గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వచ్ఛ తీర్థం వైపు సాగుతున్న - అమర్‌నాథ్ యాత్ర

Posted On: 12 JUN 2023 12:13PM by PIB Hyderabad

యాత్రికులకు పరిశుభ్రమైన, వ్యర్ధ రహిత వాతావరణాన్ని నిర్ధారించడానికి, "స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0" కింద పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.  పరిశుభ్రత, బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్మూలనను ప్రోత్సహించే స్వచ్ఛమైన పారిశుద్ధ్య సౌకర్యాలపై అవగాహనా ప్రచారాలతో పాటు బలమైన వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థను అమలు చేయడం జరుగుతోంది.  ఈ చర్యలు అమర్‌నాథ్ యాత్రకు చెందిన పరిశుభ్రతా ప్రమాణాలను గణనీయంగా పెంచాయి.  భక్తులకు పర్యావరణ స్పృహతో కూడిన తీర్థయాత్రగా మార్చాయి.  దక్షిణ కాశ్మీర్‌ లోని అమర్‌ నాథ్ యాత్రలోని పవిత్ర గుహను ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు నెలల్లో పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు.  ఇది గణనీయమైన వ్యర్థాల ఉత్పత్తికి దారి తీస్తుంది.  తీర్థయాత్ర పవిత్రతను కాపాడుకోవడానికి వీలుగా వ్యర్థ పదార్థాల నిర్వహణకు సమర్థవంతమైన వ్యూహాలు రూపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

2022 లో అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా, ఆ మార్గంలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందుకు మొత్తం 127 మరుగుదొడ్లు, 119 మూత్రశాలలతో పాటు, 40 చోట్ల స్నానాలు చేయడానికి, పట్టణ స్థానిక సంస్థలు (యు.ఎల్.బి.లు)  తగిన ఏర్పాటు చేసి నిర్వహించాయి.  అదనంగా, ఈ యాత్ర కోసం, యు.ఎల్.బి.లు మరో 780 మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేసి, నిర్వహించాయి.  వంద శాతం వ్యర్థాల సేకరణను సాధించడం కోసం యు.ఎల్.బి. లు ప్రతి రోజూ జంట కంపార్ట్‌మెంట్లు ఉండే 10 వాహనాలను ఉపయోగించాయి.   అదేవిధంగా, వ్యర్థాలను వేరు చేసేందుకు వీలుగా, అన్ని శిబిరాల వద్ద 145 జంట డబ్బాలను కూడా ఏర్పాటు చేశారు.  మహిళల మరుగుదొడ్ల వద్ద పారిశుధ్య వ్యర్థాలను పారవేయడానికి వీలుగా ప్రత్యేకంగా నల్లటి చెత్త బుట్టలను ఉంచారు.  గత ఏడాది యాత్రలో దాదాపు 150 మెట్రిక్ టన్నుల తడి చెత్త, 130 మెట్రిక్ టన్నుల పొడి చెత్త, 10 నుంచి 12 మెట్రిక్ టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి.  ఈ విధంగా, ఈ యాత్రలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను తొలగించడానికి వీలుగా, యు.ఎల్.బి.లు, ప్రతి రోజు, 14 డి-స్లడ్జింగ్ వాహనాలతో పాటు, అత్యవసర పరిస్థితుల కోసం అదనపు వాహనాలను కూడా సిద్ధంగా మోహరించారు.  యు.ఎల్.బి. ల ద్వారా మొత్తం 2,596 కిలో లీటర్ల కలుషిత జలాలను విజయవంతంగా తొలగించి, దూరంగా తరలించారు. 

పరిశుభ్రత, పారిశుధ్యాన్ని నిర్వహించడం కోసం, యాత్రీకులు బస చేసే ప్రాంతాలు, వాటి ప్రక్కనే ఉన్న రహదారులు, ఇతర సంస్థల వద్ద, యు.ఎల్.బి. లు 231 మంది పారిశుద్ధ్య కార్మికులను మోహరించాయి.   ఈ కార్మికులకు తగిన యూనిఫారాలు, పి.పి.ఈ. కిట్లు, చేతి తొడుగులు, గమ్ బూట్లు, మాస్కులు, చీపుర్లు అందించడం జరిగింది. 

