మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

టాంజానియాలోని జాంజిబార్ లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ఏర్పాటుకు ఎంఓయూ పై సంతకం చేసారు. ఇదే భారతదేశం వెలుపల ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి ఐ ఐ టీ క్యాంపస్


ఐ ఐ టీ మద్రాస్- జాంజిబార్ క్యాంపస్ ఉన్నత విద్య యొక్క అంతర్జాతీయీకరణకు ఒక చారిత్రాత్మక ప్రారంభాన్ని సూచిస్తుంది - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

విజ్ఞానాన్ని ద్వైపాక్షిక సంబంధాలలో కీలక అంశంగా మార్చడానికి అలాగే ప్రపంచ ప్రగతిని ముందుకు తీసుకెళ్లడానికి ఎన్ ఈ పీ మార్గం సుగమం చేస్తోంది - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

Posted On: 06 JUL 2023 12:54PM by PIB Hyderabad

జాంజిబార్-టాంజానియాలో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై విద్యా మంత్రిత్వ శాఖ (ఎంఓఇ), భారత ప్రభుత్వం, ఐ ఐ టీ మద్రాస్,మరియు విద్య మరియు వృత్తి శిక్షణ మంత్రిత్వ శాఖ (MoEVT) జాంజిబార్- టాంజానియా ల మధ్య  భారత విదేశాంగ మంత్రి డాక్టర్. ఎస్. జైశంకర్ మరియు జాంజిబార్ అధ్యక్షుడు డాక్టర్. హుస్సేన్ అలీ మ్వినీ సమక్షంలో ఈరోజు సంతకాలు జరిగాయి.   భారతదేశం వెలుపల ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి ఐ ఐ టీ క్యాంపస్ ఇదే. ఇది భారతదేశం మరియు టాంజానియా మధ్య దీర్ఘకాల స్నేహాన్ని ప్రతిబింబిస్తుంది. ఆఫ్రికా మరియు దక్షిణాది ప్రపంచ ప్రజలతో సంబంధాలను నిర్మించడంపై భారతదేశం దృష్టిని గుర్తు చేస్తుంది.

 

ఐఐటీ మద్రాస్-జాంజిబార్ క్యాంపస్ ఏర్పాటు కోసం ఎంఓయూపై సంతకం చేయడం ఉన్నత విద్య అంతర్జాతీయీకరణ దిశగా చారిత్రాత్మకమైన ప్రారంభాన్ని సూచిస్తుందని కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి మరియు వ్యాపార వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. దక్షిణ-దక్షిణ సహకారాన్ని బలోపేతం చేయడంతోపాటు ఆఫ్రికా ప్రజల తో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిబద్ధతకు ఈ చొరవ ప్రతిరూపమని ఆయన అన్నారు. జాతీయ విద్యా విధానం 2020 విజ్ఞానాన్ని ద్వైపాక్షిక సంబంధాలలో కీలక అంశంగా మార్చడానికి అలాగే ప్రపంచ ప్రగతిని ముందుకు తీసుకెళ్లడానికి మార్గం సుగమం చేస్తుందని ఆయన అన్నారు.

 

టాంజానియాలోని భారత హైకమిషనర్ బినయ శ్రీకాంత ప్రధాన్, ఐ ఐ టీ మద్రాస్ డీన్ (గ్లోబల్ ఎంగేజ్‌మెంట్) ప్రొఫెసర్ రఘునాథన్ రెంగస్వామి భారత ప్రభుత్వం ఎం ఓ ఈ, ఐ ఐ టీ మద్రాస్ తరపున మరియు ఎం ఓ ఈ వీ టీ  జాంజిబార్ తాత్కాలిక ప్రిన్సిపల్ సెక్రటరీ ఖలీద్ మసూద్ వజీర్  జాంజిబార్-టాంజానియా తరపున ఎంఓయూపై సంతకాలు చేశారు.  

