మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
యూజీసీ ( విశ్వవిద్యాలయాలుగా పరిగణించదగిన సంస్థలు) నిబంధనలు-2023 విడుదల చేసిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
ఈ నిబంధనల వలన అనేక నాణ్యమైన డీమ్డ్ యూనివర్సిటీలు పారదర్శకంగా ఏర్పాటు కావటానికి అవకాశాలు మెరుగు పడతాయి: శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
ఈ నిబంధనల వలన యూనివర్సిటీలు నాణ్యతా మీద దృష్టి సారిస్తాయి; పరిశోధన పర్యావరణం బలోపేతం అవుతుంది; దీర్ఘ కాలంలో ఉన్నత విద్య మార్పుకు దారితీస్తుంది : శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
02 JUN 2023 4:24PM by PIB Hyderabad
కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖామంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన ఈరోజు యూజీసీ ఛైర్మన్ శ్రీ జగదీష్ కుమార్, ఉన్నత విద్యా మంత్రిత్వశాఖ కార్యదర్శి సంజయ్ మూర్తి సమక్షంలో యూజీసీ ( విశ్వవిద్యాలయాలుగా పరిగణించదగిన సంస్థలు) నిబంధనలు-2023 విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, యూజీసీ (విశ్వవిద్యాలయాలుగా పరిగణించదగిన సంస్థలు) నిబంధనలు-2023 వలన అనేక నాణ్యమైన డీమ్డ్ యూనివర్సిటీలు పారదర్శకంగా ఏర్పాటు కావటానికి అవకాశాలు మెరుగు పడతాయన్నారు. కొత్తగా సరళతరం చేసిన మార్గదర్శకాల వలన యూనివర్సిటీలు నాణ్యతా మీద దృష్టి సారిస్తాయని, పరిశోధన పర్యావరణం బలోపేతం అవుతుందని, దీర్ఘ కాలంలో ఉన్నత విద్య మార్పుకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. జాతీయ విద్యా విధానం 2020 కి తగినట్టుగా యూజీసీ సకాలంలో స్పందించినందుకు మంత్రి అభినందించారు.
యూనివర్సిటీలు కాని విద్యా సంస్థలకు డీమ్డ్ యూనివర్సిటీ స్థాయి కల్పించాలంటే 1956 నాటు యూజీసీ చట్టం ప్రకారం ఆ అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అది సెక్షన్ 2 (ఎఫ్) లో యూనివర్సిటీ అనే మాటకు ఇచ్చిన అర్థానికి లోబడి ఉండాలి. ఆలా ఉన్నప్పుడు ప్రకటన జారీ చేస్తే ఆ సంస్థ డీమ్డ్ యూనివర్సిటీ అవుతుంది. కనీస అర్హతలు పాటిస్తున్నట్టు తేలితే ఇలాంటి అవకాశం దక్కుతుంది. దాని పాలనా వ్యవహారాలను యూజీసీ తన నిబంధనలకు అనుగుణంగా చూస్తుంది. మొదటి నియంత్రణ 2010 లో నోటిఫై కాగా, 2019 దానిలో మార్పులు జరిగాయి.
జాతీయ విద్యా విధానం – 2020ప్రకటనతో నిబంధనలు సరళతరం చేయటానికి యూజీసీ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి యూజీసీ నిబంధనలను సమీక్షించి మార్పులు చేయాలని కోరింది. ఖరారు చేసే ముందు ఈ ముసాయిదా నిబంధనలు అనేక దశలలో మార్పులకు లోనయ్యాయి. నిపుణుల కమిటీ మార్గదర్శనం, ప్రజల అభిప్రాయాలు, కమిషన్ సలహాలు లెక్కలోకి తీసుకున్న తరువాత తుది ముసాయిదాను విద్యా మంత్రిత్వశాఖ ఆమోదం కోసం పంపారు.
2019 నాటి యూజీసీ ( డీమ్డ్ యూనివర్సిటీలుగా పరిగణించే సంస్థల) నిబంధనలను పక్కనబెట్టి కొత్త నిబంధనలు రూపొందించారు. “ తేలిగ్గా అయినా, గట్టిగా” అనే సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రూపొందించిన నిబంధనలు ఇలా ఉన్నాయి:
నిబంధనలు జాతీయ విద్యా విధానం-2020 కు అనుగుణంగా ఉన్నాయి. వివిధ అంశాలలో అత్యుత్తమ ప్రతిభ సాధిం చేలా ఉన్నత విద్య అందించటం, ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పరిశోధన స్థాయిలో ఒక యూనివర్సిటీ అనే భావనకు తగినట్టుగా వ్యవహరించటం, పరిశోధన పర్యావరణాన్ని పటిష్ఠపరచటం, సామాజిక ప్రతిస్పందనతో కూడిన బోధన , అధ్యయనం, పరిశోధనం, క్షేత్ర స్థాయి పని – అనేవి డీమ్డ్ యూనివర్సిటీ లక్ష్యాలు.
డీమ్డ్ యూనివర్సిటీ ప్రతిపత్తి పొందటానికి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 3.01 సీజీపీఏ తో వరుసగా మూడేళ్ళపాటు నాక్ ‘ఎ’ గ్రేడ్ వచ్చి ఉండాలి. లేదా, అ పొందిన కార్యక్రమాలలో మూడింట రెండొంతుల కార్యక్రమాలకు వరుసగా మూడు విడతలు ఎన్ బి ఎ అక్రెడిటేషన్ లేదా, గడిచిన మూడేళ్ళు వరుసగా ఏదైనా నిర్దిష్టమైన ఎన్ ఐ ఆర్ ఎఫ్ విభాగంలో మొదటి 50 లో స్థానం పొందటం లేదా, గడిచిన మూడేళ్ళలో వరుసగా మొదటి 100 ఎన్ ఐ ఆర్ ఎఫ్ రాంకింగ్ లో ఉండాలి.
