ప్రధాన మంత్రి కార్యాలయం
2023 అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం
“భారతదేశం పిలుపుకు స్పందించి 180 దేశాలు కలిసిరావటం చరిత్రాత్మకం, కనీవినీ ఎరగనిది”
“మనందరినీ ఏకం చేసేది యోగా”
“యోగాతో ఆరోగ్యవంతమైన, శక్తిమంతమైన సమాజం తయారై మరింత ఉమ్మడి శక్తి ప్రతిఫలిస్తుంది”
“భారత సంస్కృతి, సమాజ నిర్మాణం, ఆధ్యాత్మికత, ఆదర్శాలు, తాత్వికత, దార్శనికత మన సంప్రదాయాలను తీర్చిదిద్ది మనందరం అనుసరించేట్టు చేశాయి”
“ప్రాణుల ఐక్యతను అనుభూతి చెందే స్పృహతో యోగా మనల్ని అనుసంధానం చేస్తుంది”
“యోగా ద్వారా మనకు నిస్వార్థత అలవడుతుంది, కర్మ నుంచి కర్మయోగ యాత్రను నిర్ణయించుకుంటాం”
“మన శారీరక బలం, మన మానసిక విస్తృతి ‘అభివృద్ధి చెందిన భారత్’ కు ప్రాతిపదికలు ”
Posted On:
21 JUN 2023 7:05AM by PIB Hyderabad
అంతర్జాతీయ యోగా దినోత్సవం-2023 జరూకుంటున్న సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జాతీయ వేడుకలనుద్దేశించి వీడియో సందేశం ఇచ్చారు. మధ్య ప్రదేశ్ లోని జబల్పూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవ 9 వ జాతీయ వేడుకలకు ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్ కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గతంలో జరిగిన యోగాదినోత్సవాలలో తాను వ్యక్తిగతంగా పాల్గొన్నప్పటికీ, ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నందున వీడియో సందేశం ద్వారా అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. భారత కాలమానం ప్రకార సాయంత్రం 5.30 కి ఐక్య రాజ్య సమితి కేంద్ర కార్యాలయంలో జరిగే యోగా కార్యక్రమంలో పాల్గొంటానని కూడా తెలియజేశారు. “భారతదేశం పిలుపుకు స్పందించి 180 దేశాలు కలిసిరావటం చారిత్రాత్మకం, కనీవినీ ఎరగనిది” అని ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రతిపాదనను 2014 లో ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ ముందుంచినప్పుడు రికార్డు సంఖ్యలో దేశాలు మద్దతు తెలియజేయటాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ విధంగా యోగా ఒక ప్రపంచ ఉద్యమంగా మారిందని, అంతర్జాతీయ స్ఫూర్తికి నిదర్శమైందని అన్నారు.
‘ఓషన్ రింగ్ గ ఆఫ్ యోగా’ ఆలోచనను ప్రస్తావిస్తూ, అది యోగా దినోత్సవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చిందన్నారు. యోగాలకు, సముద్రానికి మధ్య ఉన్న పరస్పర బంధాన్ని అది గుర్తుచేస్తుందన్నారు. జలవనరులను ఉపయోగించుకుంటూ మన సైనికులు రూపుదిద్దిన ‘యోగ భారత మాల’, ‘యోగ సాగర మాల’ గురించి కూడా ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా దాకా ఉన్న రెండు పరిశోధనా స్థావరాలు రెండు ధృవాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని, అవి కూడా యోగాతో అనుసంధానమయ్యాయని అన్నారు. ప్రపంచం నలుమూలలనుంచీ, దేశం నలుమూలలనుంచీ కోట్లాది మందిఈ విశిష్ఠ వేడుకలలో పాల్గొనటం యోగాకున్న విస్తృత ప్రాధాన్యాన్ని చాటిచెబుతున్నదని ప్రధాని అభివర్ణించారు.
