ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొనసాగుతున్న వడగాలులు, వేడి సంబంధిత అనారోగ్యాలపై 7 ప్రభావిత రాష్ట్రాలతో ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
సమర్థవంతమైన విపత్తు ప్రతిస్పందన, నిర్వహణ అనేది ఒక సమిష్టి చర్య; సమిష్టి చర్యలతో వడగాల్పుల వల్ల ఎలాంటి మరణాలు సంభవించకుండా తప్పక నివారించ వచ్చు; డాక్టర్ మాండవీయ
వేడి సంబంధిత అనారోగ్యాలపై జాతీయ కార్యాచరణ ప్రణాళికను పాటించాలని, ఆరోగ్య సౌకర్యాల సంసిద్ధత, అవసరమైన మందులు , లాజిస్టిక్స్ లభ్యతను నిర్ధారించాలని, ప్రజల్లో అవగాహన పెంచాలని రాష్ట్రాలకు సలహా
Posted On:
21 JUN 2023 3:13PM by PIB Hyderabad
''సమర్థవంతమైన విపత్తు ప్రతిస్పందన, నిర్వహణ అనేది సమిష్టి కృషి. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయ చర్యలతో వడగాల్పుల కారణంగా ఎలాంటి మరణాలు సంభవించకుండా చూసుకోవచ్చు.” అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు.
కొనసాగుతున్న వడగాలులు, వేడి సంబంధిత అనారోగ్యాలపై ప్రజారోగ్య సంసిద్ధతను ఏడు ప్రభావిత రాష్ట్రాల (బిహార్, ఒడిశా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ ఘడ్ , తెలంగాణ) మంత్రులు ముఖ్య కార్యదర్శులు / అదనపు ప్రధాన కార్యదర్శులు , సమాచార కమిషనర్లతో
డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ రోజు వర్చువల్ గా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్ పీ బఘేల్, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ వర్చువల్ గా పాల్గొన్నారు.
ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులలో బీహార్ విపత్తు నిర్వహణ మంత్రి శ్రీ షానవాజ్, జార్ఖండ్ ఆరోగ్య, విపత్తు నిర్వహణ మంత్రి శ్రీబన్నాగుప్తా, ఒరిస్సా విపత్తు నిర్వహణ మంత్రి శ్రీమతి ప్రతిమ , తెలంగాణ ఆరోగ్య మంత్రి శ్రీ హరీష్ రావు , ఉత్తర ప్రదేశ్ విపత్తు నిర్వహణ మంత్రి శ్రీ అనూప్ వాల్మీకి, ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి శ్రీ మాయానేశ్వర్ సింగ్ ఉన్నారు. సకాలంలో సమీక్ష నిర్వహించి రాష్ట్రాలకు నిరంతరం సహకరిస్తున్న కేంద్ర ఆరోగ్య మంత్రికి రాష్ట్ర ఆరోగ్య, విపత్తు నిర్వహణ మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్రం, రాష్ట్రాల మధ్య సకాలంలో, సమర్థవంతమైన సమన్వయం ద్వారా చేసుకోవడం ద్వారా ఆశించిన ఫలితాన్ని ఇవ్వొచ్చని బిపర్జోయ్ తుఫానుకు సంబంధించి ఇటీవలి సన్నాహక చర్యల్లో భారత్ నిరూపించిందని డాక్టర్ మాండవీయ అన్నారు. "రాష్ట్రాలు ఆలోచనలు, నైపుణ్యం , ఉత్తమ పద్ధతులను పంచుకోవడం, వేడి సంబంధిత అనారోగ్యాలను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రతి ఒక్కరినీ సుసంపన్నం చేయడానికి సహాయపడుతుంది" అని ఆయన అన్నారు. ప్రజలకు సకాలంలో హెచ్చరికలతో రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, వడగాల్పుల తీవ్ర ప్రభావాన్ని తగ్గించడానికి నివారణ సన్నద్ధత ఉండేలా చూడాలని ఆయన రాష్ట్రాలను కోరారు. జాతీయ కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా ఆరోగ్య కార్యాచరణ ప్రణాళికను ఇంకా తయారు చేయని రాష్ట్రాలు నిర్దిష్ట క్షేత్ర స్థాయి చర్యలను వివరిస్తూ, వాటిని సమర్థవంతంగా అమలు చేసేలా చూడాలని కేంద్ర ఆరోగ్య మంత్రి సూచించారు.
‘‘ఐఎండీ నుంచి వచ్చే హీట్ అలర్ట్, అంచనాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిరోజూ అన్ని రాష్ట్రాలతో పంచుకుంటుంది. రాష్ట్ర అధికారులు, వైద్యాధికారులు, ఆరోగ్య కార్యకర్తలకు హీట్ అండ్ హెల్త్ పై రాష్ట్రాలు శిక్షణా మాన్యువల్స్ రూపొందించాలి. రాష్ట్ర స్థాయి ట్రైనర్లు తమ శిక్షణ క్షేత్రస్థాయి వరకు ఉండేలా చూడాలి. వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించడం, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన శిక్షణ మాన్యువల్స్ ఉపయోగించి ముందస్తు గుర్తింపు , నిర్వహణపై దృష్టి సారించడం ద్వారా వేడి అనారోగ్య సమస్యలపై కింది స్థాయి కార్మికులకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం” అని ఆయన పేర్కొన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా చూడటం ద్వారా ఆరోగ్య కేంద్రాల స్థాయిలో విపరీతమైన వేడిని తట్టుకునే సామర్థ్యాన్ని పెంచాలని, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ,కూల్/గ్రీన్ రూఫ్, విండో షేడింగ్, షేడ్స్ మొదలైన వాటిని అమర్చడం ద్వారా ఇన్ డోర్ వేడిని తగ్గించే చర్యలను అవలంబించాలని రాష్ట్రాలకు సూచించారు.
