నీతి ఆయోగ్
గురుగావ్‌లో జరిగే చివరి శిఖరాగ్ర సమావేశంతో తొలి సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేయనున్న 'స్టార్టప్20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్'
Posted On:
27 JUN 2023 4:36PM by PIB Hyderabad
భారతదేశ జీ20 అధ్యక్షతన, స్టార్టప్20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ జులై 3 & 4 తేదీల్లో గురుగావ్‌లో సమావేశం అవుతుంది. ఆ శిఖరాగ్ర సమావేశానికి ‘స్టార్టప్20 శిఖర్’ అని పేరు పెట్టారు.
సంస్కృతంలో "శిఖర్" అంటే "పర్వత శిఖరం" అని అర్ధం. ప్రపంచ అంకుర సంస్థల వ్యవస్థ భవిష్యత్తును రూపొందించడంలో సాధించిన శిఖర స్థాయి విజయాలకు ఇది ప్రతీక.
అధికారిక తుది విధాన ప్రకటనకు గుర్తుగా ఈ సదస్సు నిలిచిపోతుంది. జీ20 దేశాలు, ఇతర ఆహ్వానిత దేశాల ప్రతినిధులతో కూడిన స్టార్టప్20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ ఉమ్మడి విజ్ఞానం & అవిశ్రాంత ప్రయత్నాలను ఆ సమగ్ర పత్రం సూచిస్తుంది. పరివర్తన & సమ్మిళిత అంకుర సంస్థల వ్యవస్థ, వేగవంతమైన ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణలు, దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు విధాన ప్రకటన పునాది వేస్తుంది.
ఆ రెండు రోజుల్లో వైవిధ్యభరితంగా, లీనమయ్యేలా సదస్సు ఉంటుంది. విజ్ఞానాన్ని పెంచే చర్చలు, ప్రదర్శనలు, అద్భుతమైన నెట్‌వర్కింగ్ అవకాశాలు ఉంటాయి. పరిశ్రమ నిపుణులు, విధాన నిర్ణేతలు, నాయకులతో అనుసంధానం కావడానికి, వ్యూహాత్మక పొత్తులు కుదుర్చుకోవడానికి, ప్రపంచ స్థాయి అంకుర సంస్థల పథాన్ని రూపొందించడానికి ఇక్కడ అవకాశం ఏర్పడుతుంది.
ఈ సదస్సులో పాటు ఉత్పత్తి ప్రదర్శనలు కూడా ఉంటాయి. అంకుర సంస్థలు, తాము రూపొందించిన ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తాయి. అంతే కాకుండా, పెట్టుబడిదార్లను ఆకర్షించే చర్చలు, మార్గదర్శక కార్యక్రమాలు, ఇతర నెట్‌వర్కింగ్ అవకాశాల్లోనూ పాల్గొంటాయి. ఇతర స్టార్టప్20 కార్యక్రమాల తరహాలోనే ఇక్కడ కూడా కళ, సంస్కృతుల మేళవింపు చూడవచ్చు.
ఆర్థిక వృద్ధి, సామాజిక ప్రభావం అంశాల్లో అంకుర సంస్థల అపార సామర్థ్యాన్ని ఈ శిఖరాగ్ర సదస్సు ప్రతిబింబిస్తుంది. ఆవిష్కరణలు, వ్యవస్థాపకతను పెంపొందించే వాతావరణం ద్వారా, అంకుర సంస్థల పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడం, ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పన, సుస్థిరాభివృద్ధిని ఈ సదస్సు ప్రోత్సహిస్తుంది.
స్టార్టప్20కి అధ్యక్షత వహిస్తున్న డా.చింతన్ వైష్ణవ్ ఈ సదస్సు పట్ల ఉత్సాహం వ్యక్తం చేశారు. "ఈ సంవత్సరం స్టార్టప్20 ప్రయాణంలో ఈ చివరి దశను ఒక నూతన ఆరంభంగా నేను భావిస్తున్నాను. నెల రోజుల కార్యక్రమాల ముగింపును గురుగావ్‌లో మాతో కలిసి సమిష్టిగా జరుపుకోవాలని ప్రతినిధులందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అంకుర సంస్థల సామర్థ్యాన్ని వెలికితీసి, వాటి శక్తివంతమైన, స్థిరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేసే మొట్టమొదటి శక్తిమంతమైన ప్రకటనపై మేం ఏకాభిప్రాయం సాధించాం."
ప్రపంచ అంకురసంస్థల వ్యవస్థ భవిష్యత్తును రూపొందించే లక్ష్యంతో భారతదేశ జీ20 అధ్యక్షతన స్టార్టప్20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ పని చేస్తుంది. జీ20 దేశాలు, ఆహ్వానిత దేశాల ప్రతినిధులతో కూడిన స్టార్టప్20, ఆర్థిక వృద్ధి & సామాజిక ప్రభావం అంశాల్లో అంకుర సంస్థల పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి ప్రయత్నిస్తుంది.
***
(Release ID: 1935753)