొంది. సుమారు 1.5 లక్షల కిలో ల డ్రగ్స్‌ ను స్వాధీనం చేసుకొని, ధ్వంసం చేయడం జరిగింది. 10 లక్షల కిలో ల మాదక ద్రవ్యాల ను ధ్వంసం చేసిన అద్వితీయ రికార్డు ను కూడా భారతదేశం సృష్టించింది. ఈ మాదక ద్రవ్యాల ధర 12 వేల కోట్ల రూపాయల కు పైగానే ఉంది. మాదక ద్రవ్యాల నుండి విముక్తి కలిగించే ఈ గొప్ప ఉద్యమాని కి సహకరిస్తున్న వారందరిని నేను అభినందిస్తున్నాను. మాదకద్రవ్య వ్యసనం కుటుంబానికే కాదు- యావత్తు సమాజాని కి పెద్ద సమస్య గా మారుతుంది. ఇటువంటి పరిస్థితుల లో ఈ ప్రమాదం శాశ్వతం గా అంతం కావాలి అంటే మనం అందరం ఒక్కటై ఈ దిశ లో ముందుకు సాగడం అవసరం.

 

ప్రియమైన నా దేశవాసులారా, మాదకద్రవ్యాల ను గురించి, యువ తరాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మధ్య ప్రదేశ్ నుండి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణాన్ని గురించి కూడా మీకు చెప్పాలి అని నేను అనుకొంటున్నాను. ఇది బుల్లి బ్రెజిల్ తాలూకు స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణం. మధ్య ప్రదేశ్‌ లోకి మినీ బ్రెజిల్ ఎక్కడి నుండి వచ్చింది అని మీరు అనుకొంటూ ఉంటారు. ఇదే మరి ట్విస్ట్. మధ్య ప్రదేశ్ లోని శహ్ డోల్ లో ఒక ఊరు బిచార్‌పుర్. బిచార్‌పూర్‌ ను మినీ బ్రెజిల్ అంటారు. మినీ బ్రెజిల్ ఎందుకంటే ఈ రోజు ఈ గ్రామం ఫుట్‌బాల్ లో వర్ధమాన తారల కు కంచుకోట గా మారింది. కొన్ని వారాల క్రితం శహ్ డోల్ ను నేను సందర్శించినప్పుడు చాలా మంది ఫుట్‌బాల్ ఆటగాళ్ల తో భేటీ అయ్యాను. మన దేశం ప్రజలు- మరీ ముఖ్యంగా మన యువ మిత్రులు దీని ని గురించి తెలుసుకోవాలి అని నాకు అనిపించింది.

 

