వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ప్రామాణీకరణలో సుస్థిరతలో వినియోగదార్ల భాగస్వామ్యం పెంచడానికి ఐఎస్‌వో సభ్య దేశాల నిర్ణయం


సంపూర్ణ ఆసక్తి, విజయవంతమైన బహుపాక్షిక భాగస్వామ్యాలకు వేదికగా నిలిచిన 44వ ఐఎస్‌వో కోపోల్కో సదస్సు

Posted On: 28 MAY 2023 10:44AM by PIB Hyderabad

'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్' (బీఐఎస్‌) ఆధ్వర్యంలో, 23-26 మే 2023 వరకు నాలుగు రోజుల పాటు జరిగిన 44వ ఐఎస్‌వో కొపోల్కో సదస్సు 26.05.2023న దిల్లీలో ముగిసింది. కేంద్ర వినియోగదార్ల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి నిధి ఖరే కీలక ప్రసంగంతో ఈ సదస్సు ముగిసింది. బీఐఎస్‌ అదనపు డైరెక్టర్ జనరల్ మమత ఉపాధ్యాయ్ లాల్, కోలోప్కో ఛైర్‌ పర్సన్‌ సాడీ డైంటన్‌, ఇతర సీనియర్ అధికారులు, ఐఎస్‌వో సభ్య దేశాల ప్రతినిధులు, బీఐఎస్ సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

“ఇటీవలి సంవత్సరాల్లో వినియోగదార్ల భద్రత విషయంలో మనం గణనీయమైన అభివృద్ధిని సాధించాం. సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు సాయపడే బలమైన వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు వచ్చాయి. స్థిరత్వ ప్రమాణాలకు తగ్గట్లుగా తమ ఉత్పత్తులు ఉండేలా తయారీదార్లు నిర్ధరించుకోవాలి, ఈ-వ్యర్థాలను తగ్గించే ప్రక్రియలో వారు కూడా భాగస్వాములు కావచ్చు" అని శ్రీమతి నిధి ఖరే తన ప్రసంగంలో చెప్పారు.

బీఐఎస్ కార్యకలాపాలు, కార్యక్రమాల గురించి మమత ఉపాధ్యాయ్ లాల్ ప్రధానంగా చెప్పారు. "ప్రామాణీకరణలో వినియోగదార్ల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో మనక్ మంథన్, క్వాలిటీ కనెక్ట్ వంటి అనేక రకాల కార్యక్రమాలను బీఐఎస్ చేపట్టింది" అని వెల్లడించారు.

వినియోగదార్లకు భద్రత కల్పించే ప్రమాణాల విలువను గుర్తించేలా వినియోగదార్లలో అవగాహన పెంచడం, వాస్తవిక సమస్యలను పరిష్కరించే విశ్వసనీయమైన & దృఢమైన ప్రమాణాలను అభివృద్ధి చేయడంలో వినియోగదార్లను పాల్గొనేలా చేయడం కోసం సభ్య దేశాలు చేస్తున్న ప్రయత్నాలు, నిబద్ధతను శ్రీమతి సాడీ డైన్టన్ ప్రశంసించారు. ప్రజలు, వినియోగదార్లకు కలిగే హానిని తగ్గించేలా ఉత్పత్తి సంస్థల కోసం ఆరోగ్యకరమైన తయారీ విధానాలు రూపొందించడం ద్వారా సభ్య దేశాలు చేస్తున్న కృషిని అభినందించారు.

ప్లీనరీకి హాజరైన ఐఎస్‌వో అధికారులు 44వ కోపోల్కో సదస్సు విజయవంతంగా ముగిసిందని, సుస్థిర భవిష్యత్తు దిశగా వినియోగదార్లకు సాధికారత కల్పించే లక్ష్యాలను విజయవంతంగా సాధించిందని వెల్లడించారు. వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో వినియోగదార్లు ఎదుర్కొంటున్న సవాళ్లు గురించి లోతైన చర్చలు, జాతీయ & అంతర్జాతీయ అనుభవాల మార్పిడి జరిగిందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రమాణాల కార్యక్రమంలో చేర్చడానికి, ప్రమాణాలు & విధానాల రూపకల్పన వల్ల జరిగే వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే వాటాదార్ల అభిప్రాయాలు ప్రతిబింబించేలా ఐఎస్‌వో తన నిబద్ధతను చాటుకుందని అధికారులు చెప్పారు.

