రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

సూరినామ్‌లో జరిగిన ప్రజా ఆత్మీయ సమ్మేళనంలో భారతీయ సంతతి వారినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము.


అభివృద్ధి ,ప్రగతి దిశగా సూరినామ్‌ సాగిస్తున్న ప్రయాణంలో సూరినామ్‌కు అండగా నిలిచేందుకు ఇండియా సిద్ధంగా ఉందని ప్రకటించిన శ్రీమతి ద్రౌపది ముర్ము.
సెర్బియాకు బయలుదేరి వెళ్లిన రాష్ట్రపతి.

Posted On: 07 JUN 2023 12:07PM by PIB Hyderabad

సూరినామ్‌ పర్యటన ముగింపు సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, సూరినామ్‌లో భారత రాయబారి డాక్టర్‌ శంకర్‌ బాలచంద్రన్‌, పరమారిబోలో 2023 జూన్‌ 6వ తేదీ సాయంతర్ర 6గంటలకు ఏర్పాటు చేసిన ఆత్మీయసమ్మేళనంలో, భారత సంతతి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందుగా, ఇటీవల ఒడిషాలోని బాలసోర్‌లో జరిగిన రైలుప్రమాదంలో మరణించిన వారికి ఆమె రెండు నిమిషాలు మౌనం పాటించారు..

ఈ సందర్భంగా హాజరైన భారత సంతతి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ శ్రీమతి ద్రౌపది ముర్ము, బౌగోళికంగా ఇండియా , సూరినామ్‌లు వేరు వేరు కావచ్చు కాని ఉభయదేశాలు ఉమ్మడి చరిత్ర, సంస్కృతి కలిగి ఉన్నాయని అన్నారు. సూరినామ్‌కు, సూరినామ్‌ ప్రజలకు భారత ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానం ఉందని ఆమె అన్నారు.
 సూరినామ్‌లోని భారత సంతతి ప్రజలు అక్కడి ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రగతిలో కీలక భూమిక పోషిస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని అన్నారు. దాదాపు అన్ని రంగాలలో వారు తమ ప్రతిభను కనబరుస్తున్నారని ఆమె అన్నారు. భారత సంతతికి చెందిన సూరినామీయులు సాధిస్తున్న విజయాలు, సూరినామ్‌ అభివృద్ధిలో వారి పాత్ర పట్ల  ఇండియా ఎంతో గర్వపడుతున్నదని శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు.

సూరినామ్‌ లోని భారత సంతతి ప్రజలు, ఉభయ దేశాల మధ్య స్నేహం, పరస్పర సహకారానికి వారధిగా ఉన్నారని అన్నారు. వీరు తమ తమ రంగాలలో కష్టపడి పనిచేస్తూ, ఇండియా`సూరినామ్‌ల మధ్య గల ప్రత్యేక బంధాన్ని మరింత దృఢతరం చేయాలని ఆకాంక్షించారు.
ఇవాళ ఇండియా పరివర్తనాత్మక పథంలోసాగుతున్నదని అంటూ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము,   ఇండియా శరవేగంతో సాగుతున్న ప్రగతికిఅనుగుణంగా నూతన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నదని చెప్పారు.  డిజిటల్‌ ఆర్థికవ్యవస్థ, నూతన సాంకేతికతలు, వాతావరణ మార్పులు, విజ్ఞానదాయక సమాజంగా ఏర్పడడం వంటి విషయాలలో ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా ఇండియా ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు.
భారతదేశం ఆర్థికంగా శరవేగంతో పుంజుకోవడం ప్రపంచం గుర్తింపును పొందినట్టు ఆమె తెలిపారు.
ఇండియా తన అనుభవాలను  పంచుకోవడాని, సూరినామ్‌ అభివృద్ధికి ఆదేశ ప్రగతికి అండగా నిలవడానికి ఇండియా సిద్ధంగా ఉందని చెప్పారు

అంతకు ముందు, రాష్ట్రపతి, లల్లా రూఖ్‌ మ్యూజియంను, ఆర్య దేవకర్‌ మందిర్‌ను, విష్ణుమందిర్‌ను, సందర్శించారు.  మహాత్మాగాంధీ విగ్రహానికి రాష్ట్రపతి పుష్పాంజలి ఘటించారు. అలాగే గావెలెన్‌ హెల్డెన్‌ 1902 వద్ద ఆమె నివాళులర్పించారు.
అనంతరం సాయంత్రం, రాష్ట్రపతి తమ సూరినామ్‌ , సెర్బియా పర్యటనలో చివరి భాగంగా బెల్‌గ్రేడ్‌ బయలుదేరి వెళ్లారు.

***


(Release ID: 1930616)