మిత్రులారా, బిచార్‌పుర్ గ్రామం మినీ బ్రెజిల్‌ గా మారడం రెండు, రెండున్నర దశాబ్దాల కిందట మొదలైంది. ఆ సమయం లో బిచార్‌పుర్ గ్రామం అక్రమ మద్యాని కి పేరు పొందింది-మత్తు లో ఉంది. దాని వల్ల అక్కడి యువకుల కు ఎక్కువ గా నష్టం జరిగేది. మాజీ జాతీయ క్రీడాకారుడు, కోచ్ రయీస్ ఎహమద్ ఈ యువకుల ప్రతిభ ను గుర్తించారు. రయీస్ గారి దగ్గర పెద్ద గా వనరులు లేవు. కానీ ఆయన పూర్తి అంకితభావం తో యువత కు ఫుట్‌బాల్ ను నేర్పించడం మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాల లో ఫుట్‌బాల్ ఎంతగా ప్రాచుర్యం పొందింది అంటే బిచార్‌పుర్ గ్రామం కూడా ఫుట్‌బాల్‌ తో గుర్తింపు ను పొందింది. ఇప్పుడు ఇక్కడ ఫుట్‌బాల్ క్రాంతి అనే కార్యక్రమం కూడా జరుగుతోంది. ఈ కార్యక్రమం లో భాగం గా యువత ను ఈ గేమ్‌ తో కలిపి, వారికి శిక్షణ ను ఇస్తారు. ఈ కార్యక్రమం ఎంత గా సఫలం అయింది అంటే బిచార్‌పుర్ నుండి 40 మంది కి పైగా రాష్ట్ర స్థాయి క్రీడాకారులు, జాతీయ స్థాయి క్రీడాకారులు తయారు అయ్యారు. ఈ ఫుట్‌బాల్ విప్లవం ఇప్పుడు మెల్లమెల్లగా ఆ ప్రాంతం అంతటా విస్తరిస్తోంది. శహ్ డోల్, దాని పరిసర ప్రాంతాల లో 1200 కంటే ఎక్కువ ఫుట్‌బాల్ క్లబ్బులు ఏర్పడ్డాయి. జాతీయ స్థాయి లో ఆడుతున్న క్రీడాకారులు ఇక్కడి నుండి పెద్ద సంఖ్య లో పుట్టుకు వస్తున్నారు. ఉన్నత స్థాయి కి చెందిన ఫుట్‌బాల్ పూర్వ క్రీడాకారులు, శిక్షకులు అనేకులు ఇక్కడ యువత కు శిక్షణ ను ఇస్తున్నారు. మీరు ఆలోచించండి.. అక్రమ మద్యాని కి, మాదకద్రవ్యాల వ్యసనాని కి పేరుగాంచిన ఆదివాసి ప్రాంతం ఇప్పుడు దేశాని కి ఫుట్‌బాల్ నర్సరీ గా మారింది. అందుకే మనసుంటే మార్గముంటుంది అని అంటారు. మన దేశం లో ప్రతిభావంతులకు కొదువ లేదు. అవసరమైతే వారి ని కనుగొనండి. మరింత సానబెట్టి, తీర్చిదిద్దండి. దీని తరువాత ఈ యువత దేశం పేరు ను ప్రకాశవంతం చేస్తుంది. దేశ అభివృద్ధి కి దిశ ను నిర్దేశిస్తుంది.

 

ప్రియమైన నా దేశ ప్రజలారా, స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో మనం అందరం అమృత మహోత్సవాల ను పూర్తి ఉత్సాహం తో జరుపుకొంటున్నాం. అమృత మహోత్సవాల లో భాగం గా దేశం లో దాదాపు రెండు లక్షల కార్యక్రమాల ను నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఒక దానికి మించి మరొకటి జరిగాయి. విభిన్నం గా జరిగాయి. ఈ కార్యక్రమాల కు వన్నె తెచ్చిన విషయం ఏమిటంటే వాటిలో రికార్డు స్థాయి లో యువత పాలుపంచుకోవడం. ఈ సమయం లో మన యువత దేశం లోని గొప్ప వ్యక్తుల ను గురించి చాలా సంగతుల ను తెలుసుకొన్నారు. మొదటి కొన్ని నెలల గురించి మాత్రమే మాట్లాడుకొంటే గనక ప్రజల భాగస్వామ్యాని కి సంబంధించిన అనేక ఆసక్తికరమైన కార్యక్రమాల ను చూడగలిగాం. అటువంటి ఒక కార్యక్రమమే దివ్యాంగ రచయిత ల కోసం ‘రైటర్స్ మీట్’ ను నిర్వహించడం అని చెప్పుకోవచ్చును. ఈ కార్యక్రమం లో ప్రజలు రికార్డు స్థాయి లో పాల్గొన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ లోని తిరుపతి లో ‘జాతీయ సంస్కృత సదస్సు’ జరిగింది. మన చరిత్ర లో కోటల కు ఉన్న ప్రాముఖ్యం గురించి మనకు అందరి కి తెలుసును. దీనిని ప్రదర్శించే కార్యక్రమమే ‘కోట లు-కథ లు’. కోటల కు సంబంధించిన కథ లు కూడా ప్రజల కు నచ్చాయి.

