రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఎంక్యూ-9బి డ్రోన్‌ల కొనుగోలు: ఊహాజనిత వార్తలను నమ్మొద్దు

Posted On: 25 JUN 2023 12:46PM by PIB Hyderabad

దేశ రక్షణ పరికరాల కొనుగోలు మండలి (డీఏసీ), ఈ నెల 15న, రిమోట్‌ పద్ధతిలో నిర్వహించే ఎయిర్‌క్రాఫ్ట్‌ వ్యవస్థల (ఆర్‌పీఏఎస్‌) కొనుగోలుకు (ఏవోఎన్‌) ఆమోదం తెలిపింది. 31 ఎంక్యూ-9బి (16 ఆకాశ రక్షణ, 15 సముద్ర రక్షణ) హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (హేల్‌) ఆర్‌పీఏఎస్‌ల కోసం వచ్చిన ప్రతిపాదనను ఆమోదించింది. విదేశీ రక్షణ పరికరాల అమ్మకాలు (ఎఫ్‌ఎంఎస్‌) మార్గం ద్వారా సైనిక అవసరాల కోసం అమెరికా నుంచి ఈ కొనుగోళ్లు చేస్తారు. అనుబంధ పరికరాలతో పాటు సేకరించాల్సిన యూఏవీల సంఖ్య కూడా ఏవోఎన్‌లో ఉంది.

అమెరికా ప్రభుత్వం అంచనా వేసిన 3,072 మిలియన్ డాలర్ల వ్యయానికి అనుగుణంగా ఏవోఎన్‌ ఉంది. అమెరికా ప్రభుత్వం నుంచి విధానపరమైన ఆమోదం లభించిన తర్వాత తుది ధర నిర్ణయిస్తారు. రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంవోడీ), ఇతర దేశాలకు జనరల్ అటామిక్స్‌ను (జీఏ) అందించే అత్యుత్తమ ధరతో కొనుగోలు వ్యయాన్ని పోల్చి చూస్తుంది. ఈ కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది, ముందుగా నిర్దేశించిన విధానం ప్రకారం పూర్తవుతుంది.

ఎఫ్‌ఎంఎస్‌ విధానంలో, అమెరికా ప్రభుత్వానికి అభ్యర్థన లేఖ (ఎల్‌వోఆర్‌) పంపుతారు. అందులో, సైనిక అవసరాలు, పరికరాల వివరాలు, సేకరణ నిబంధనలు ఉంటాయి. ఎల్‌వోఆర్‌ ఆధారంగా, అమెరికా ప్రభుత్వం & భారత రక్షణ శాఖ ఆఫర్ & అంగీకార లేఖను (ఎల్‌వోఏ) ఖరారు చేస్తాయి. అమెరికా ప్రభుత్వం అందించే ధర, నిబంధనలకు అనుగుణంగా పరికరాల వ్యయం, సేకరణ నిబంధనలను చర్చల ద్వారా ఖరారు చేస్తారు.

పరికరాల ధర, కొనుగోలు నిబంధనల గురించి సామాజిక మాధ్యమల్లో కొన్ని ఊహాజనిత వార్తలు వచ్చాయి. ఇవి అనాలోచితమైనవి, వేరే ఉద్దేశాలతో, సేకరణ ప్రక్రియను నిర్వీర్యం చేసే లక్ష్యంతో ఉన్నాయి. కొనుగోలు ధర, ఇతర నిబంధనలు, షరతులు ఇంకా ఖరారు కాలేదు. చర్చల ద్వారా ఖరారు అవుతాయి. ఈ విషయంలో, సాయుధ బలగాల నైతికతపై, కొనుగోలు ప్రక్రియపై ప్రతికూల ప్రభాం చూపే తప్పుడు వార్తలు/తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి.

 

***



(Release ID: 1935275) Visitor Counter : 132