వ్యవసాయ మంత్రిత్వ శాఖ
కెన్యాలోని నైరోబీలో ఇండియా-ఆఫ్రికా అంతర్జాతీయ మిల్లెట్ కాన్ఫరెన్స్ కర్టెన్ రైజర్ ఈవెంట్
2023 ఆగస్టు 30-31 తేదీల్లో కెన్యాలో 'ఇండియా-ఆఫ్రికా ఇంటర్నేషనల్ మిల్లెట్ కాన్ఫరెన్స్'కు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న భారత, కెన్యా ప్రభుత్వాలు
ఈ సందర్భంగా ఇండియా-ఆఫ్రికా ఇంటర్నేషనల్ మిల్లెట్ కాన్ఫరెన్స్ లోగో, అధికారిక వెబ్ సైట్ ఆవిష్కరణ
Posted On:
06 JUL 2023 4:02PM by PIB Hyderabad
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వ వ్యవసాయ, పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ, కెన్యా ప్రభుత్వం సంయుక్తంగా కెన్యాలో ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ (ఇక్రిశాట్) సహకారంతో 'ఇండియా-ఆఫ్రికా ఇంటర్నేషనల్ మిల్లెట్ కాన్ఫరెన్స్ 'ను నిర్వహిస్తున్నాయి. 2023 ఆగస్టు 30 నుంచి 31 వరకు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ నేతలు, పరిశోధకులు, రైతులు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంఘాలు పాల్గొంటాయి.
కెన్యాలోని నైరోబీలో గురువారం జరిగిన 'ఇండియా-ఆఫ్రికా ఇంటర్నేషనల్ మిల్లెట్ కాన్ఫరెన్స్' అధికారిక కర్టెన్ రైజర్ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ సదస్సు సందర్భంగా జరిగే విశేషాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కెన్యాలోని భారత హైకమిషనర్, భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి (పంటలు), కెన్యా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ పాల్గొన్నారు. కెన్యా వ్యవసాయ రంగానికి చెందిన అధికారులు, దౌత్య సంఘం సభ్యులు, అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా వేత్తలు , రైతులు, ప్రైవేటు రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ సదస్సు ద్వారా భారత, కెన్యా ప్రభుత్వాలు 'ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ ఫుడ్'గా చిరుధాన్యాల గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.ఇంకా , సౌత్- సౌత్ మార్పిడి , చిరుధాన్యాల రంగంలో భాగస్వామ్య అవకాశాలను ప్రముఖంగా తెలియ చేయడానికి కూడా ఈ అంతర్జాతీయ సదస్సు సహాయపడుతుంది.
ఇనుము, కాల్షియం, జింక్ ,ఇతర ముఖ్యమైన పోషకాల వంటి అధిక స్థాయి ఖనిజాలతో కూడిన చిరుధాన్యాలు ఆరోగ్య ప్రయోజనాల నిధి.ఇంకా , అవి కరువు-నిరోధక, చీడ నుంచి తట్టుకోగల, వాతావరణ-స్నేహపూర్వక పంటలు. ఇవి ముఖ్యంగా సబ్-సహారా ఆఫ్రికా, ఆసియాలో చిన్నకారు రైతుల ఆదాయ అవకాశాలు , జీవనోపాధిని పెంచుతాయి.
ఇక్రిశాట్ డీజీ డాక్టర్ జాక్వెలిన్ హ్యూస్ ఈ కార్యక్రమం ఎజెండాను ప్రేక్షకులకు వివరించడంతో కర్టెన్ రైజర్ కార్యక్రమం ప్రారంభమైంది. చిరుధాన్యాల వల్ల కలిగే బహుళ ప్రయోజనాలను వివరిస్తూ యాంత్రీకరణ, విత్తన వ్యవస్థలు, డిజిటల్ వ్యవసాయం, చిరుధాన్యాలలో విలువ జోడింపు గురించి ఆమె మాట్లాడారు.
"వినియోగదారుల డిమాండ్ ను తగ్గట్టు మనం చిరుధాన్యాల విలువ గొలుసులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది, ఇది రైతులకు లాభదాయకమైన మార్కెట్లకు భరోసా ఇస్తుంది" అని డాక్టర్ హ్యూస్ పేర్కొన్నారు.
భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి (పంటలు) శ్రీమతి శుభా ఠాకూర్ తన ప్రారంభోపన్యాసంలో, నాయకులు, పెట్టుబడిదారులు, సంస్థలు , వ్యక్తుల కార్యాచరణ వ్యూహాలను వివరించడానికి ఈ సదస్సు ఎలా సహాయపడుతుందో పేర్కొన్నారు, అదే సమయంలో కీలక భాగస్వాముల మధ్య జాయింట్ వెంచర్లు, భాగస్వామ్యాలు, సాంకేతిక బదిలీకి ఈ సదస్సు ఒక మాధ్యమంగా పనిచేస్తుంది.
"భారత ప్రభుత్వం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ సహకారంతో, భారతదేశం తన జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని జరుపుకున్న 2018 నుండి చిరుధాన్యాల సాగుకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తోంది. భారత్ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2023 సంవత్సరాన్ని 'అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం'గా ప్రకటించింది. సుస్థిర వ్యవసాయ పద్ధతులను నిర్ధారించడం , చిరుధాన్యాల సాగు వాణిజ్య సామర్థ్యాన్ని పెంచడంపై మా దృష్టి ఉంది. ' అని శ్రీమతి శుభా ఠాకూర్ తెలిపారు.
కెన్యాలో భారత హైకమిషనర్ హెచ్ ఈ నంగ్యా ఖంపా తన స్వాగతోపన్యాసంలో, పౌష్టికాహార లోపం, ప్రపంచ ఆకలి సమస్యలను పరిష్కరించడంలో చిరుధాన్యాల ప్రాముఖ్యతను వివరించారు. వ్యవసాయంలో సౌత్- సౌత్ సహకారం ప్రాముఖ్యత గురించి హెచ్ఇ నంగ్యా ఖంపా మాట్లాడుతూ, "మన దేశాలలో ఆహార సమృద్ధిని కొనసాగించడానికి వ్యవసాయంలో ప్రపంచ దక్షిణ దేశాల మధ్య సహకారం కీలకమని మేము నమ్ముతున్నాము" అని అన్నారు.
ఈ సందర్భంగా కెన్యా ప్రభుత్వ వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి ఫిలిప్ కెల్లో హర్సామా మాట్లాడుతూ, చిన్నకారు రైతుల ఆర్థిక పురోగతిలో చిరుధాన్యాల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ‘చిరుధాన్యాలకు తక్కువ పెట్టుబడి అవసరం. సాపేక్షంగా తక్కువ వ్యవధిలో పండించవచ్చు. కాబట్టి, కెన్యా రైతులు ఈ అద్భుతమైన ధాన్యాల నుండి అపారమైన ప్రయోజనం పొందవచ్చు. తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు.
కర్టెన్ రైజర్ ఈవెంట్ లో భాగంగా ఇండియా-ఆఫ్రికా ఇంటర్నేషనల్ మిల్లెట్ కాన్ఫరెన్స్ లోగో ను, వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. సదస్సు లో పాల్గొనేవారు ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే సాధారణంగా చిరుధాన్యాల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వెబ్ సైట్ వీలు కల్పిస్తుంది.
అనంతరం ఇక్రిశాట్ కెన్యా రీజినల్ డైరెక్టర్ అండ్ కంట్రీ రిప్రజెంటేటివ్ డాక్టర్ రెబ్బీ హరవా అధ్యక్షతన 'ఆఫ్రికా, భారత్ లో చిరుధాన్యాలను ప్రోత్సహించడం' అనే అంశంపై చర్చ జరిగింది. కెన్యా అగ్రికల్చర్ అండ్ లైవ్ స్టాక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (కె ఎ ఎల్ ఆర్ ఒ ) డైరెక్టర్ జనరల్, అలయన్స్ ఫర్ ఎ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఆఫ్రికా (ఆగ్రా) అధ్యక్షుడు, ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ ఎ ఒ), వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (డబ్ల్యూఎఫ్ పి ), ప్రైవేట్ రంగానికి చెందిన ప్రతినిధులు ప్యానలిస్టులుగా ఉన్నారు.
మీడియాతో ముఖాముఖి, కెన్యా డిప్యూటీ హైకమిషనర్ వ్యాఖ్యలతో కార్యక్రమం ముగిసింది.
*****
(Release ID: 1937862)
Visitor Counter : 189