విద్యుత్తు మంత్రిత్వ శాఖ

మయన్మార్ విద్యుత్ రంగ నిపుణుల కోసం భారతదేశంలో ఐదో శిక్షణ కార్యక్రమం ప్రారంభం

Posted On: 19 JUN 2023 4:48PM by PIB Hyderabad

భారతదేశంలో అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్‌టీపీసీ లిమిటెడ్, మయన్మార్ విద్యుత్ రంగ నిపుణుల కోసం ఐదు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విద్యుత్ రంగంలో సహకారం కోసం, భారత్‌-మయన్మార్ 'గవర్నమెంట్‌-గవర్నమెంట్‌ ఫ్రేమ్‌వర్క్' కింద ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వకు చెందిన ప్రముఖ సామర్థ్య నిర్మాణ వేదిక అయిన 'ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్'లో (ఐటీఈసీ) భాగంగా మయన్మార్ నిపుణులకు శిక్షణ ఇస్తున్నారు.

ఐదు శిక్షణ కార్యక్రమాల్లో నాలుగు పూర్తయ్యాయి. ఆ నాలుగు కార్యక్రమాలకు మయన్మార్‌ విద్యుత్ రంగ నిపుణుల నుంచి సానుకూల స్పందన లభించింది. స్మార్ట్ గ్రిడ్స్‌; క్రాస్ బోర్డర్ ఎనర్జీ ట్రేడింగ్; ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు & ఛార్జింగ్ స్టేషన్లు; మైక్రో గ్రిడ్స్‌ అంశాల్లో తొలి నాలుగు శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మొదటి రెండు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో, తర్వాతి రెండు జూన్ నెలలో నిర్వహించారు.

చివరిదైన ఐదో కార్యక్రమంలో "సౌర విద్యుత్‌ & ఫోటోవోల్టాయిక్ (పీవీ) వ్యవస్థ" అంశంపై శిక్షణ ఇస్తున్నారు. ఈరోజు, 19 జూన్ 2023న, న్యూదిల్లీలోని స్కోప్‌ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమంతో శిక్షణ ప్రారంభమైంది. ఇది ఈ నెల 23న ముగుస్తుంది. సాంకేతికాంశాలు, ఆర్థికాంశాలు, వ్యయ ప్రయోజన విశ్లేషణ, విధాన నిర్ణయాలు, ప్రాజెక్ట్ రూపకల్పన, అమలు, సవాళ్లు సహా సౌర పీవీ ప్రాజెక్ట్‌ల గురించి సమగ్ర పరిజ్ఞానాన్ని శిక్షణార్థులకు అందిస్తారు.

మయన్మార్‌లోని భారత రాయబారి వినయ్ కుమార్; ఎన్‌టీపీసీ డైరెక్టర్ (ఫైనాన్స్) జె.శ్రీనివాసన్; విదేశీ వ్యవహారాల శాఖలోని డెవలప్‌మెంట్ పార్టనర్‌షిప్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఎ.భట్టాచార్య; ఎన్‌టీపీసీ స్కూల్ ఆఫ్ బిజినెస్ డైరెక్టర్ డా.రాజేశ్వరి నరేంద్రన్; ఎన్‌టీపీసీ ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగాధిపతి జేఎస్‌ చందోక్; విదేశీ వ్యవహారాల శాఖ అండర్ సెక్రటరీ (మయన్మార్) హెచ్.సాగర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యుత్‌ రంగంలో సహకారాన్ని పెంచుకోవడంలో, నైపుణ్యాలను పెంపొందించడంలో శిక్షణ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. పదకొండు మంది మహిళలు సహా ఇరవై మంది శిక్షణార్థులు మయన్మార్‌ నుంచి వచ్చారు.

ఐటీఈసీ కార్యక్రమం కింద భారత్‌, మయన్మార్ మధ్య కొనసాగుతున్న సహకారం ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేయడానికి, విద్యుత్ రంగంలో విజ్ఞాన పరస్పర మార్పిడిని ప్రోత్సహించడంలో రెండు దేశాల నిబద్ధతకు నిదర్శనంలా నిలుస్తుంది.

ఐటీఈసీ ఆధ్వర్యంలో ఎన్‌టీపీసీ నిర్వహించే శిక్షణా కార్యక్రమాలు, నైపుణ్యం & ఉత్తమ విధానాలను పంచుకోవడం ద్వారా స్థిర & శుద్ధ ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడంలో సంస్థకున్న అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది.

 

***



(Release ID: 1933611) Visitor Counter : 106