యాత్రీకులు బస చేసి ప్రాంతాల్లో, టి.యు.ఎల్.ఐ.పి. (ది అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్) కార్యక్రమంలో భాగంగా, పెద్ద సంఖ్యలో స్వచ్ఛాగ్రహీలను మోహరించారు.  వారు మొత్తం శుభ్రత, పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించారు. ఘన వ్యర్థాల సేకరణ, విభజనలను సులభతరం చేశారు. ఎస్.యు.పి. లను ఉపయోగించకూడదని సూచిస్తూ, స్వచ్ఛతా సందేశాన్ని వ్యాప్తి చేశారు.  మరుగుదొడ్లు, లంగర్లు, శిబిరాల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలపై, క్యూ.ఆర్. కోడ్‌ ల ద్వారా, టి.యు.ఎల్.ఐ.పి. స్వచ్ఛాగ్రహీలు యాత్రికుల నుండి అభిప్రాయాలను సేకరించారు.  యాత్రికుల కోసం ప్రత్యేకంగా సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేశారు.  అమర్‌ నాథ్ యాత్రలో భాగంగా, తీర్థయాత్ర అనుభూతిని మెరుగుపరచడానికి అనేక ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. 

సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణను నిర్ధారించే లక్ష్యంతో, జమ్మూ-కశ్మీర్‌ ప్రాంతంలో ఉన్న 10 యు.ఎల్.బి. లలో 9 ఘన వ్యర్ధాల నిర్వహణ సౌకర్యాలను 2023 మే, 12వ తేదీన ప్రారంభించడం జరిగింది.   ముఖ్యంగా, వీటిలో మూడు యు.ఎల్.బి. లు, ఖాజిగుండ్, సుంబల్, గందేర్‌ బల్ యాత్ర మార్గంలో ఉన్నాయి.  ఈ సౌకర్యాల ద్వారా రోజుకు 40 టన్నుల వరకు వ్యర్థాలను సేకరించి, తరలించడం జరుగుతుంది.  ప్రతి కేంద్రంలో పొడి వ్యర్థాల సేకరణ సదుపాయం ఉంది. ఈ కేంద్రాల్లో సేకరించిన వ్యర్థాలను వేరు చేయడం, చిన్న చిన్న ముక్కలు చేయడం, కట్టలు కట్టడం వంటి సౌకర్యాలు ఉన్నాయి.  తడి వ్యర్థాలను సేంద్రీయ ఎరువులుగా మార్చడానికి వీలుగా తగిన గుంతలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. 2023 అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన సన్నాహకాల్లో భాగంగా, ఇతర కార్యక్రమాలతో పాటు, ముందుగా నిర్మించిన మరుగుదొడ్లను కొనుగోలు చేయడం, సాధనాలు, క్రిమిసంహారకాలు, మొక్కల సేకరణ, అదనపు పారిశుద్ధ్య సిబ్బంది నియామకం, ఎక్కువ మంది స్వచ్ఛగ్రహీలను నిమగ్నం చేయడం, యాత్ర ప్రారంభానికి ముందే యాత్రీకులు బస చేసే ప్రాంతాలు, యాత్ర మార్గాలను శుభ్రం చేయడం, డి-స్లడ్జింగ్ సెప్టిక్ ట్యాంకుల ఏర్పాటు, పారిశుద్ధ్య బృందాలను ఏర్పాటు చేయడం,  నోడల్ అధికారులను నియమించడం వంటి అనేక అదనపు చర్యలు చేపట్టడం జరిగింది.   స్వచ్ఛ అమర్‌ నాథ్ యాత్ర ద్వారా, స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 మొత్తం తీర్థయాత్ర అనుభవాన్ని మెరుగుపరచడంతో పాటు, భక్తులలో పరిశుభ్రత, పరిశుభ్రత విలువలను బలోపేతం చేసింది.

 

 

*****




(Release ID: 1931892) Visitor Counter : 127