సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోసం బ్యాంకర్ల అవగాహన కార్యశాలను రేపు నిర్వహించనున్న పింఛన్లు & పింఛనుదార్ల సంక్షేమ విభాగం (డీవోపీపీడబ్ల్యూ)
పింఛనుదార్ల జీవన సౌలభ్యం పెంపొందించేందుకు భారత ప్రభుత్వ అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి కార్యశాలలో అవగాహన
పింఛనుదార్లకు అన్ని రకాల సేవలను ఒకేచోట అందించనున్న 'సమీకృత పింఛనుదార్ల పోర్టల్'
Posted On:
09 JUL 2023 7:02PM by PIB Hyderabad
పింఛనుదార్లు & కుటుంబ పింఛనుదార్ల "జీవన సౌలభ్యం" పెంపొందించడానికి, కేంద్ర సిబ్బంది &పింఛన్ల శాఖ సహాయ మంత్రి డా.జితేంద్ర సింగ్ ఆధ్వర్యంలో, పింఛన్లు & పింఛనుదార్ల సంక్షేమ విభాగం కృషి చేస్తోంది. పెన్షన్ల సంబంధిత ప్రక్రియ డిజిటలీకరణ సహా అనేక సంక్షేమ చర్యలను ఈ విభాగం చేపట్టింది. గత 50 ఏళ్లలో పింఛన్ల నియమాల్లో చాలా మార్పులు జరిగాయి, అనేక ఆదేశాలు/సూచనలు జారీ అయ్యాయి. వాటన్నింటినీ కలిపి, కేంద్ర ప్రజా సేవ (పింఛన్లు) నియమాలు, 2021 రూపంలో డిసెంబర్ 2021లో తీసుకువచ్చారు.
పింఛన్ల పంపిణీలో బ్యాంకులు ప్రధాన పాత్ర పోషిస్తాయి కాబట్టి, పింఛన్లు & పింఛనుదార్ల సంక్షేమ విభాగం, 'సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్స్ (CPPCలు) ఆఫ్ బ్యాంక్స్' పేరిట అవగాహన కార్యశాలలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా, స్టేట్ బ్యాంక్ అధికారుల కోసం రేపు కార్యశాల నిర్వహిస్తోంది. పింఛన్లు & పింఛనుదార్ల సంక్షేమ విభాగం కార్యదర్శి శ్రీ వి.శ్రీనివాస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ బృందం శ్రీనగర్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది.
పింఛన్ల పంపిణీకి సంబంధించిన నియమాలు, విధానాలపై బ్యాంకులకు అవగాహన కల్పించడం, పింఛనుదార్ల "జీవన సౌలభ్యం" పెంపొందించడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించడం ఈ కార్యశాలల లక్ష్యం. పింఛన్ల జారీ ప్రక్రియలో బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలు, పింఛనుదార్ల ఫిర్యాదులు, బ్యాంక్ అధికారుల సూచనలు వంటి అంశాలపైనా ఈ కార్యశాలలో చర్చిస్తారు.
స్టేట్ బ్యాంక్ అధికారుల కోసం నిర్వహించే ఈ కార్యశాలను ఈ నెల 10 & 11 తేదీల్లో శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేశారు. సీపీపీలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పింఛన్ సంబంధిత విభాగాల నుంచి 50 మందికి పైగా అధికారులు ఈ కార్యశాలలో పాల్గొంటారు. 2023-24లో, బ్యాంకర్ల అవగాహన కార్యశాలలను ఇతర బ్యాంకుల కోసం కూడా నిర్వహిస్తారు. పింఛనుదార్లకు పింఛన్ సహా వివిధ బ్యాంకింగ్ సేవలను ఒకే చోట అందించే లక్ష్యంతో డీవోపీపీడబ్ల్యూ ప్రారంభించిన 'సమీకృత పింఛనుదార్ల పోర్టల్'తో 17 బ్యాంకులను ఏకీకృతం చేయడానికి ఈ కార్శశాలలో విధివిధానాలు రూపొందించాలని కూడా భావిస్తున్నారు. కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్, 2022 అక్టోబర్‌లో, 'సమీకృత పింఛనుదార్ల పోర్టల్'తో ఎస్‌బీఐ పెన్షన్ సేవ పోర్టల్‌ను ఏకీకృతం చేశారు.
<><><><><>
(Release ID: 1938422)
Visitor Counter : 137