 

జాతీయ విద్యా విధానం (NEP) 2020 అంతర్జాతీయీకరణపై దృష్టి సారిస్తుంది మరియు "అత్యత్తమ పనితీరు కనబరుస్తున్న భారతీయ విశ్వవిద్యాలయాలను ఇతర దేశాల్లో క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి ప్రోత్సహిస్తుందని" సిఫార్సు చేసింది.

 

టాంజానియా మరియు భారతదేశం మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గుర్తిస్తూ, జాంజిబార్-టాంజానియాలో ఐ ఐ టీ మద్రాస్ యొక్క ప్రతిపాదిత క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి పార్టీలకు ఫ్రేమ్‌వర్క్‌ను అందించే పత్రంపై సంతకం చేయడం ద్వారా విద్యా భాగస్వామ్య సంబంధం అధికారికం చేయబడింది. అక్టోబర్ 2023లో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.

 

ఈ విశిష్ట భాగస్వామ్యం ఐ ఐ టీ మద్రాస్ యొక్క అగ్రశ్రేణి విద్యా నైపుణ్యాన్ని ఆఫ్రికాలోని ఒక ప్రధాన గమ్యస్థానానికి తీసుకువస్తుంది. ఈ ప్రాంతం యొక్క అత్యవసరమైన ప్రస్తుత అవసరాలను తీరుస్తుంది. అకడమిక్ ప్రోగ్రామ్‌లు, పాఠ్యాంశాలు, విద్యార్థుల ఎంపిక అంశాలు మరియు బోధనా వివరాలు ఐ ఐ టీ మద్రాస్ ద్వారా ఉంటాయి, అయితే మూలధనం మరియు నిర్వహణ వ్యయాన్ని జాంజిబార్-టాంజానియా ప్రభుత్వం భరిస్తుంది. ఈ క్యాంపస్‌లో చేరిన విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ డిగ్రీలు ప్రదానం చేస్తారు. అత్యాధునిక ఇంటర్ డిసిప్లినరీ డిగ్రీలు విభిన్న  నిపుణుల వర్గాలను ఆకర్షిస్తాయని మరియు టాంజానియా మరియు ఇతర దేశాల నుండి కూడా విద్యార్థులను ఆకర్షిస్తాయని భావిస్తున్నారు. భారతీయ విద్యార్థులు కూడా ఈ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

 

ఐ ఐ టీ  క్యాంపస్ ఏర్పాటు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఖ్యాతిని మరియు దాని దౌత్య సంబంధాలను పెంచుతుంది. ఐ ఐ టీ  మద్రాస్ యొక్క అంతర్జాతీయ పాదముద్రను విస్తరిస్తుంది. అంతర్జాతీయ క్యాంపస్ లో విద్యార్థులు మరియు అధ్యాపకుల వైవిధ్యం కారణంగా ఇది ఐ ఐ టీ మద్రాస్ విద్య మరియు పరిశోధన యొక్క నాణ్యతను మరింత పెంచే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర అగ్రశ్రేణి విద్యా సంస్థలతో పరిశోధన సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి ఇది మరింత ఉపయోగపడుతుంది.

 

జాంజిబార్- టాంజానియాలోని ఐ ఐ టీ క్యాంపస్ ప్రపంచ స్థాయి ఉన్నత విద్య మరియు పరిశోధనా సంస్థగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ అవసరాలకు ప్రతిస్పందనగా సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి, దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంచడానికి మరియు ఈ ప్రాంతంలో పరిశోధన మరియు ఆవిష్కరణలకు మద్దతునిచ్చే విస్తృత లక్ష్యంతో రూపొందించబడింది. ఇది భారతీయ ఉన్నత విద్య మరియు ఆవిష్కరణల యొక్క ఆకాంక్షకు ప్రపంచానికి ఒక ఉదాహరణగా ఉపయోగపడుతుంది.

 

***


(Release ID: 1937797) Visitor Counter : 161