రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

సాయుధ బలగాల ఆహార అలవాట్లు మార్చి చిరుధాన్యాల వినియోగం ఎక్కువ చేసి, సురక్షితమైన పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడానికి రక్షణ మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఎఫ్ఎస్ఎస్ఏఐ


' రక్షణ కోసం ఆరోగ్యకర వంటకాలు' పుస్తకాన్ని ఆవిష్కరించిన రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

Posted On: 13 JUL 2023 1:25PM by PIB Hyderabad

  సాయుధ బలగాల ఆహార అలవాట్లు మార్చి చిరుధాన్యాల వినియోగం ఎక్కువ చేసి, సురక్షితమైన పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడానికి రక్షణ మంత్రిత్వ శాఖతో ఎఫ్ఎస్ఎస్ఏఐ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అవగాహన ఒప్పందంపై రక్షణ శాఖ మంత్రి శ్రీ  రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సమక్షంలో 2023 జూలై 13న సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా ' రక్షణ కోసం ఆరోగ్యకర వంటకాలు' పుస్తకాన్ని శ్రీ రాజ్‌నాథ్ సింగ్,డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఆవిష్కరించారు. శ్రీ అన్న (చిరుధాన్యాలు) వాడకాన్ని ఎక్కువ చేసి, వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను పుస్తకంలో పొందుపరిచారు. 

అవగాహన ఒప్పందంపై రక్షణ శాఖ తరఫున డైరెక్టర్ జనరల్ (సరఫరాలు, రవాణా) లెఫ్టినెంట్ జనరల్ ప్రీత్ మొహిందర సింగ్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( ఎఫ్ఎస్ఎస్ఏఐ) సీఈఓ శ్రీ జి కమల వర్ధనరావు సంతకాలు చేశారు. ఆహార వైవిధ్యం,చిరుధాన్యాలు ఉపయోగించి సిద్ధం చేసే  ఆహార ఉత్పత్తుల  పోషక ప్రయోజనాల గురించి సిబ్బందిలో అవగాహన కల్పించడం కోసం ఒప్పందం ద్వారా కృషి చేస్తారు. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన  మెస్, క్యాంటీన్లు, ఇతరఆహార సరఫరా కేంద్రాలలో చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను  ప్రవేశపెట్టడానికి కూడా అవగాహన ఒప్పందం అవకాశం కల్పిస్తుంది.  

ఆహార భద్రత,ప్రమాణాల చట్టం 2006 కింద పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగా సాయుధ బలగాలకు ఆహారం తయారు చేస్తున్న చెఫ్, సరఫరాదారులు ఆహార భద్రత, పరిశుభ్రత అంశాలపై కూడా ఒప్పందంలో భాగంగా శిక్షణ అందిస్తారు. సాయుధ బలగాల సిబ్బంది ఆరోగ్య సంరక్షణ అంశానికి  రక్షణ మంత్రిత్వ శాఖ ఇస్తున్న ప్రాధాన్యతను ఒప్పందం తెలియజేస్తుంది. దేశ సేవలో ఉన్న సాయుధ బలగాల సిబ్బంది ఆరోగ్యం, దృఢత్వానికి ఈ చర్యలు సహకరిస్తాయి. ప్రజలు ముఖ్యంగా   సాయుధ బలగాల కుటుంబాలు  పౌష్టికాహారాన్ని తీసుకోవడానికి , ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఎంపిక చేసుకుని    ఆహార భద్రత పొందేలా ఒప్పందం ద్వారా కృషి జరుగుతుంది. 

' రక్షణ కోసం ఆరోగ్యకర వంటకాలు'  పుస్తకాన్ని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రూపొందించింది. దీనిలో చిరుధాన్యాలు ఉపయోగించి తయారు చేసిన ఆహార పదార్ధాల వివరాలు పొందుపరిచారు. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న  క్యాంటీన్లు, ఫుడ్ అవుట్‌లెట్‌లకు పుస్తకం విలువైన సమాచారం అందిస్తుంది. విభిన్న వాతావరణ పరిస్థితులు, క్లిష్టమైన భూభాగాల్లో రక్షణ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. దీనికి వారు బలమైన పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.పోషక విలువలు కలిగిన  చిరుధాన్యాలు విభిన్నమైన సమతుల్య ఆహారాన్ని అందిస్తాయి.  

 ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, డిఫెన్స్ సెక్రటరీ శ్రీ గిరిధర్ అరమానె, ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, రక్షణ శాఖ, ఆరోగ్య శాఖ  సీనియర్ అధికారులు పాల్గొన్నారు.  

 

***


(Release ID: 1939220) Visitor Counter : 180