ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆఖరి వ్యక్తి వరకు ఆరోగ్యం అందించాలనే ఆలోచనకు దగ్గరగా చేర్చడానికి స్వాస్థ్య చింతన్ శిబిర్ మనకు సహాయపడాలి: డెహ్రాడూన్ లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్వాస్థ్య చింతన్ శిబిర్ రెండవ రోజు కార్యక్రమంలో డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


ప్రధాన మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ లోని లోక్ భాగీదారీ భారతదేశాన్ని టిబి రహిత దేశంగా మార్చడంలో ఎంతగానో దోహద

పడుతుంది; ని-క్షయ మిత్రలుగా మారడానికి ప్రజలు ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని రాష్ట్రాలకు మాండవీయ పిలుపు

అర్హులైన లబ్ధిదారులు ఎవరూ వెనుకబడకుండా అన్ని ఆరోగ్య పథకాలను సమగ్ర, సంపూర్ణ స్థాయిలో అమలు చేయాలి.

Posted On: 15 JUL 2023 2:18PM by PIB Hyderabad

ఆఖరి వ్యక్తి వరకు ఆరోగ్యం  అందించాలనే ఆలోచనకు దగ్గరగా చేర్చడానికి  స్వాస్థ్య చింతన్ శిబిర్ సహాయపడుతుంది. గత రెండు రోజులుగా, భారతదేశంలో ఈనాడు ఆరోగ్య రంగ సమగ్ర అవలోకనాన్ని మనం చూశాము. సార్వత్రిక ఆరోగ్య కవరేజీని నిర్ధారించడానికి మనం ముందుకు సాగాల్సిన దిశను చూశాము‘‘ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. డెహ్రాడూన్ లో జరుగుతున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్వాస్థ్య చింతన్ శిబిర్ రెండవ రోజు కార్యక్రమంలో డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు.

 

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్, కేంద్ర ఆరోగ్య - కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బఘేల్. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు శ్రీ ధన్ సింగ్ రావత్ (ఉత్తరాఖండ్), శ్రీమతి రజినీ విడుదల (ఆంధ్రప్రదేశ్), శ్రీ అలో లిబాంగ్ (అరుణాచల్ ప్రదేశ్), శ్రీ కేశవ్ మహంత (అస్సాం), శ్రీ రుషికేష్ పటేల్ (గుజరాత్), శ్రీ బన్నా గుప్తా (జార్ఖండ్), శ్రీ దినేష్ గుండూరావు (కర్ణాటక), శ్రీ సపమ్ రంజన్ సింగ్ (మణిపూర్), డాక్టర్ ఆర్. సుబ్రమణియన్ (తమిళనాడు) ఈ మేధోమథన సదస్సులో పాల్గొన్నారు.

శ్రీ టీఎస్ సింగ్ దేవ్ (ఉపముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి, ఛత్తీస్ గఢ్), శ్రీ బ్రజేష్ పాఠక్ (ఉపముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి, ఉత్తర ప్రదేశ్), శ్రీ బీఎస్ పంత్ (పర్యాటకం, పౌర విమానయాన శాఖ మంత్రి, సిక్కిం), శ్రీ విశ్వాస్ సారంగ్ (మధ్యప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్యా మంత్రి), శ్రీ కె లక్ష్మీ నారాయణన్ (పబ్లిక్ వర్క్స్, పుదుచ్చేరి) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ప్రధాన మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ గురించి డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ, "దేశంలో క్షయవ్యాధి భారాన్ని తొలగించడానికి ప్రజల భాగస్వామ్యం అయిన లోక్ భాగీదారీ చాలా ముఖ్యమైన చర్య. టిబి నిర్మూలనకు మన విధానం ఆరోగ్య సంరక్షణ పట్ల భారతీయ విధానాన్ని చూపిస్తుంది. నిక్షయ్ మిత్రలుగా మారడానికి ప్రజలు ముందుకు రావాలని నేను కోరుతున్నాను, ఎందుకంటే ఇది భారతదేశాన్ని టిబి రహితంగా మార్చడానికి ఎంతగానో దోహదపడుతుంది‘‘ అని పేర్కొన్నారు.

టీబీ నిర్మూలనకు ప్రాధాన్యమివ్వాలని, దీనికి మరింత ఊతమివ్వాలని ఆయన రాష్ట్రాలను కోరారు. వికలాంగుల ధృవీకరణ పత్రాల జారీని సులభతరం చేయడం ద్వారా దేశంలోని దివ్యాంగుల జనాభాను ఆదుకోవాలని ఆయన రాష్ట్రాలను కోరారు.

 

అర్హులైన లబ్ధిదారులు ఎవరూ వెనుకబడకుండా అన్ని ఆరోగ్య పథకాల సమగ్ర , సంపూర్ణ కవరేజీని నిర్ధారించాల్సిన అవసరాన్ని డాక్టర్ మాండవీయ నొక్కిచెప్పారు.  ప్రస్తుత చింతన్ శిబిర్ ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సౌకర్యాలను ఎలా మెరుగుపరచాలో సలహాలు ఇస్తుందని, అలాగే దేశవ్యాప్తంగా అవసరమైన కొత్త జోక్యాలను అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వికె పాల్ స్వాస్థ్య చింతన్ శివిర్ లో మాట్లాడుతూ, "గత రెండు రోజులుగా ఆరోగ్య సంరక్షణకు ఒక సమగ్ర నమూనాను అక్కడున్న వారందరి నుండి వచ్చిన సమాచారంతో సృష్టించాము.  ఈ రోజు మనం ఆమోదించిన తీర్మానాన్ని ఆచరణలో పెట్టడం చాలా అవసరం, తద్వారా నిర్దేశించిన లక్ష్యాలను వచ్చే సంవత్సరం నాటికి సాధించవచ్చు" అని అన్నారు.

 

ఈ రెండు రోజుల కార్యక్రమం చివరి రోజున, ఆయుష్మాన్ భవ, జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం, మీజిల్స్ , రుబెల్లా , నిర్మూలన, పిసిపిఎన్ డి టి చట్టం వరకు భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ కు సంబంధించిన వివిధ కోణాలపై సెషన్లు జరిగాయి.

 

ఈ కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, ఆరోగ్య ,  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ శ్రీ సుధాంష్ పంత్, ఆయుష్ కార్యదర్శి శ్రీ వైద్య రాజేష్ కొటేచా, ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శి డాక్టర్ రాజీవ్ బహల్, ఆరోగ్య,  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కు, రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులు, అలాగే పారిశ్రామిక సంస్థల నాయకులు పాల్గొన్నారు.

 

****



(Release ID: 1939752) Visitor Counter : 157