జల శక్తి మంత్రిత్వ శాఖ

దేశంలోని 146 రిజర్వాయర్ల ప్రస్తుత నీటినిల్వ 59.503 బీసీఎం


దేశం మొత్తంమీద ప్రస్తుత నిల్వ 83.816 బిలియన్ క్యూబిక్ మీటర్లని అంచనా

Posted On: 13 JUL 2023 6:59PM by PIB Hyderabad

దేశంలోని 146 రిజర్వాయర్ల ప్రత్యక్ష నిల్వ స్థితిని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ప్రతి వారం పర్యవేక్షిస్తోంది. వీటిలో 18 రిజర్వాయర్లు 34.960 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల (బీసీఎం) నిల్వ సామర్థ్యంగల జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు సంబంధించినవి. కాగా, 146 రిజర్వాయర్ల మొత్తం నిల్వ సామర్థ్యం 178.185 బీసీఎం. ఇది దేశవ్యాప్త రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం 257.812 ‘బీసీఎం’లలో 69.11 శాతం. కేంద్ర జలసంఘం వారంవారీ సమీక్షకు అనుగుణంగా 13.07.2023న విడుదల చేసిన సమాచార నివేదిక ప్రకారం- ఈ రిజర్వాయర్లలో ప్రస్తుత నీటినిల్వ 59.503 ‘బీసీఎం’గా ఉంది. ఇది ఈ రిజర్వాయర్ల మొత్తం నిల్వ సామర్థ్యంలో 33 శాతం. అయితే, గత సంవత్సరం ఈ రిజర్వాయర్లలో ఇదే కాలానికి సంబంధించి ప్రత్యక్ష నిల్వ 69.726 ‘బీసీఎం’. అలాగే గడచిన 10 సంవత్సరాల సగటు ప్రత్యక్ష నిల్వ 53.904 ‘బీసీఎం.’ ఈ నేపథ్యంలో 13.07.2023 సమాచార నివేదిక ప్రకారం 146 రిజర్వాయర్ల ప్రత్యక్ష నిల్వ గత సంవత్సరం సంబంధిత కాలానికిగాను 85 శాతం కాగా, గత పదేళ్ల సగటు నిల్వలో 110 శాతంగా ఉంది. ఈ గణాంకాలను అలా ఉంచితే, దేశం మొత్తంమీద నీటినిల్వ స్థితి గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువే అయినా, గత పదేళ్ల సగటు నిల్వతో పోలిస్తే మెరుగ్గా ఉంది.

దేశంలో ప్రస్తుతం నీటినిల్వ పరిస్థితి

   కేంద్ర జలసంఘం 146 రిజర్వాయర్లలోని నీటి నిల్వపై 13.07.2023న విడుదల చేసిన సమాచార నివేదిక ఆధారంగా లెక్కిస్తే దేశం మొత్తంమీద నీటినిల్వ సామర్థ్యం 257.816 ‘బీసీఎం’కుగాను ప్రస్తుత ప్రత్యక్ష నీటినిల్వ 83.816 ‘బీసీఎం’గా అంచనా వేయబడింది.

విస్తృత విశ్లేషణ

   ‘సాధారణ నిల్వ’ అంటే గత పదేళ్ల సగటు నిల్వ కాగా, ‘సాధారణ నిల్వకు చేరువగా’ అంటే-  అందులో 20 శాతందాకా తక్కువని అర్థం. ‘లోటునిల్వ’ అంటే- సాధారణంలో 60 శాతందాకా నిల్వ ఉండగా, లోటు 20 శాతంకన్నా ఎక్కువగా ఉందని అర్థం. ‘అత్యధిక లోటు’ అంటే- లోటు సాధారణంకన్నా 60 శాతం తక్కువగా ఉందని అర్థం.

