Posted On:
17 JUN 2023 5:53PM by PIB Hyderabad
అంతర్జాతీయ చిరుధాన్యాల (శ్రీ అన్న) సదస్సులో భారత వ్యవసాయ పరిశోధనామండలి (ఐసీఏఆర్)- భారత చిరు ధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) చిరుధాన్యాల (శ్రీ అన్న) విశిష్ట అంతర్జాతీయ కేంద్రాన్ని ప్రకటించిన తరువాత గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ విశిష్ట కేంద్రం పాత్ర గురించి పునరుద్ఘాటించారు. చిరుధాన్యాలను ప్రోత్సహించటం లోనూ, వినియోగించటంలోనూ పోషించే పాత్ర మీద హైదరాబాద్ లో జరిగిన జి-20 వ్యవసాయ మంత్రిత్వశాఖల సమావేశంలో వీడియో సందేశం ఇచ్చారు.
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం పాటిస్తున్న నేపథ్యంలో ఐసీఏఆర్-ఐఐఎంఆర్ మీద వ్యవసాయ మంత్రులకు, జి-20 ప్రతినిధులకు ప్రత్యక్ష అనుభవం కల్పించేందుకు ఒక సాంకేతిక యాత్ర నిర్వహించారు. హైదరాబాద్ లో జూన్ 15-17 మధ్య జరిగిన జి-20 వ్యవసాయ మంత్రిత్వశాఖల సమావేశంలో భాగంగా ఈ యాత్ర ఏర్పాటు చేశారు.
ఈ యాత్రలోనూ, ప్రదర్శనలోనూ 300 మందికి పైగా పాల్గొన్నారు. వారిలో గౌరవ వ్యవసాయ మంత్రులు, జి-20 దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతోబాటు భారతదేశానికి చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు.
వ్యవసాయ మంత్రులకు సంప్రదాయ స్వాగతం పలికిన తరువాత ప్రతినిధులందరినీ ఐఐఎంఆర్ ఆవరణలోని వ్యవసాయ క్షేత్రాలకు తీసుకువెళ్లారు. అక్కడ పండిస్తున్న ఎనిమిది రకాల చిరుధాన్యాల పంటలను అందరూ స్వయంగా వీక్షించారు. ఈ సందర్భంగా జి-20 వ్యవసాయ మంత్రులు చిరుధాన్యాలను ప్రోత్సహించటం పట్ల తమ అంకిత భావానికి చిహ్నంగా ఉమ్మడిగా చిరుధాన్యాల గింజలు నాటారు.
ఆ తరువాత ఐఐఎంఆర్ ఆవరణలో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల శుద్ధి యూనిట్లను కూడా వ్యవసాయ మంత్రులు సందర్శించారు. అందులో ప్రాథమిక శుద్ధి విభాగం, బేకరీ విభాగం, పాకేజింగ్ విభాగం, ఫ్లాకింగ్ విభాగం, శీతలీకరణ విభాగం , బిస్కెట్ల తయారీ విభాగం లాంటివి ఉన్నాయి. ఈ శుద్ధి యంత్రాలు వివిధ చిరుధాన్యాల విలువ పెంచే మఫిన్స్, కుకీస్, నూడుల్స్ లాంటి ఉత్పత్తులు తయారుచేస్తాయి.
మంత్రులు, ఇతర ప్రతినిధులు న్యూట్రీహబ్ ను కూడా సందర్శించారు. ఈ న్యూట్రీ హబ్ భారత ప్రభుత్వ సహకారంతో రూపుదిద్దుకున్న టెక్నాలజీ బిజినెస్ ఇన్ క్యుబేటర్. దీన్ని హైదరాబాద్ లోని భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ ఐసీఏఆర్-ఐఐఎంఆర్ నిర్వహిస్తోంది. న్యూట్రీ హబ్ లో ఈ ఇన్ క్యుబేషన్ కార్యక్రమం చిరుధాన్యాల అంకుర సంస్థలను ప్రోత్సహించటానికి చేపట్టారు. వారికి అవసరమైన సాంకేతిక సహకారం ఇక్కడ లభిస్తుంది.
ఇక్కడి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ప్రతినిధులు తమ తమ దేశాల రుచులకు అనుగుణంగా తయారుచేసిన చిరుధాన్యాల వంటకాలను ఆస్వాదించారు. ఐఐఎంఆర్ లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చిరుధాన్యాలకు సంబంధించిన సమాచార బదలీ, సాంకేతికత వాడకం, ఉత్పత్తిని తీర్చిదిద్దటం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తుంది,.
ఈ యాత్రలో ముఖ్యమైన అంశం – చిరుధాన్యాల మీద ప్రదర్శన. ఈ ప్రదర్శనలో దేశం నలుమూలలనుంచి ఎంపిక చేసిన రైతు ఉత్పత్తి సంస్థలు, చిరుధాన్యాల ఎగుమతిదారులు, చిరుధాన్యాల ఆధారిత అంకురసంస్థల ఆధ్వర్యంలో 30 ప్రత్యేకమైన స్టాల్స్ ఏర్పాటు చేశారు.
గౌరవ వ్యవసాయ, రైతుసంక్షేమ శాఖ సహాయ మంత్రి సుశిర్ శోభ కరండ్లజే ఈ సందర్భంగా మూడు పుస్తకాలు ఆవిష్కరించారు. వాటిలో ఒకటి చిరుధాన్యాల వంటకాలమీద భారత పాకశాస్త్ర నిపుణుల సంఘాల సమాఖ్యకు చెందిన నిపుణులు రాసిన వంటల పుస్తకం కాగా, రకరకాల సంప్రదాయ చిరుధాన్యాల వంటకాల మీద ఐఐఎంఆర్ ప్రచురించిన పుస్తకం ఇంకొకటి, భారత చిరుధాన్యాల అంకుర సంస్థల సమాచారంతో కూడినది మరొక గ్రంధం.
చిరుధాన్యాలను ప్రధాన స్రవంతి ఆహారంలో కలపాలన్న భారతదేశ కృషికి చిరుధాన్యాలు పండించే వివిధ దేశాల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అదే సమయంలో చిరుధాన్యాలకు ప్రాచుర్యం కల్పించటానికి ఐఐఎంఆర్ అనుసరిస్తున్న సాంకేతికత ఆధార వైఖరి, చిరుధాన్యాల శుద్ధి విభాగాల ఏర్పాటును, ఎగుమతులను, అంకుర సంస్థలను ప్రోత్సహిస్తున్న తీరు చిరుధాన్యాల విషయంలో భారత్ చేపట్టిన నాయకత్వ పాత్రను, అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సర వేడుకల నిర్వహణను మరింత ముందుకు తీసుకువెళుతోంది.
***