శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
అంకుర సంస్థల పురోగతి పరిశీలనకు ఒక యంత్రాంగాన్ని ప్రతిపాదించిన డాక్టర్ జితేంద్ర సింగ్
"అంకుర సంస్థల సుస్థిర ఎదుగుదలకు, నవకల్పనలకు సాంకేతిక, ఆర్థిక సహకారం అందిస్తున్న మోదీ ప్రభుత్వం "
సైన్స్ మంత్రిత్వశాఖలు, విభాగాల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
Posted On:
22 JUN 2023 6:01PM by PIB Hyderabad
శాస్త్ర సాంకేతిక శాఖ సహాయమంత్రి (స్వతంత్ర ప్రతిపత్తి), ప్రధాని కార్యాలయ శాఖ సహాయ మంత్రి, సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పెన్షన్లు, అణువిద్యుత్, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ దేశంలో అంకుర సంస్థల సంఖ్య లక్ష దాటిన నేపథ్యం వాటి పనితీరును ఎప్పటి కప్పుడు పర్యవేక్షించి పురోగతిని సమీక్షించేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు.
అలాంటి యంత్రాంగం వలన అంకుర సంస్థల ఎదుగుదలను చాలా నిశితంగా గమనించే అవకాశం ఉంటుందని, వాటికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూడటం ద్వారా అవి మధ్యలో మూతబడే ప్రమాదం నుంచి కాపాడ వచ్చునని అన్నారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ సాంకేతిక, ఆర్థిక సహకారం అందించిన సంస్థల విషయంలో ఇలాంటి జాగ్రత్తలు అనివార్యమన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, సిఎస్ఐ , ఎర్త్ సైన్సెస్, అణుశక్తి తదితర సైన్స్ మంత్రిత్వశాఖలు, విభాగాలతో జరిగిన ఉన్నత స్థాయి సంయుక్త సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు.
అంకుర సంస్థలకు ఎదురయ్యే అవకాశమున్న సమస్యల మీద నీతి ఆయోగ్ తో కలసి ఒక ప్రజెంటేషన్ తయారు చేయాల్సిందిగా కొంత కాలం కిందట సూచించగా అందుకు అనుగుణంగా నీతి ఆయోగ్ కు చెందిన డాక్టర్ చింతన వైష్ణవ్ ఈ రోజు సమావేశంలో ఆ ప్రజెంటేషన్ ఇచ్చారు.
నవకల్పనల లేమి, నైపుణ్యమున్న సిబ్బంది అందుబాటులో లేకపోవటం, నిధుల కొరత వంటి సమస్యల వలన కొన్ని అంకుర సంస్థల సుస్థిరత దెబ్బతినే అవకాశముందని ఈ ప్రైజంటేషన్ లో తెలియజెప్పారు. అన్ని అంకుర సంస్థలకు ఒక విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వటం ద్వారా వాటిని గుర్తించి అన్ని రంగాలలోని అంకుర సంస్థలను పర్యవేక్షించే అవకాశాన్ని పరిశీలించాలని మంత్రి ఈ సందర్భంగా ప్రతిపాదించారు.
ఇది నవకల్పనల, ఆలోచనల యుగమని డాక్టర్ జితేంద్ర సింగ్ అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని ప్రభుత్వం అన్ని రకాల ఆలోచనలకు, నవకల్పనలకు ఆర్థికంగా, సాంకేతికంగా అండగా నిలుస్తూ అవి ఎదిగి సుస్థిరం కావాలని కోరుకుంటున్నదన్నారు. దీని ఫలితంగానే భారతదేశం ప్రపంచంలోనే అత్యుత్తమ అంకుర సంస్థల పర్యావరణమున్న దేశంగా నిలిచ్చిందని, లక్షకు పైగా అంకుర సంస్థలు, 100 కు పైగా యూని కార్న్ సంస్థలు తయారయ్యాయన్నారు. వాటిని వ్యూహాత్మకంగా సుస్థిర సంస్థలుగా తయారుచేయాల్సిన సమయం వచ్చిందన్నారు.
నెలవారీ జరిగే సైన్ కార్యదర్శుల సమీక్షా సమావేశంలో భాగంగా మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చొరవతో ఈ సమావేశం ఏర్పాటైంది. వివిధ సైన్స్ విభాగాల సమన్వయం సాధించి సమీకృత వైఖరితో సమస్యలు పరిష్కరించే దిశలో సమావేశం సాగింది.
భారత్ ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ సీఈవో డాక్టర్ చింతన్ వైష్ణవ్ కూడా ప్రసంగించారు.
డి ఎస్ ఐ ఆర్ కార్యదర్శి, సి ఎస్ ఐ ఆర్ డీజీ డాక్టర్ ఎన్. కళై సెల్వి, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్, డీబీటీ కార్యదర్శి డాక్టర్ రాజేశ్ గోఖలే, ఎర్త్ సైన్సెస్ కార్యదర్శి డాక్టర్ ఎం రవిచంద్రన్, ఏఈసీ ఛైర్మన్, డీఏఈ కార్యదర్శి డాక్టర్ ఎ కే మొహంతి ఈ చర్చల్లో పాల్గొన్నారు. సైన్స్ మంత్రిత్వశాఖల, విభాగాల సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.
*******
(Release ID: 1934698)
Visitor Counter : 131