ఒకటి కంటే ఎక్కువ స్పాన్సర్ సంస్థల నిర్వహణలో ఉండే సంస్థల సమూహం కూడా డీమ్డ్ యూనివర్సిటీ హోదా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
డీమ్డ్ యూనివర్సిటీ హోదా కోసం దరఖాస్తు చేసుకునే స్పాన్సరింగ్ సంస్థలు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడి సౌకర్యాలను నిపుణుల కమిటీ అంచనావేస్తుంది. సంబంధితులతో మాట్లాడి, డాక్యుమెంట్లు పరిశీలించటం సహాయ అన్నీ వర్చువల్ పద్ధతిలో పూర్తి చేస్తుంది.
డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందిన సంస్థలు తమ పాలకమండలి ముందస్తు అనుమతితో తమ కాంపస్ లో లేదా ఆమోదం పొందిన కాంపస్ వెలుపలి కేంద్రాలలో ఏ విభాగంలోనైనా కొత్త కోర్సులు ప్రారంభించుకోవచ్చు. అయితే, అందుకు సంబంధించిన చట్టబద్ధమైన మండలి నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఉన్న సంస్థ గాని, లేదా కొత్తగా మొదలవుతున్న సంస్ఠ గాని దేశ వ్యూహాత్మక అవసరాలకు పరిష్కారం చూపటం లాంటి విశిష్టమైన అంశాలలో బోధన, పరిశోధన చేపట్టినా, భారత సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించటానికి లేదా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నా, లేదా నైపుణ్యాభివృద్ధికి, క్రీడలకు, భాషలకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నా నిపుణుల కమిటీ సంతృప్తి చెందితే ప్రత్యేక సంస్థ విభాగంలో అర్హతల నియమావళిలో మినహాయింపు పొందే వీలుంది.
నిబంధనలన్నీ ప్రధానంగా నాణ్యతను దృష్టిలో ఉంచుకొని చేసినవే. నాక్ ‘ఎ’ గ్రేడ్ కంటే తక్కువ వచ్చినా, ప్రస్తుత ఎన్ ఐ ఆర్ ఎఫ్ యూనివర్సిటీల విభాగంలో రాంకు 100 దాటినా విద్యా పరమైన కొలమానాలతో యూజీసీ నిపుణుల కమిటీ పర్యవేక్షిస్తూ ఉంటుంది. యూజీసీ కమిటీ వేలెత్తి చూపిన లోపాలను సరిదిద్దుకోలేకపోతే, కొత్త కోర్సుల ప్రారంభానికి ఇచ్చిన అనుమతులను యూజీసీ ఉపసంహరించుకోవచ్చు. .
డీమ్డ్ యూనివర్సిటీలు ఫీజు నిర్మాణం, ఆయా అధికారిక సంస్థలు అనుమతించిన సీట్ల సంఖ్య వంటి విషయాలను కచ్చితంగా పాటించాలి. అయితే, యూజీసీ, ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, జాతీయ వైద్య మండలి వంటి వేరు వేరు అధికారిక సంస్థలు అనుమతించే వేరు వేరు కోర్సులు నడుపుతున్నట్టయితే ఫీజు నిర్మాణం, సీట్ల సంఖ్య విషయంలో ఆయా సంస్థల నిబంధనలు వర్తిస్తాయి.
డీమ్డ్ యూనివర్సిటీలు ఫీజు రాయితీలు, ప్రతిభగల విద్యార్థులకు స్కాలర్ షిప్పులు ఇవ్వవచ్చు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు సీట్లు కేటాయించవచ్చు.
డీమ్డ్ యూనివర్సిటీలు తప్పనిసరిగా అకాడెమిక్ బాంక్ క్రెడిట్స్ ( ఏబీసీ) తయారు చేసి విద్యార్థులకు గుర్తింపు సంఖ్య ఇచ్చి వాళ్ళ క్రెడిట్ స్కోర్ వివరాలను ఏబీసీ పోర్టల్ లోని డిజిటల్ లాకర్ లో అప్ లోడ్ చేయాలి. సంస్థలు నిబంధనలకు లోబడి జాయింట్ డిగ్రీ కోర్సులు, డ్యూయల్ డిగ్రీ కోర్సులు కూడా నడపవచ్చు.
డీమ్డ్ యూనివర్సిటీల నిర్వహణలో పారదర్శకత వలన విద్యార్థులకు, సంస్థలకు మధ్య బలమైన బంధం ఏర్పడుతుంది. నిబంధనల వలన సంస్థలు మరింత పారదర్శకంగా తయారవుతాయి. డీమ్డ్ యూనివర్సిటీలు ప్రవేశాలకు కనీసం 60 రోజులు ముందే తమ ప్రాస్పెక్టస్ ను వెబ్ సైట్ లో ఉంచుతాయి. అందులో ఫీజు నిర్మాణం, రీఫండ్ విధానం, ప్రవేశాల ప్రక్రియ, అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య లాంటి సమాచారం ఉండాలి.. ప్రతి డీమ్డ్ విశ్వవిద్యాలయం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ క్రమం మొత్తాన్ని వెబ్ సైట్ లో ఉంచాలి. అది కనీసం ఐదేళ్ల పాటు అందుబాటులో ఉంచాలి.
*****
(Release ID: 1929612)
Visitor Counter : 224