సదస్సు విజయవంతం పట్ల ఐఎస్‌వో సచివాలయం హర్షం వ్యక్తం చేసింది. “ఐఎస్‌వో/కోపోల్కో 44వ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చినందుకు, సమాజంలో &ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక భాగస్వామిగా వినియోగదార్ల ప్రాముఖ్యతను సమర్థించినందుకు, భారత ప్రభుత్వం ఆతిథ్యం క్ష మద్దతు పట్ల బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, భారత ప్రభుత్వానికి ఐఎస్‌వో తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40 మంది సభ్యులు, అనుసంధాన సంస్థల ప్రతినిధులు, 21 భారతీయ వినియోగదార్ల సంఘాలను వ్యక్తిగతంగా, ఆన్‌లైన్‌లో కలుసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాం" అని ఆ ప్రకటించింది.

'ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్‌వో) కమిటీ ఆన్ కన్స్యూమర్ పాలసీ' (కోపోల్కో) సదస్సు వినియోగదార్ల భద్రతకు సంబంధించిన బహుపాక్షిక ప్రధాన వార్షిక కార్యక్రమం. ఐఎస్‌వోలో 168 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.  ప్రామాణీకరణ ప్రక్రియను బలోపేతం చేయడానికి, ప్రపంచ వినియోగదార్ల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో వాటాదార్ల సంఘాలు, కమిటీలతో కీలక సమావేశాలు నిర్వహిస్తుంది.
ప్రజా కేంద్రీకృత విధానం, వినియోగదార్ల భాగస్వామ్యం కోసం సవాళ్లు, మంచి ఉత్పత్తి పద్ధతులు వంటి అంశాలు; సుస్థిర భవిష్యత్తు కోసం వినియోగదార్లకు సాధికారత; వినియోగదారు భద్రత, చట్టపరమైన విధానాలు వంటివి ఈ ఏడాది సదస్సును అతి ముఖ్యమైనదిగా మార్చాయి. ఈ సమావేశంలో ప్రపంచ దేశాల మంత్రులు, ప్రముఖుల ప్రసంగాలు, వర్క్‌షాప్‌లు కూడా ఉన్నాయి.

1947లో ఐఎస్‌వో ప్రారంభమైంది. ఆ సంస్థ వ్యవస్థాపక సభ్య దేశాల్లో భారతదేశం ఒకటి. ప్రజా జీవితాలను సులభతరం, సురక్షితం, మెరుగైనదిగా చేయాలనే ఐఎస్‌వో లక్ష్యాన్ని కొనసాగించడంలో తొలి నుంచీ భారతదేశాన్ని చాలా ముఖ్యమైన భాగస్వామిగా ఐఎస్‌వో పరిగణిస్తుంది.

వినియోగదార్లకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు, వర్క్‌షాప్‌లు, ముఖాముఖి కార్యక్రమాలు కూడా ఈ సదస్సులో జరిగాయి. వర్క్‌షాప్‌ల కోసం వివిధ దేశాల ప్రతినిధులతో బృందాలు ఏర్పాటు చేశారు. వాళ్లంతా తమ అభిప్రాయాలు, సమాచారం, అనుభవాలు వంటివి పరస్పరం వ్యక్తం చేశారు.

నాలుగు రోజుల సదస్సులో, భారత ప్రభుత్వం & భారత వ్యాపార రంగ ప్రముఖులు మాత్రమే కాకుండా ప్రముఖ అంతర్జాతీయ ప్రతినిధి బృందాలు కూడా పాల్గొన్నాయి. ఈ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో, కేంద్ర వినియోగదార్ల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ మంత్రి పీయూష్ గోయల్ అంతర్జాతీయ ప్రతినిధులు, అంతర్జాతీయ & జాతీయ వినియోగదారు సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ శాఖ సహాయ మంత్రులు శ్రీ అశ్విని కుమార్ చౌబే, సాధ్వి నిరంజన్ జ్యోతి, కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్, కోపోల్కో చైర్‌ పర్సన్ సాడీ డైంటన్, ఐఎస్‌వో సెక్రటరీ జనరల్ సెర్గియో ముజికా, ఐఎస్‌వో ఉన్నతాధికారులు, వివిధ దేశాల ప్రమాణాల సంస్థల అధికారులు పాల్గొన్నారు.

 

******



(Release ID: 1928043) Visitor Counter : 129