“మనల్ని ఏకం చేసేది యోగా” అన్న యోగుల మాటలను ప్రధాని ఉటంకించారు. “యావత్ ప్రపంచం ఒక కుటుంబంలో భాగమనే ఆలోచనకు కొనసాగింపే యోగా” అని కూడా ప్రధాని అభిప్రాయపడ్డారు. భారత అధ్యక్షతన ఈ సంవత్సరం సాగుతున్న జి-20 సమావేశాలను ప్రస్తావిస్తూ, దానికి అనుసరిస్తున్న భావన “ ఒక భూమి, ఒక కుటుంబం, ఇక భవిష్యత్తు” ను కూడా ఆయన గుర్తు చేశారు. యోగా గురించి చేస్తున్న ప్రచారం ‘వసుధైవ కుటుంబకం’ భావన స్ఫూర్తిని అందరికీ చాటి చెప్పటమేనన్నారు. ఈరోజు ప్రపంచం నలుమూలలా ఉన్న కోట్లాది మంది “వసుధైవ కుటుంబకం కోసం యోగా” అనే భావనతో యోగా చేస్తున్నారన్నారు.
యోగశాస్త్రాన్ని ఉటంకిస్తూ, యోగా ద్వారా ఆరోగ్యం, చురుకుదనం, బలం వస్తాయన్నారు. ఏళ్ల తరబడి క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేసేవారు ఆ శక్తిని అనుభూతి చెందారన్నారు. వ్యక్తిగతంగానూ, కుటుంబ పరంగానూ ఆరోగ్యానికున్న ప్రాధాన్యాన్ని నొక్కి చెబుతూ“యోగాతో ఆరోగ్యవంతమైన, శక్తిమంతమైన సమాజం తయారై మరింత ఉమ్మడి శక్తి ప్రతిఫలిస్తుంది” అన్నారు. స్వఛ్ఛ భారత్, స్టార్టప్ ఇండియా లాంటి ప్రచారోద్యమాలను ప్రస్తావిస్తూ, అవి స్వయం సమృద్ధ భారతదేశ నిర్మాణంలోనూ, దేశ సాంస్కృతిక గుర్తింపును పునరుద్ధరించటంలోనూ తమ పాత్ర పోషిస్తున్నాయన్నారు. యువత ఇలాంటి శక్తికి దోహదపడిన సంగతి గుర్తు చేశారు. “ఈ రోజు దేశం ఆలోచనాధోరణి మారింది. ఫలితంగా ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది.” అన్నారు.
“భారత సంస్కృతి, సమాజ నిర్మాణం, ఆధ్యాత్మికత, ఆదర్శాలు, తాత్వికత, దార్శనికత మన సంప్రదాయాలను తీర్చిదిద్ది మనందరం అనుసరించేట్టు చేశాయి” అని ప్రధాని మోదీ అన్నారు. భారతీయులు కొత్త ఆలోచనలకు స్వాగతం పలికారని, వాటిని పరిరక్షించటం ద్వారా దేశంలో వైవిధ్యానికి కారణమయ్యారని అన్నారు. యోగా వలన అలాంటి ఆలోచనలు బలపడతాయని, అంతర్ దృష్టి విస్తృతమవుతుందని , అది ఐకమత్యానికి దారితీసే స్పృహ కలిగిస్తుందని, ప్రాణులపట్ల ప్రేమను పెంపొందిస్తుందని వ్యాఖ్యానించారు. అందుకే మనం యోగా ద్వారా మనలో ఉన్న వైరుధ్యాలను, అవరోధాలను తొలగించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రపంచానికి మనం ’ఏక్ భారత్ , శ్రేష్ఠ భారత్’ ను ఉదాహరణగా చూపాలన్నారు.
ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగిస్తూ, కార్యాచరణలో నైపుణ్యమే యోగా అని చెప్పే శ్లోకాన్ని ఉటంకించారు. స్వాతంత్ర్య అమృత కాలంలో ఈ మంత్రం చాలా ముఖ్యమైనదని. ఎవరికి వారు తమ విధులకు అంకితం కావటం ద్వారా యోగ స్థితి సాధించ వచ్చునని సూచించారు. “యోగా ద్వారా మనకు నిస్వార్థత అలవడుతుంది, కర్మ నుంచి కర్మయోగ యాత్రను నిర్ణయించుకుంటాం” అన్నారు. యోగా ద్వారా ఆరోగ్యం మెరుగుపడటంతోబాటు మరెంతో మంచి జరుగుతుందన్నారు. “మన శారీరక బలం, మన మానసిక విస్తృతి ‘అభివృద్ధి చెందిన భారత్’ కు ప్రాతిపదికలు ” అన్నారు.
***
DS/TS
(Release ID: 1933974)
Visitor Counter : 120
Read this release in:
Bengali
,
Tamil
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada