ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన జరిగిన భారత రెడ్‌క్రాస్ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశం
భారత సరిహద్దులు దాటి సహాయ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ఇండియన్ రెడ్‌క్రాస్ మరింత విస్తరించాలి: డా.మన్‌సుఖ్ మాండవీయ
Posted On:
17 JUL 2023 5:58PM by PIB Hyderabad
గౌరవనీయ రాష్ట్రపతి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు శ్రీమతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన, ఈ రోజు, రాష్ట్రపతి భవన్ సాంస్కతిక కేంద్రంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. 9 రాష్ట్రాలు, యుూటీల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు ఏజీఎంలో పాల్గొన్నారు. మరికొందరు వర్చువల్ మార్గంలో పాల్గొన్నారు. ఐఆర్‌సీఎస్ గౌరవ ఛైర్మన్ డా.మన్‌సుఖ్ మాండవీయ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కొవిడ్-19 మహమ్మారి కారణంగా, ఆరు సంవత్సరాల తర్వాత ఈ సమావేశం భౌతికంగా జరిగింది. దేశం నలుమూలల నుంచి 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
రెడ్‌క్రాస్ ఆవిర్భవించింది పేదలకు, బలహీన వర్గాలకు సేవ చేయడానికేనని ఈ సందర్భంగా జరిగిన సభలో డాక్టర్ మాండవీయ చెప్పారు. "భారత సరిహద్దులు దాటి సహాయ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ఇండియన్ రెడ్‌క్రాస్ మరింత విస్తరించాలి" అని ఆకాంక్షించారు.
సంస్థ కార్యక్రమాల్లో మరింత సమర్థత & పారదర్శకత కోసం, ఐఆర్‌సీఎస్ రాష్ట్ర శాఖలు తమ నెలవారీ నివేదికలను పీపీటీ రూపంలో తమ రాష్ట్ర గవర్నర్‌కు సమర్పించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి సూచించారు. తద్వారా, రెడ్‌క్రాస్ మరింత వ్యాప్తి చెందుతుంది, ఎక్కువ మందికి చేరువ అవుతుందని చెప్పారు. కార్పొరేట్ వర్గాల నుంచి సీఎస్‌ఆర్ నిధులు పొందే మొదటి ఎంపికగా ఇండియన్ రెడ్‌క్రాస్ మారేలా పారదర్శకంగా పని చేయాలని కూడా నిర్దేశించారు.
తెలంగాణకు చెందిన డాక్టర్ ఎల్.ఎన్. అంబటి నటరాజ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్ గోపరాజు సమరంకు గౌరవ రాష్ట్రపతి రెడ్‌క్రాస్ బంగారు పతకాలు ప్రదానం చేశారు. 2021-22 సంవత్సరానికి గరిష్ట నిధులు సేకరించినందుకు ఐఆర్‌సీఎస్ ఒడిశా రాష్ట్ర శాఖకు; జనాభా పరంగా గరిష్ట నిధులు సేకరించినందుకు ఐఆర్‌సీఎస్ జమ్ము&కశ్మీర్ శాఖకు కూడా పురస్కారాలు దక్కాయి. అత్యధిక స్వచ్ఛంద రక్త సేకరణ విభాగంలో గుజరాత్, దాద్రా & నగర్ హవేలీ, డామన్ & డయ్యూ శాఖలు రక్తదాన జ్ఞాపికలు దక్కించుకున్నాయి. ఒక్క ఏడాదిలో 2 లక్షల 77 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు గుజరాత్ రాష్ట్ర శాఖ బంగారు పతకాన్ని గెలుచుకుంది.
****
(Release ID: 1940290)
Visitor Counter : 157