రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ప్రభుత్వ వ్యవహారాల్లో హిందీ వినియోగం ఆత్మగౌరవాన్ని పెంపొందించి, ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ లక్ష్యానికి చేరువ చేస్తుంది: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


హిందీ వినియోగం కోసం ప్రభుత్వం సంస్కరణలు, అమలు, పరివర్తన విధానాలను పటిష్టంగా అమలు చేస్తోంది: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ హిందీ సలహా కమిటీ సమావేశంలో ప్రసంగించిన డాక్టర్ మాండవీయ

Posted On: 30 MAY 2023 2:37PM by PIB Hyderabad

హిందీని ప్రోత్సహించి ఎక్కువగా వినియోగించడం వల్ల ప్రధానమంత్రి ఆశిస్తున్న  ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్‌ లక్ష్య సాధన దగ్గరవుతుంది." అని కేంద్ర  రసాయనాలు, ఎరువుల శాఖ  మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. కేంద్ర  రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ హిందీ సలహా కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. హిందీ వినియోగాన్ని ఎక్కువ చేసి, హిందీలో కార్యకలాపాలు జరిగేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి మంత్రిత్వ శాఖలో  హిందీ సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి ఏడాది రెండు సార్లు  హిందీ సలహా కమిటీ సమావేశం అవుతుంది. మంత్రిత్వ శాఖ కార్యకలాపాల్లో హిందీ ని అధికార భాషగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం, అమలును మరింత మెరుగుపరచడానికి విలువైన సిఫార్సులను అందించడం  ప్రాథమిక లక్ష్యంగా .కమిటీ పనిచేస్తుంది. 

 కేంద్ర  రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ హిందీ సలహా కమిటీ సమావేశంలో డాక్టర్ మాండవీయ హిందీ ప్రాధాన్యతపై జాతిపిత మహాత్మా గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించారు. దేశం వేగంగా అభివృద్ధి సాధించడానికి జాతీయ స్థాయిలో హిందీ వినియోగం ఎక్కువగా ఉండాలని మహాత్మా గాంధీ సూచించారని డాక్టర్ మాండవీయ అన్నారు. మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకుని రాజ్యాంగం లోని 351వ అధికరణంలో పొందుపరిచిన విధంగా కమిటీ భారతదేశ మిశ్రమ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా  హిందీ భావవ్యక్తీకరణ మాధ్యమంగా ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నదని డాక్టర్ మాండవీయ అన్నారు. 

అధికార కార్యకలాపాల్లో మంత్రిత్వ శాఖలు హిందీని ఉపయోగించక తప్పదని మంత్రి స్పష్టం చేశారు. ' హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార భాషా శాఖ సూచించిన విధంగా హిందీ భాషను అధికారిక భాషగా అమలు చేయడానికి  రసాయనాలు , ఎరువుల మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉంది. వార్షిక ప్రణాళికలో పొందుపరిచిన లక్ష్యాలు సాధించడానికి శాఖ చర్యలు అమలు చేస్తుంది.జాతీయ భావాన్ని ప్రతిబింబించే  హిందీని  జాతీయ, సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా మంత్రిత్వ శాఖగుర్తించి గౌరవిస్తుంది' అని డాక్టర్ మాండవీయ వివరించారు. 

'ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం హిందీ వాడకం  ఎక్కువ అయ్యేలా చూసేందుకు సంస్కరణలు, అమలు, పరివర్తన విధానాలను పటిష్టంగా అమలు చేస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్ల హిందీ వాడకం ఎక్కువ అయ్యింది. అంతర్జాతీయ వేదికల్లో  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిందీ లో ప్రసంగిస్తున్నారు.అన్ని భారతీయ భాషలతో అనుబంధం కలిగి సులువుగా ఉండే హిందీని ఎక్కువగా వాడాలి అని ప్రధానమంత్రి సూచిస్తున్నారు ' అని  డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. 

హోం మంత్రి, పార్లమెంటరీ అధికార భాషా కమిటీ ఛైర్‌పర్సన్ అయిన  శ్రీ అమిత్ షా  హిందీ వాడకం ఎక్కువ అయ్యేలా చూసేందుకు ముందుండి మార్గదర్శకత్వం వహిస్తున్నారని తెలిపిన డాక్టర్ మాండవీయ  “శ్రీ అమిత్ షా స్వతహాగా హిందీ లో మంచి వక్త.  హోం శాఖలో హిందీ వాడకం ఎక్కువ అయ్యేలా కృషి చేస్తున్నారు" అన్నారు. 

ప్రభుత్వ అధికార భాష విధానం సమర్ధంగా, పటిష్టంగా అమలు జరిగేలా చూసేందుకు రసాయనాలు ,ఎరువుల మంత్రిత్వ శాఖ, మంత్రిత్వ శాఖ  విభాగాలు, సంస్థలు ,  కార్యాలయాలలో  పటిష్టమైన యంత్రాంగాలను ఏర్పాటు చేసింది. హిందీ వాడకాన్ని ఎక్కువ చేసినందుకు ప్రోత్సాహకంగా మంత్రిత్వ శాఖ విభాగాలు/కార్యాలయాలకు ప్రశంసా పత్రాలు /రాజ్‌భాషా షీల్డ్‌ను అందించారు.

హిందీ వాడకాన్నిఎక్కువ చేయడానికి అధికార భాష కమిటీ సమావేశం కీలకంగా ఉంటుందని మంత్రి అన్నారు.  “ కమిటీ  సమావేశాల ద్వారా  అధికారిక భాషా విధానాన్ని అమలు చేయడానికి దోహదపడే చర్చలు జరిగి, ప్రణాళిక సిద్ధం అవుతుంది.   ప్రభుత్వ వ్యవహారాల్లో  హిందీ వాడకం  ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉంటుంది.  ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ లక్ష్యానికి చేరువ చేస్తుంది.' అని మాండవీయ అన్నారు. 

ఈ కార్యక్రమంలో లోక్‌సభ సభ్యుడు భర్తృహరి మహతాబ్, రసాయనాలు , ఎరువుల శాఖ కార్యదర్శి అరుణ్ భరోకా, ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శి ఎస్ అపర్ణ , రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన వివిధ సీనియర్ అధికారులు, ప్రముఖ పాత్రికేయులు, హిందీ పండితులు, హిందీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 

 

***

 



(Release ID: 1928347) Visitor Counter : 143