సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్న సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

Posted On: 20 JUN 2023 4:31PM by PIB Hyderabad

21 జూన్ 2023న, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేసింది. మంత్రిత్వ శాఖ పరిధిలోని అన్ని సంస్థలు, అనుబంధ కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు 'ఉమ్మడి యోగా మార్గదర్శకాల'ను అనుసరించాలని, పూర్తిస్థాయి భాగస్వామ్యంతో ఐడీవైని పాటించాలని మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. యోగాను విస్తృతం చేయడానికి, పాల్గొనేలా ప్రజల్లో ఆసక్తి కల్పించేలా ఏఎస్‌ఐ ప్రాంతీయ కార్యాలయాల సాయంతో చిరస్మరణీయ ప్రాంతాల్లో ఐడీవై 2023ని పాటించాలని కూడా ప్రతిపాదించారు. న్యూదిల్లీలోని పురానా ఖిల్లాలో జరిగే కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి పాల్గొంటారు. దిల్లీలోని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సిబ్బంది, అధికారులు, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇతర సంస్థలు IDY వేడుకల్లో పాల్గొంటాయి.

పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న నూర్‌మహల్ సరాయ్‌లో జరిగే ఐడీవై వేడుకల్లో, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన అన్ని సంస్థలు కూడా తమ ప్రధాన కార్యాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు, 'ప్రజారోగ్యం' విషయంలో భారతదేశ ఐక్యతను ప్రపంచవ్యాప్తంగా చాటడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిబద్ధతతో ఉంది. దీంతోపాటు, విశ్వ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం పాటుబడే లక్ష్యానికి కట్టుబడి ఉంది.

 

******



(Release ID: 1933687) Visitor Counter : 152