ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

76వ ప్రపంచ ఆరోగ్య సభ


క్షయవ్యాధి ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రపంచంలో ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేసిన ఏకైక దేశం భారతదేశం..డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

ప్రపంచ సుస్థిర అభివృద్ధి లక్ష్యం కంటే 5 సంవత్సరాలు ముందుగా 2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలన కోసం భారతదేశం కృషి చేస్తోంది.. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

చికిత్స పొందుతున్న సమయంలో రోగులకు టీబీ ముక్త్ భారత్ అభియాన్ (పీఎం టీబీ ఎంబీఏ) ద్వారా చర్యలు
క్షయవ్యాధి కోసం చికిత్స పొందుతున్న 75 లక్షల మందికి నెలవారీ పోషకాహార సరఫరా కోసం ని-క్షయ్ పోషణ్ యోజన ద్వారా ప్రత్యక్ష బదిలీ

కోవిడ్-19 నివారణ కోసం అభివృద్ధి చేయడానికి ప్రపంచ దేశాలు కలిసి పని చేయాలి:.డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

Posted On: 25 MAY 2023 12:40PM by PIB Hyderabad

జెనీవాలో జరుగుతున్న 76వ ప్రపంచ ఆరోగ్య సభ సమావేశాల్లో భాగంగా క్షయవ్యాధి (టీబీ) పై జరిగిన క్వాడ్ ప్లస్ సైడ్ ఈవెంట్‌లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కీలకోపన్యాసం చేశారు. క్వాడ్ ప్లస్ దేశాలకు చెందిన ప్రతినిధులు సమావేశంలో పాల్గొని క్షయవ్యాధి జరుగుతున్న ప్రయత్నాలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. 

భారతదేశంలో క్షయ వ్యాధి మహమ్మారి  నిర్మూలన కోసం జరుగుతున్న ప్రయత్నాలను డాక్టర్ మాండవీయ వివరించారు. “ఈ సంవత్సరం భారతదేశంలో జరిగిన  వన్ వరల్డ్ టిబి సమ్మిట్‌ లో ప్రపంచ టిబి దినోత్సవాన్ని పాటించాము. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన  ఒకే ప్రపంచం, ఒకే ఆరోగ్యం అనే విధానానికి అనుగుణంగా ఈ సదస్సు జరిగింది" అని డాక్టర్ మాండవీయ తెలిపారు. క్షయ వ్యాధి ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రపంచంలో భారతదేశం మాత్రమే ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేసిందని ఆయన వివరించారు. స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవస్థను అభివృద్ధి చేశామని డాక్టర్ మాండవీయ తెలిపారు. దీనివల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ  వార్షిక ప్రపంచ నివేదిక వెలువడక ముందే భారతదేశం క్షయవ్యాధి ప్రభావాన్ని అంచనా వేయగల స్థితిలో ఉందన్నారు. 

 ఐక్య రాజ్య సమితి సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమావేశం క్షయ వ్యాధి నివారణలో కీలకంగా ఉంటుందని డాక్టర్ మాండవీయ అన్నారు. సమావేశంలో  క్షయ వ్యాధి నివారణ కోసం ప్రపంచవ్యాప్తంగా అమలు జరుగుతున్న చర్యలను సమీక్షించి తదుపరి కార్యాచరణ సిద్ధమవుతుందన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో క్షయ వ్యాధి నిర్మూలన కోసం అమలు జరుగుతున్న చర్యలను డాక్టర్ మాండవీయ వివరించారు. ప్రపంచ సుస్థిర అభివృద్ధి లక్ష్యం కంటే 5 సంవత్సరాలు ముందుగా 2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలన కోసం భారతదేశం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. 

క్షయ వ్యాధి నిర్మూలన కోసం భారతదేశం అమలు చేస్తున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయని డాక్టర్ మాండవీయ తెలిపారు. 2015 -1022 మధ్య కాలంలో భారతదేశంలో క్షయ వ్యాధి తీవ్రత 13% తగ్గిందని డాక్టర్ మాండవీయ వెల్లడించారు. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా  క్షయ వ్యాధి 10% మేరకు తగ్గిందన్నారు. క్షయ వ్యాధి సోకి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య భారతదేశంలో 15% వరకు తగ్గిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 5.9% వరకు ఉందని వివరించారు. 

