వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

'ఒక జిల్లా ఒక ఉత్పత్తి' పురస్కారాలు ప్రకటించిన డీపీఐఐటీ; దరఖాస్తులకు ఈ నెల 31 వరకు అవకాశం

Posted On: 08 JUL 2023 1:34PM by PIB Hyderabad

దేశంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా, 'ఒక జిల్లా ఒక ఉత్పత్తి' (ఓడీఓపీ) పురస్కారాలను 'పరిశ్రమల ప్రోత్సాహం & అంతర్గత వాణిజ్య విభాగం' (డీపీఐఐటీ) ప్రకటించింది. రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్‌లో జూన్‌ 15న వీటి గురించి ప్రకటించింది. ఆర్థికాభివృద్ధిని సాధించడంలో జిల్లాల్లో, రాష్ట్రాల్లో/యూటీల్లో, విదేశాల్లోని అంతర్జాతీయ సంస్థల ద్వారా అసాధారణ విజయాలు సాధించిన వారిని గుర్తించి, గౌరవిచడం ఓడీఓపీ పురస్కారాల లక్ష్యం.

ఓడీఓపీ పురస్కారాల ఉద్దేశం: (i) విజయవంతమైన ఓడీఓపీ అంశాల్లో నిర్మాణాత్మక పోటీ, ఆవిష్కరణలు, సమర్థవంతమైన ప్రజా సేవల పంపిణీని ప్రోత్సహించడం (ii) అనుభవాలను పంచుకోవడం ద్వారా ఉత్తమ విధానాలను ప్రోత్సహించడం (iii) విజయవంతమైన ఆవిష్కరణలను గుర్తించడం, ఓడీఓపీ ఉత్పత్తుల సరఫరా గొలుసులోని అడ్డంకులను పరిష్కరించడం.

ఈ పురస్కారాల కోసం దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 25న ప్రారంభమైంది, ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని రాష్ట్రాలు/యూటీలు, జిల్లా యంత్రాంగాలు, విదేశాల్లో ఉన్న భారతీయ సంస్థలు ఇందులో పాల్గొనడానికి అర్హులు.

జిల్లా యంత్రాంగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, విదేశాల్లో ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. తద్వారా, ఓడీఓపీ ఆవిష్కరణలు, సమర్థవంతమైన ప్రజా సేవల పంపిణీ విధానాలను ఆచరణలోకి తీసుకురావచ్చు.

ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా, వివిధ భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు అనేక కార్యక్రమాలు చేపట్టాయి. డీపీఐఐటీ నేతృత్వంలోని 'ఒక జిల్లా ఒక ఉత్పత్తి' పురస్కారాల కార్యక్రమం వాటిలో ఒకటి.

దేశంలోని అన్ని జిల్లాల్లో సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం ఓడీఓపీ లక్ష్యం. దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని ఎంచుకోవడం, గుర్తింపు ఇవ్వడం, ప్రచారం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం. తద్వారా, ఓడీఓపీ ఆవిష్కరణలకు విఫణి అవకాశాలు పెంచడానికి, ఎగుమతి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి, ఎంచుకున్న ప్రతి ఓడీఓపీ ఉత్పత్తి సంబంధిత సరఫరా గొలుసులోని సమస్యలను గుర్తించి, పరిష్కరించడానికి అవకాశం కలుగుతుంది.

ఓడీఓపీ పురస్కారాల కోసం దరఖాస్తు చేయడానికి ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి: https://awards.gov.in/Home/AwardLibrary

*****



(Release ID: 1938358) Visitor Counter : 129