   ఈ నేపథ్యంలో గంగా, సింధుతోపాటు పెన్నార్‌-కన్యాకుమారి మధ్య తూర్పుగా ప్రవహించే నదులే కాకుండా లూని, నర్మద, తాపి, సబర్మతి, గోదావరి, మహానదిసహా కచ్-సౌరాష్ట్ర మధ్య  పశ్చిమంగా ప్రవహించే నదులలో నీటినిల్వ సాధారణంకన్నా మెరుగ్గా ఉంది. ఇక కావేరి, మహి, పెన్నా, బ్రహ్మపుత్ర నదులలో నీటినిల్వ సాధారణానికి చేరువగా ఉంది; మరోవైపు సువర్ణరేఖ, బరాక్ తదితరాలతోపాటు బ్రాహ్మణి, వైతరణి, మహానది-పెన్నార్‌ మధ్య తూర్పుగా ప్రవహించే నదులు కృష్ణా, తాపీ నుంచి తాద్రి వరకు; తాద్రి నుంచి కన్యాకుమారి వైపు పశ్చిమంగా ప్రవహించే నదులలో అత్యధిక లోటు నమోదైంది.

   నిరుటికన్నా ప్రస్తుతం అధిక నిల్వగల రిజర్వాయర్ల సంఖ్య 49 కాగా, గత పదేళ్ల సగటుతో పోలిస్తే ప్రస్తుతం అధిక నిల్వగల రిజర్వాయర్ల సంఖ్య 68గా ఉంది. నిరుటి నిల్వతో పోలిస్తే 20 శాతంకన్నా తక్కువగా లేదా సమాన నిల్వగల రిజర్వాయర్ల సంఖ్య 10 కాగా, గత పదేళ్ల సగటు నిల్వతో పోలిస్తే తక్కువగా లేదా 20 శాతానికి సమాన నిల్వగల రిజర్వాయర్ల సంఖ్య 8గా ఉంది. నిరుటితో పోలిస్తే తక్కువ లేదా 50 శాతానికి సమానంగా నిల్వగల రిజర్వాయర్ల సంఖ్య 35 కాగా, గత పదేళ్ల సగటుపోలిస్తే తక్కువగా లేదా 50 శాతానికి సమాన నిల్వగల రిజర్వాయర్ల సంఖ్య 24గా ఉంది.

   రాష్ట్రాల విషయానికొస్తే- హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిషా, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో గత సంవత్సరంతో పోలిస్తే ఇదేకాలంలో నిల్వ (శాతం) మెరుగ్గా ఉంది. ఇక గత సంవత్సరంతో పోలిస్తే ఇదేకాలంలో గుజరాత్‌ రాష్ట్రంలో నిల్వ (శాతం) సమానంగా ఉంది. మరోవైపు నిరుటితో పోలిస్తే ఇదే కాలంలో తక్కువ నిల్వ (శాతం) గల రాష్ట్రాల జాబితాలో- పశ్చిమ బెంగాల్, త్రిపుర, నాగాలాండ్, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ (రెండింటిలో కలిపి 2 ప్రాజెక్టులు), కర్ణాటక, కేరళ, తమిళనాడు ఉన్నాయి.

ప్రాంతాలవారీ నిల్వ పరిస్థితి:

ఉత్తర భారతం

   ఉత్తర భారతంలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలున్నాయి. కాగా, ‘సీడబ్ల్యూసీ’ పర్యవేక్షణలో మొత్తం 19.663 ‘బీసీఎం’ నిల్వ సామర్థ్యంగల 10 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలో 13.07.2023 నాటి నీటినిల్వ సమాచార నివేదిక ప్రకారం- ప్రస్తుత నిల్వ 12.554 ‘బీసీఎం’ కాగా, ఇది మొత్తం నిల్వ సామర్థ్యంలో 64 శాతం. గత సంవత్సరం ఇదే కాలంలో నిల్వ 26 శాతంగానూ, పదేళ్ల సగటు నిల్వ మొత్తం సామర్థ్యంలో 35 శాతంగానూ నమోదైంది. ఈ విధంగా ప్రస్తుత నిల్వ గత సంవత్సరం ఇదే కాలంనాటి నిల్వకన్నా; ఇదే కాలంలో పదేళ్ల సగటుకన్నా మెరుగ్గా ఉంది.

