విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఐఐటీ జోధ్‌పూర్‌లో 1 మెగావాట్ల పైకప్పు సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించిన ఎన్‌టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్; ఐఐటీ విద్యుత్ అవసరాల్లో 15% ఇది తీరుస్తుంది

Posted On: 16 JUN 2023 1:28PM by PIB Hyderabad

ఎన్‌టీపీసీ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన ఎన్‌టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్ (ఎన్‌వీవీఎన్‌), ఈ నెల 14న, రాజస్థాన్‌లోని ఐఐటీ జోధ్‌పూర్‌లో మొదటి పైకప్పు సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. గ్రిడ్-అనుసంధానిత ఈ 1 మెగావాట్‌ ప్రాజెక్టును రెస్కో (పునరుత్పాదక ఇంధన సేవ సంస్థ) నమూనా కింద ఏర్పాటు చేశారు. 25 సంవత్సరాల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు. పైకప్పు సౌర విద్యుత్‌ ఉత్పత్తి వ్యవస్థను ఏర్పాటు చేయడానికి, రెస్కో నమూనా కింద, మొత్తం సౌర వ్యవస్థను రెస్కో డిజైన్‌ చేస్తుంది, నిర్మిస్తుంది, నిధులు సమకూరుస్తుంది, నిర్వహిస్తుంది. ఒప్పంద ప్రకారం నెలవారీ యూనిట్ల ఉత్పత్తికి ఐఐటీ జోధ్‌పూర్‌ డబ్బులు చెల్లిస్తుంది. డిస్కమ్ ఉత్పత్తి చేసిన యూనిట్‌లను విద్యాసంస్థ విద్యుత్ బిల్లులో కలుపుతారు.

ఐఐటీ ప్రాంగణంలోని 14 భవనాల పైకప్పులపై ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు సంవత్సరానికి సుమారు 14.9 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది, ఐఐటీ జోధ్‌పూర్ విద్యుత్ అవసరాల్లో 15% తీరుస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల సంవత్సరానికి 1,060 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయి.

దేశంలో పెరుగుతున్న విద్యుత్‌ వాణిజ్యం అవకాశాలను ఉపయోగించుకోవడానికి ఎన్‌టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్‌ను 2002 సంవత్సరంలో ఎన్‌టీపీసీ ఏర్పాటు చేసింది. కేంద్ర విద్యుత్‌ నియంత్రణ కమిషన్ తాజా నిర్దేశం ప్రకారం, ఎన్‌వీవీఎన్‌కు అత్యధిక కేటగిరీ 'I' పవర్ ట్రేడింగ్ లైసెన్స్‌ ఉంది.

జిప్సమ్‌ విభాగంలో వర్తకం చేస్తున్న ఎన్‌వీవీఎన్‌, ఇప్పుడు పునరుత్పాదకత, ఈ-మొబిలిటీ, వ్యర్థాలను హరిత ఇంధనంగా మార్చడం, విద్యుత్‌ విలువ గొలుసులో పూర్తి స్థాయి వ్యాపార పరిష్కారాలను అందించడం వంటి విభాగాల్లోకి కూడా అడుగు పెట్టింది.

***



(Release ID: 1932929) Visitor Counter : 169