క్షేత్రస్థాయి నుంచి ఖచ్చితమైన తేదీ లేకపోవడం గురించి ప్రస్తావించిన శ్రీ నిత్యానంద్ రాయ్, వడగాల్పులు, మరణాలు, కేసులతో సహా క్షేత్ర స్థాయి డేటాను పంచుకోవాలని, తద్వారా పరిస్థితిని వాస్తవికంగా అంచనా వేయవచ్చునని రాష్ట్రాలకు తెలిపారు.
రాష్ట్రాలలో ఐఎండీ హెచ్చరికలు అందిన వెంటనే సకాలంలో చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. సకాలంలో, ముందస్తుగా, నివారణ చర్యలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం వడగాలుల తీవ్ర ప్రభావాన్ని తగ్గించడంలో ఎంతగానో దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజల్లో సమాచార, అవగాహన కార్యక్రమాలను పెంచాలని సహాయ మంత్రి (హెచ్ ఎఫ్ డబ్ల్యు) డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ రాష్ట్రాలను కోరారు. వడగాలుల దుష్ప్రభావాలను పరిష్కరించడానికి రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికల అమలును క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాలని ఆమె రాష్ట్రాలను కోరారు.
వడగాల్పుల పరిస్థితిపై రాష్ట్రాలకు క్రమం తప్పకుండా సలహాలు ఇవ్వాలని హెచ్ ఎఫ్ డబ్ల్యు సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్ పి బఘేల్ స్పష్టం చేశారు.
మొత్తం ఎమర్జెన్సీ ఓపీడీ, అనుమానిత, ధృవీకరించిన హీట్ స్ట్రోక్ కేసులు, మరణాల గమనాన్ని కవర్ చేయడం; ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫామ్ (ఐహెచ్ ఐపీ) పోర్టల్ ప్రకారం వారి రిపోర్టింగ్ సహా భారతదేశంలో మొత్తం వడ దెబ్బ కేసులు, మరణాలు , ఏడు ప్రభావిత రాష్ట్రాలలో వేడి సంబంధిత అనారోగ్యాల సమగ్ర స్థితి, విశ్లేషణను ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు సమర్పించారు.
2021 జూలైలో విడుదల చేసిన వేడి సంబంధిత అనారోగ్య సమస్యలపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక లో వడదెబ్బ కేసులు , మరణాలపై నిఘా కోసం ఎస్ఓపిలు; వేసవి సీజన్ కు ముందు , సకాలంలో సన్నద్ధత ప్రణాళిక, బలహీన వర్గాలలో హీట్ రిలేటెడ్ ఇల్ నెస్ (హెచ్ ఆర్ ఐ)పై ప్రత్యేక దృష్టి సారించడం సహా వడగాల్పులు, వేడి సంబంధిత అనారోగ్యాలు, ప్రాథమిక స్థాయి నుంచి తృతీయ స్థాయి వరకు వాటి నిర్వహణ వల్ల ఎదురయ్యే సవాళ్లను వివరించారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన రెండు సలహాలను కూడా రాష్ట్రాలకు గుర్తు చేశారు. వడదెబ్బ ప్రభావాన్ని పరిష్కరించడానికి , కేసుల నిర్వహణకు ఆరోగ్య సౌకర్యాలను సమర్థవంతంగా సిద్ధం చేయడానికి వేడి సంబంధిత అనారోగ్యాలపై జాతీయ కార్యాచరణ ప్రణాళికను పాటించాలని రాష్ట్రాలను కోరుతూ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి 2023 ఫిబ్రవరి 28 న అన్ని ప్రధాన కార్యదర్శులకు అడ్వైజరీ జారీ చేశారు.
ప్రజలకు అవసరమైన మందులు, ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్, ఐస్ ప్యాక్ లు, ఓఆర్ఎస్, తాగునీరు, ఐఈసీ యాక్టివిటీ పరంగా ఆరోగ్య సదుపాయాల సన్నద్ధతను సమీక్షించాలని రాష్ట్రాలకు సూచించింది.
సాధారణ ప్రజలతో పాటు బలహీన ప్రజలు పాటించాల్సినవి, చేయకూడని వాటిపై విస్తృత అవగాహన కల్పిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రెండో సలహాను జారీ చేసింది. దీన్ని టెంప్లేట్ గా ఉపయోగించి ప్రాంతీయ భాషల్లోకి అనువదించాలని, వర్క్ ప్లేస్ సన్నద్ధత గైడెన్స్ కోసం యజమానులకు
ఎన్ పీసీసీహెచ్ హెచ్ అడ్వైజరీని అనుసరించాలని రాష్ట్రాలకు సూచించింది.
ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఆరోగ్య మంత్రిత్వ శాఖ) శ్రీ సుధాంష్ పంత్, ఐసిఎంఆర్ డిజి డాక్టర్ రాజీవ్ బహల్, శ్రీ లవ్ అగర్వాల్, ఎఎస్ (ఆరోగ్య మంత్రిత్వ శాఖ),
ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్, ఐఎండి డిజి డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర, న్యూఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాస్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
****
(Release ID: 1934173)
Visitor Counter : 191