బొగ్గు మంత్రిత్వ శాఖ

2022-23 ఆర్థిక సంవత్సరానికి బొగ్గు, లిగ్నైట్ గనులకు స్టార్ రేటింగ్ ఇచ్చే ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రకటించిన బొగ్గు మంత్రిత్వ శాఖ


పోటీతత్వం & తవ్వకాల్లో స్థిరత్వాన్ని ప్రోత్సహించడంపై దృష్టి

Posted On: 21 JUN 2023 2:29PM by PIB Hyderabad

గనుల మధ్య పోటీతత్వాన్ని పెంచడానికి; చట్టపరమైన నిబంధనలు పాటించడం, అధునాతన సాంకేతికత వినియోగం, ఆర్థిక విజయాల ఆధారంగా గనుల పనితీరును గుర్తించడానికి, 2022-23 ఆర్థిక సంవత్సరానికి బొగ్గు, లిగ్నైట్ గనులకు స్టార్ రేటింగ్ ఇచ్చే ప్రక్రియను ప్రారంభించినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

తవ్వకం కార్యకలాపాలు, పర్యావరణ సంబంధిత కొలమానాలు, సాంకేతికతల స్వీకరణ, ఉత్తమ తవ్వకం పద్ధతులు, ఆర్థిక పనితీరు, పునరావాసం, కార్మికుల సంబంధిత అంశాలు, భద్రత & రక్షణ అనే ఏడు కీలక విషయాల్లోని వివిధ అంశాల ఆధారంగా గనుల పనితీరును మదింపు చేయడం స్టార్ రేటింగ్ విధానం లక్ష్యం.

బొగ్గు, లిగ్నైట్ గనులు స్టార్ రేటింగ్ కార్యక్రమంలో నమోదు చేసుకోవడానికి ఈ సంవత్సరం నోటిఫికేషన్‌ను 30 మే 2023న జారీ చేశారు. నమోదు కోసం స్టార్ రేటింగ్ పోర్టల్‌ను 01.06.2023న ప్రారంభించారు. 19.06.2023 వరకు, ఈ స్వల్ప కాలంలోనే 376 గనులు దరఖాస్తు చేసుకున్నాయి. 2018-19లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇదే అత్యధిక సంఖ్య. నమోదుల కోసం 30.06.2023 వరకు పోర్టల్ తెరిచి ఉంటుంది. కాబట్టి, మరిన్ని గనులు నమోదు చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ ఆశిస్తోంది.

స్టార్ రేటింగ్ కార్యక్రమంలో పాల్గొనే గనులే సొంతంగా సమగ్ర మూల్యాంకనం చేసుకునేలా తొలుత ప్రోత్సహిస్తారు, జులై 31, 2023 నాటికి ఇది పూర్తి కావాలి. స్వీయ మదింపు పూర్తయిన తర్వాత, కమిటీ నిర్వహించే తనిఖీల ద్వారా అత్యధిక మార్కులు సాధించిన గనుల్లో తొలి 10% గనులను తదుపరి అంచె కోసం ఎంపిక చేస్తారు. మిగిలిన 90% గనులు ఆన్‌లైన్ సమీక్ష ప్రక్రియలోకి వెళతాయి. ఈ గనులన్నీ ఇతర గనులను సమీక్షించడం ద్వారా మూల్యాంకనానికి సహకరించవచ్చు. సమగ్ర సమీక్ష అక్టోబర్ 31, 2023 నాటికి పూర్తవుతుంది. ఆ తర్వాత కోల్‌ కంట్రోలర్ సమీక్ష ఉంటుంది, ఇది జనవరి 31, 2024 నాటికి పూర్తవుతుంది. ఆ తర్వాత తుది ఫలితాలను ప్రకటిస్తారు. రేటింగ్‌ కార్యక్రమంలో పారదర్శకత, నిష్పాక్షికత కోసం కోల్ కంట్రోలర్స్ ఆర్గనైజేషన్‌ ద్వారా మూల్యాంకనం నిర్వహిస్తారు.

పోటీతత్వాన్ని పెంచడం, బాధ్యతాయుత తవ్వకం విధానాలను ప్రోత్సహించడం ద్వారా దేశంలో బొగ్గు, లిగ్నైట్ గనుల సంపూర్ణ పనితీరును, స్థిరత్వాన్ని పెంచడాన్ని బొగ్గు మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి గని విజయాలను సమగ్రంగా మూల్యాంకనం చేస్తూ ఐదు స్టార్ల నుంచి నో స్టార్ వరకు రేటింగ్స్‌ ఇస్తారు.

 

***



(Release ID: 1934171) Visitor Counter : 122