రక్షణ మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్న ఈఎన్‌సీ
Posted On:
21 JUN 2023 2:46PM by PIB Hyderabad
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, ఇవాళ, తూర్పు నౌకాదళ స్థావరం (ఈఎన్‌సీ) అన్ని స్టేషన్లు, యూనిట్లు, నౌకల్లో యోగా కార్యక్రమాలు జరిగాయి. 13,000 మంది నౌకాదళ సిబ్బంది, డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్, వారి కుటుంబ సభ్యులు తూర్పు సముద్ర తీరం వెంట జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తూర్పు నౌకాదళ స్థావరం నౌకలపై సముద్రంలో, వివిధ నౌకాశ్రయాల్లో యోగా నిర్వహించారు. ఐడీవై 2023 - 'మానవత్వం కోసం యోగా' అనే అంశంతో, భారత ప్రభుత్వం/ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించిన కామన్ యోగా ప్రోటోకాల్‌ను అనుసరించి యోగా కార్యక్రమాలు జరిగాయి.
సాధారణ కార్యకలాపాల్లో భాగంగా వివిధ దేశాలను సందర్శించే తూర్పు నౌకాదళ నౌకలు విదేశీ ఓడరేవుల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించాయి. ఇండోనేషియాలోని జకార్తాలో ఐఎన్‌ఎస్ శివాలిక్, బంగ్లాదేశ్‌లోని చట్టోగ్రామ్‌లో ఐఎన్‌ఎస్ కిల్తాన్, థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లోని ఐఎన్‌ఎస్ సుమిత్ర యోగా నిర్వహించాయి. యోగా ప్రయోజనాల గురించి స్థానిక ప్రజల్లో అవగాహన కల్పించాయి.
విశాఖపట్నం నౌకాదళ సిబ్బంది, వారి కుటుంబాలు, పాఠశాల విద్యార్థులు నౌకాశ్రయం, కేంద్రీయ విద్యాలయం, మల్కాపురం సహా అన్ని నివాస ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈషా ఫౌండేషన్ ద్వారా హఠ యోగా చేశారు.
భీమునిపట్నంలో, కళింగ బీచ్, కేంద్రీయ విద్యాలయం, నావల్ కేజీ స్కూల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వంలో యోగా ఒక ముఖ్యాంశం అని సూచించేలా త్రివర్ణ దుస్తులు ధరించారు. విశాఖపట్నంలోని స్పూర్తి అనాథాశ్రమం, గోల్డేజ్ హోమ్, ప్రత్యేక అవసరాల పిల్లల పాఠశాలలోనూ యోగా శిబిరాలు నిర్వహించారు.
తమిళనాడు, పుదుచ్చేరి నౌకాదళ ప్రాంతాల్లో ఐఎన్‌ఎస్ కట్టబొమ్మన్ సహా అన్ని నౌకలు, యూనిట్లు యోగా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నాయి. రోజువారీ జీవితంలో యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తూ బ్యానర్లు, పోస్టర్లు, యోగా చార్టులను ప్రదర్శించారు. చెన్నైలో, ప్రఖ్యాత యోగా శిక్షణ సంస్థ యోగా దర్శిని యోగా కార్యక్రమం నిర్వహించింది. నౌకాదళం, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది వారి కుటుంబాలతో పాటు పాల్గొన్నారు. కట్టబొమ్మన్ వద్ద, అంబర్ టవర్‌పై 450 మీటర్ల ఎత్తులో సామూహిక యోగా, ఆసనాలు, ప్రాణాయామాన్ని ప్రదర్శించారు. దీంతోపాటు, యోగా ప్రచారం కోసం అన్ని నౌకాదళ యూనిట్లు, పాఠశాలల్లో క్విజ్‌లు, పోస్టర్ రూపకల్పన పోటీలు, క్యూ&ఏ కార్యక్రమాలు నిర్వహించారు.


***
(Release ID: 1934174)