ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘‘తుక్కు నుంచి సంపద’’ అనే ప్రధానమంత్రి ఆకాంక్షను స్టీల్ స్లాగ్ రోడ్డు టెక్నాలజీ నెరవేరుస్తోంది : శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే


స్టీల్ స్లాగ్ రోడ్డు టెక్నాలజీతో గుజరాత్ లోని సూరత్ లో తొలి రోడ్డు నిర్మాణం; గ్రావెల్ లేదా ఏ ఇతర సహజ వస్తువులు నిర్మాణంలో ఉపయోగించలేదు

ఈ టెక్నాలజీని ప్రోత్సహించడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ; రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖలతో కలిసి పని చేస్తున్న ఉక్కు మంత్రిత్వ శాఖ

Posted On: 19 JUL 2023 6:34PM by PIB Hyderabad

‘‘తుక్కు నుంచి సంపద’’  సృష్టి పేరిట ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉద్యమస్ఫూర్తితో ప్రారంభించిన కార్యక్రమం లక్ష్యం సాకారం చేయడంలో సిఎస్ఐఆర్-సిఆర్ఆర్ఐ రూపొందించిన స్టీల్ స్లాగ్  (ఉక్కు తుక్కు)  రోడ్డు టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. శాస్ర్త, పారిశ్రామిక పరిశోధన మండలి (సిఎస్ఐఆర్)-కేంద్ర రోడ్డు పరిశోధన సంస్థ (సిఆర్ఆర్ఐ) నిర్వహణలోని ‘‘ఒక వారం ఒక లాబ్’’ కార్యక్రమంలో  పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఉక్కు శాఖ  సహాయమంత్రి శ్రీ ఫగ్గన్   సింగ్  కులస్తే  ఈ విషయం తెలిపారు.

ప్రపంచంలో ఉక్కు ఉత్పత్తిలో రెండో పెద్ద దేశం భారత్ అని కేంద్ర మంత్రి చెప్పారు. ఉక్కు ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా దేశంలో 1.9 కోట్ల టన్నుల ఘన వ్యర్థాలు వస్తున్నాయి. 2030 నాటికి ఈ ఘన వ్యర్థాల పరిమాణం 6 కోట్ల టన్నులకు పెరుగుతుందని అంచనా (ఒక టన్ను ఉక్కు ఉత్పత్తికి సుమారు 200 కిలోల స్టీల్  స్లాగ్ వస్తుంది).

ఈ స్టీల్  స్లాగ్  ను సమర్థవంతంగా నిర్మూలించేందుకు ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం వల్ల ఉక్కు ఫ్యాక్టరీల చుట్టూ భారీ గుట్టలుగా ఇది పేరుకుపోతూ ఉంటుంది. ఫలితంగా నీరు, జల, భూ కాలుష్యం కూడా పెరిగిపోతోంది. దీన్ని ఉపయోగంలోకి తెచ్చేందుకు రూపొందించిన స్టీల్  స్లాగ్  టెక్నాలజీతో గుజరాత్  లోని సూరత్  లో తొలి రోడ్డును నిర్మించారు. దీనికి గల సాంకేతిక ప్రత్యేకత దృష్ట్యా జాతీయ స్థాయిలో ఇది ప్రాచుర్యం పొందుతోంది. ఆర్సెలార్  మిట్టల్  నిప్పన్  స్టీల్  కంపెనీకి చెందిన హజారీ ప్లాంట్లో అందుబాటులో ఉన్న లక్ష టన్నుల స్టీల్  స్లాగ్  ను సిఆర్ఆర్ఐ మార్గదర్శకంలో ఈ రోడ్డు నిర్మాణంలో ఉపయోగించారు. సాధారణంగా ఉపయోగించే కంకర, ఇతర వస్తువులేవీ నిర్మాణంలో ఉపయోగించలేదు.

సరిహద్దు రహదారుల సంస్థ కూడా అరుణాచల్  ప్రదేశ్  లో సిఆర్ఆర్ఐ, టాటా స్టీల్  సహకారంతో సిఆర్ఆర్ఐ మార్గదర్శకాల కింద భారత, చైనా సరిహద్దులో ఒక రోడ్డును ఇదే టెక్నాలజీతో నిర్మించింది. సాంప్రదాయిక రోడ్డుతో పోల్చితే ఇది దీర్ఘకాలిక జీవనం కలిగి ఉంటుంది. అలాగే భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్ హెచ్ఏఐ) కూడా జెఎస్ డబ్ల్యు స్టీల్  సహకారంతో సిఆర్ఆర్ఐ సాంకేతిక మార్గదర్శకంలో జాతీయ  రహదారి -66 (ముంబై-గోవా) నిర్మాణంలో కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించింది.

దేశవ్యాప్తంగా స్టీల్  స్లాగ్  టెక్నాలజీ ఉపయోగించేందుకు సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ;  రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ సహకారంతో ఉక్కు మంత్రిత్వ శాఖ కృషి చేస్తున్నదని మంత్రి చెప్పారు.

సిఆర్ఆర్ఐ డైరెక్టర్  డాక్టర్  మనోరంజన్ పరిదా, స్టీల్  స్లాగ్  రోడ్డు ప్రాజెక్టు హెడ్ డాక్టర్  సతీశ్  పాండే ఇద్దరినీ ఇలాంటి టెక్నాలజీ రూపొందించినందుకు; దేశవ్యాప్తంగా రోడ్డు నిర్మాణంలో దాన్ని వినియోగించేలా ప్రోత్సహించినందుకు మంత్రి అభినందించారు.

స్టీల్ స్లాగ్  రోడ్  టెక్నాలజీ

కేంద్ర రోడ్డు పరిశోధన సంస్థ (సిఆర్ఆర్ఐ) కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం, నాలుగు ప్రధాన ఉక్కు తయారీ కంపెనీల భాగస్వామ్యంతో ఈ టెక్నాలజీని రూపొందించింది. ఇందులో పాల్గొన్న ప్రధాన ఉక్కు కంపెనీల్లో ఆర్సెలార్  మిట్టల్  నిప్పన్  స్టీల్, జెఎస్ డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, రాష్ర్టీయ ఇస్పాత్ నిగమ్ ఉన్నాయి. ఉక్కు ప్లాంట్ల వద్ద పేరుకుపోయే ఉక్కు తుక్కును భారీ పరిమాణంలో ఉపయోగంలోకి తెచ్చేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.  దేశంలో ఉత్పత్తి అయిన 1.9 కోట్ల టన్నుల స్టీల్  స్లాగ్  ను ఉపయోగంలోకి తేవడంలో ఇది సమర్థవంతమైనదిగా నిరూపించుకుంది. దేశంలోని నాలుగు ప్రధాన రాష్ర్టాలు గుజరాత్, జార్ఖండ్, మహారాష్ర్ట, అరుణాచల్  ప్రదేశ్  లో రోడ్డు నిర్మాణంలో ఈ టెక్నాలజీని విజయవంతంగా ఉపయోగించారు.

 

***


(Release ID: 1941304) Visitor Counter : 144