రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

మాజీ సైనికులకు ఉపాధి కల్పించేందుకు ఐబీఎంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న 'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రీసెటిల్‌మెంట్'

Posted On: 27 JUN 2023 4:46PM by PIB Hyderabad

భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మాజీ సైనికుల సంక్షేమ విభాగం కింద పని చేసే 'డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్‌మెంట్' (డీజీఆర్‌), ఐబీఎంతో ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. మాజీ సైనికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, వారి జీవనోపాధిలో అవాంతరాలు లేకుండా చూడడానికి ఈ ఒప్పందం కుదిరింది. ఎంఓయూ ద్వారా, ఐబీఎం & దాని అనుబంధ సంస్థల్లో సంబంధిత ఉద్యోగ అవకాశాలను మాజీ సైనికులు పొందేందుకు డీజీఆర్‌ సహకరిస్తుంది.

ఒప్పందంలో భాగంగా, సైనిక అనుభవజ్ఞులకు ఉత్తేజకరమైన అవకాశాలను అందించడం ద్వారా సైనిక విధులు - పౌర ఉపాధి మధ్య అంతరాన్ని తగ్గించాలన్నది ఐబీఎం లక్ష్యం. కంపెనీలో వివిధ స్థానాల్లో నియామకాలకు తగిన నైపుణ్యాలు, నడవడిక కలిగిన మాజీ సైనికులను గుర్తించడానికి డీజీఆర్‌, ఐబీఎం సహకరించుకుంటాయి. అభ్యర్థుల ఎంపిక తర్వాత, తన అవసరాలకు తగ్గట్లుగా మాజీ సైనికుల నియామకం, శిక్షణ, నైపుణ్యం పెంచడానికి తన వనరులను ఐబీఎం ఉపయోగించుకుంటుంది.

“ఐబీఎం ఇండియాతో మా భాగస్వామ్యం పరిశ్రమ, కార్పొరేట్‌ సంస్థల్లోని అవకాశాలపై మా మాజీ సైనికుల్లో మరింత స్పష్టత తెస్తుంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడం, మా మాజీ సైనికులు గౌరవప్రదమైన రెండో వృత్తిలో స్థిరపడడం వంటి లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది" అని డైరెక్టర్ జనరల్ (పునరావాసం) మేజర్ జనరల్ శరద్ కపూర్ చెప్పారు.

గత సంవత్సర కాలంలో, 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు, 24,234 మంది మాజీ సైనికులు వివిధ రంగాల్లో లాభదాయకమైన ఉపాధిని పొందారు. ప్రతి సంవత్సరం దాదాపు 60,000 మంది సైనిక సిబ్బంది పదవీ విరమణ చేస్తున్నారు/తప్పుకుంటున్నారు. కార్పొరేట్, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మాజీ సైనికులు అదనపు నైపుణ్యాలను పొందేందుకు డీజీఆర్‌ సాయం చేస్తోంది. రెండో వృత్తి ద్వారా వారి జీవనోపాధి సులభంగా కొనసాగేలా చూస్తోంది.

 

***

 


(Release ID: 1935754) Visitor Counter : 185