తూర్పు భారతం

   తూర్పు భారతంలో జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, త్రిపుర, నాగాలాండ్, బీహార్ రాష్ట్రాలున్నాయి. వీటి పరిధిలో ‘సీడబ్ల్యూసీ’ పర్యవేక్షణ కింద మొత్తం 20.091 ‘బీసీఎం’ నిల్వ సామర్థ్యంగల 21 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలో 13.07.2023 నాటి నీటినిల్వ సమాచార నివేదిక ప్రకారం- ప్రస్తుత నిల్వ 4.307 ‘బీసీఎం’ కాగా, ఈ రిజర్వాయర్ల మొత్తం నిల్వ సామర్థ్యంలో ఇది 21 శాతం. గత సంవత్సరం ఇదే కాలంలో నిల్వ 20 శాతంగానూ, పదేళ్ల సగటు నిల్వ మొత్తం సామర్థ్యంలో 27 శాతంగానూ నమోదైంది. కాబట్టి ప్రస్తుత నిల్వ నిరుడు ఇదే కాలంతో పోలిస్తే మెరుగ్గా ఉన్నప్పటికీ గత పదేళ్ల సగటుతో పోలిస్తే నిల్వ తక్కువగా ఉంది.

పశ్చిమ భారతం

   పశ్చిమ భారతంలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలున్నాయి. వీటి పరిధిలో ‘సీడబ్ల్యూసీ’ పర్యవేక్షణ కింద మొత్తం 37.130 ‘బీసీఎం’ నిల్వ సామర్థ్యంగల 49 రిజర్వాయర్లు ఉన్నాయి.

వీటిలో 13.07.2023 నాటి నీటినిల్వ సమాచార నివేదిక ప్రకారం- ప్రస్తుత నిల్వ 12.070 ‘బీసీఎం’ కాగా, ఈ రిజర్వాయర్ల మొత్తం నిల్వ సామర్థ్యంలో ఇది 33 శాతం. గత సంవత్సరం ఇదే కాలంలో నిల్వ 41 శాతంగా ఉంటే, పదేళ్ల మొత్తం సామర్థ్యం సగటుతో పోల్చినపుడు 28 శాతంగా నమోదైంది. ఈ విధంగా, ప్రస్తుత నిల్వ గత సంవత్సరంకన్నా తక్కువగా ఉన్నప్పటికీ పదేళ్ల సగటుతో పోలిస్తే ఇదే కాలంలో నిల్వ మెరుగ్గా ఉంది.

మధ్య భారతం

   మధ్య భారతంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలున్నాయి. వీటి పరిధిలో ‘సీడబ్ల్యూసీ’ పర్యవేక్షణ కింద మొత్తం 48.227 ‘బీసీఎం’ నిల్వ సామర్థ్యంగల 26 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలో 13.07.2023 నాటి నీటినిల్వ సమాచార నివేదిక ప్రకారం- ప్రస్తుత నిల్వ 19.055 ‘బీసీఎం’ కాగా, ఈ రిజర్వాయర్ల మొత్తం నిల్వ సామర్థ్యంలో ఇది 40 శాతం. గత సంవత్సరం ఇదే కాలంలో నిల్వ 37 శాతంగానూ, పదేళ్ల సగటు నిల్వ మొత్తం సామర్థ్యంలో 33 శాతంగానూ నమోదైంది. కాబట్టి ప్రస్తుత నిల్వ నిరుడు ఇదే కాలంతో పోల్చినపుడు మాత్రమే కాకుండా గత పదేళ్ల సగటుతో పోల్చినా మెరుగ్గానే ఉంది.

దక్షిణ భారతం

   దక్షిణ భారతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, (రెండు రాష్ట్రాల్లో 2 సంయుక్త ప్రాజెక్టులు), కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలున్నాయి. వీటి పరిధిలో ‘సీడబ్ల్యూసీ’ పర్యవేక్షణ కింద మొత్తం 53.074 ‘బీసీఎం’ నిల్వ సామర్థ్యంగల 40 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలో 13.07.2023 నాటి నీటినిల్వ సమాచార నివేదిక ప్రకారం- ప్రస్తుత నిల్వ 11.517 ‘బీసీఎం’ కాగా, ఈ రిజర్వాయర్ల మొత్తం నిల్వ సామర్థ్యంలో ఇది 22 శాతం. గత సంవత్సరం ఇదే కాలంలో నిల్వ 52 శాతంగానూ, పదేళ్ల సగటు నిల్వ మొత్తం సామర్థ్యంలో 29 శాతంగానూ నమోదైంది. కాబట్టి ప్రస్తుత నిల్వ నిరుడు ఇదే కాలంతో పోల్చినపుడు మాత్రమే కాకుండా గత పదేళ్ల సగటుతో పోల్చినా తక్కువగానే ఉంది.

*****



(Release ID: 1939483) Visitor Counter : 137


Read this release in: English , Urdu , Hindi , Marathi