రాష్ట్రప‌తి స‌చివాల‌యం

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకలకు హాజరైన భారత రాష్ట్రపతి

Posted On: 04 JUL 2023 7:42PM by PIB Hyderabad

ఈరోజు (జూలై 4, 2023) హైదరాబాద్‌లో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు కార్యక్రమంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పాల్గొని ప్రసంగించారు.

 

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ అన్యాయం, దోపిడీపై అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం భారత స్వాతంత్య్ర పోరాటంలో గర్వించదగిన అధ్యాయమన్నారు. ఆయన దేశభక్తి, ధైర్యసాహసాలు ప్రజలంతా ముఖ్యంగా యువతరం తెలుసుకోవాలని ఆమె అన్నారు.

 

కుల, వర్గ వివక్ష లేకుండా సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు అల్లూరి సీతారామరాజు జీవిత పాత్ర నిదర్శనమని రాష్ట్రపతి అన్నారు. అల్లూరి సీతారామరాజును గిరిజన సంఘం పూర్తిగా దత్తత తీసుకున్నదని, గిరిజన సమాజంలోని సుఖ దుఃఖాలను కూడా ఆయన తన సంతోషం, దుఃఖంగా మార్చుకున్నారని ఆమె పేర్కొన్నారు. అతను గిరిజన యోధుడిగా గుర్తుండిపోయారని అదే అతని నిజమైన గుర్తింపు అని తెలిపారు. తన బలిదానం వరకు గిరిజన సమాజం హక్కుల కోసం ఆయన పోరాడుతూనే ఉన్నారని..అటువంటి గొప్ప స్వాతంత్ర్య సమరయోధుని వారసత్వాన్ని స్మరించుకోవడం మనందరి కర్తవ్యమని ఆమె అన్నారు. అల్లూరి సీతారామరాజు వంటి స్వాతంత్య్ర సమరయోధుల సహకారం గురించి పౌరులందరిలో ముఖ్యంగా యువ తరానికి అవగాహన కల్పించడానికి మేధావులు, ముఖ్యంగా సామాజిక శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారులు కృషి చేయాలని ఆమె కోరారు.

 

సమాజంలోని అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం నిస్వార్థంగా, నిర్భయంగా కృషి చేయడమే అల్లూరి సీతారామరాజు జీవిత సందేశమని రాష్ట్రపతి అన్నారు. మన ప్రవర్తనలో ఆయన ఆదర్శాలను అలవర్చుకోవడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళులు అర్పించగలమని ఆమె పేర్కొన్నారు. సమాజం, దేశ ప్రయోజనాల దృష్ట్యా అల్లూరి సీతారామరాజు విలువలు, ఆదర్శాలను అందరూ అలవర్చుకోవాలని ఆమె కోరారు.

 

రాష్ట్రపతి ప్రసంగాన్ని చూడటానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి

 

***



(Release ID: 1937378) Visitor Counter : 191