 

మిత్రులారా, దేశం నలు దిశ లా అమృత మహోత్సవం ప్రతిధ్వనులు వినిపిస్తున్న వేళ- ఆగస్టు 15 సమీపిస్తోన్న ప్రస్తుత సందర్భం లో దేశం లో మరో పెద్ద ఉద్యమం ఆరంభం అవుతోంది. అమరులైన వీరుల ను, వీరాంగనల ను సన్మానించేందుకు ‘మేరీ మాటీ - మేరా దేశ్’ (నా నేల- నా దేశం) ఉద్యమం మొదలవుతోంది. దీనిలో భాగం గా మన అమర వీరుల జ్ఞాపకార్థం దేశం అంతటా అనేక కార్యక్రమాల ను నిర్వహించడం జరుగుతుంది. వారి కి గుర్తు గా దేశం లోని లక్షల కొద్దీ గ్రామ పంచాయతీల లో ప్రత్యేక శిలా శాసనాలు కూడా ఏర్పాటు అవుతాయి. ఈ ప్రచారం లో భాగం గా దేశవ్యాప్తంగా ‘అమృత కలశ యాత్ర’ కూడా జరుగుతుంది. ఈ ‘అమృత కలశ యాత్ర’ దేశం లోని నలుమూలల గ్రామ గ్రామాన 7500 కలశాల లో మట్టి ని మోసుకొని దేశ రాజధాని దిల్లీ కి చేరుకొంటుంది. ఈ యాత్ర దేశం లోని వివిధ ప్రాంతాల నుండి మొక్కల ను కూడా తీసుకు వస్తుంది. 7500 కలశాల లో వచ్చిన మట్టి ని, మొక్కల ను కలిపి జాతీయ యుద్ధ స్మారక ప్రాంతం సమీపం లో ‘అమృత వాటిక’ ను నిర్మిస్తారు. ఈ అమృత వాటిక ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ కు కూడా ను గొప్ప ప్రతీక అవుతుంది. నేను గత ఏడాది ఎర్ర కోట నుండి వచ్చే 25 సంవత్సరాల అమృతకాలం లో 'పంచ ప్రణ్' ను గురించి మాట్లాడాను. ‘మేరీ మాటీ - మేరా దేశ్’ ప్రచారం లో పాల్గొనడం ద్వారా ఈ పంచ ప్రణ్ ను నెరవేర్చడానికి మనం ప్రమాణం కూడా చేస్తాం. దేశం లోని పవిత్రమైన మట్టి ని చేతి లోకి తీసుకొని ప్రమాణాన్ని చేస్తున్నప్పుడు మీరు అందరు మీ సెల్ఫీ ని యువ డాట్ గవ్ డాట్ ఇన్ (yuva.gov.in) లో అప్‌ లోడ్ చేయాలి. కిందటి ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భం లో ‘హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్‌’ కోసం దేశం మొత్తం ఒక్కతాటి మీదకు వచ్చిన విధం గానే ఈసారి కూడాను ప్రతి ఇంటి లో మువ్వన్నెల జెండా ను ఎగురవేసి ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలి. ఈ ప్రయాసల తో మనం మన కర్తవ్యాల ను గుర్తిస్తాం. దేశం స్వాతంత్ర్యం కోసం చేసిన అసంఖ్యాక త్యాగాల ను మనం గ్రహిస్తాం. స్వేచ్ఛ విలువ ను తెలుసుకొంటాం. కాబట్టి ప్రతి దేశవాసి ఈ ప్రయాసల లో తప్పకుండా పాలుపంచుకోవాలి.

 

ప్రియమైన నా దేశ ప్రజలారా, ఈ రోజు న ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో ఇంతే. మరికొద్ది రోజుల లో ఆగస్టు 15 వ తేదీన జరిగే గొప్ప స్వాతంత్య్ర పండుగ లో మనం భాగం అవుతున్నాం. దేశం స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన వారి ని నిత్యం స్మరించుకోవాలి. వారి కలల ను నెరవేర్చడానికి మనం రాత్రింబగళ్లు కష్టపడాలి. దేశ ప్రజల ఈ కృషి ని, సామూహిక ప్రయాసల ను ముందుకు తీసుకు వచ్చే మాధ్యమే ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం. వచ్చేసారి మరికొన్ని కొత్త అంశాలతో కలుద్దాం. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.

 

 

**



(Release ID: 1944108) Visitor Counter : 180