క్షయ వ్యాధి నిర్మూలనలో ముందుగా వ్యాధి లక్షణాలు గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం కీలకంగా ఉంటుందని డాక్టర్ మాండవీయ అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచనల మేరకు  గుర్తించని కేసులను గుర్తించడానికి నివారణ, అదుపు చర్యలను అట్టడుగు స్థాయి వరకు అమలు జరిగేలా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామన్నారు.  క్షయ వ్యాధి సోకిన వారందరికీ చికిత్స, ఆరోగ్య సంరక్షణ అందించడానికి దేశంలో 1.5 లక్షలకు పైగా ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. వీటి ద్వారా ఇతర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలతో పాటు రోగులందరికీ టీబీ  నిర్ధారణ,   సంరక్షణ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయన్నారు. దేశంలో మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలు అండగా ఉన్నాయన్నారు. 

క్షయ వ్యాధి నిర్మూలనలో ప్రైవేటు రంగం సహకారాన్ని తీసుకుంటున్నామని డాక్టర్ మాండవీయ తెలిపారు. క్షయ వ్యాధి సోకిన వారికి దగ్గరలో, వారు కోరుకున్న ప్రాంతంలో చికిత్స అందించడానికి వైద్యులు, ఆరోగ్య కేంద్రాలను గుర్తించి ప్రైవేటు రంగం సహకారంతో వాటిని నిర్వహిస్తున్నామని అన్నారు.దీనివల్ల ప్రైవేటు రంగం గుర్తించిన కేసుల సంఖ్య గత తొమ్మిది సంవత్సరాల కాలంలో 7 రెట్లు పెరిగిందన్నారు. 

క్షయ వ్యాధి నిర్మూలనలో ప్రధాన సమస్యగా ఉన్న కళంకం సమస్యను ప్రస్తావించిన  డాక్టర్ మాండవీయ సమస్య పరిష్కారం కోసం  భారతదేశం అమలు చేస్తున్నసామాజిక వ్యవస్థ , ప్రధాన మంత్రి టీబీ  ముక్త్ భారత్ అభియాన్ (PMTBMBA) కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రారంభించిన ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద చికిత్స సమయంలో రోగులకు సహకారం అందుతుందన్నారు. పథకం కింద గుర్తించిన  ని-క్షయ్ మిత్ర లేదా దాతలు సహకారం అందిస్తారని అన్నారు. రోగులకు సహకారం అందించడానికి 78 వేల మంది ని-క్షయ్ మిత్రలు ముందుకు వచ్చి 10 లక్షల మందికి సహకారం అందించడానికి ఏడాదికి  $146 మిలియన్లను సేకరిస్తామని హామీ ఇచ్చారని డాక్టర్ మాండవీయ తెలిపారు. 

క్షయ వ్యాధి వల్ల కలిగే సామాజిక ఆర్థిక సమస్యలు పరిష్కరించడానికి భారతదేశం చర్యలు అమలు చేస్తుందని డాక్టర్ మాండవీయ అన్నారు. సమస్య పరిష్కారానికి  ని-క్షయ్ పోషణ కేంద్రాలు ఏర్పాటు చేసి 

  క్షయ వ్యాధి చికిత్స పొందుతున్న 75 లక్షల మందికి నేరుగా నెలవారీ పోషకాహార సరఫరా జరుగుతుందన్నారు. 2018 నుంచి ఈ కార్యక్రమం అమలు కోసం $244 మిలియన్ల వరకు ఖర్చు చేశామన్నారు.  

వన్ వరల్డ్ టీబీ సదస్సులో క్షయ వ్యాధి నివారణ కోసం  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన  కుటుంబ-కేంద్రీకృత సంరక్షణ విధానాన్ని డాక్టర్ మాండవీయ వివరించారు.వ్యాధి బారిన పడిన  ఒక వ్యక్తి కోలుకునే అంశంలో  కుటుంబం  ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని గుర్తించామని అన్నారు. వన్ వరల్డ్ టిబి సదస్సులో తక్కువ వ్యవధి లో క్షయ వ్యాధి నివారణ చికిత్స  టిబి ప్రివెంటివ్ ట్రీట్‌మెంట్ (టిపిటి),  క్షయ వ్యాధి రహిత  పంచాయితీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించామన్నారు.  క్షయ వ్యాధి నివారణ, అదుపు కోసం కృషి చేస్తున్న వారిని గుర్తించి ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు.

క్షయ వ్యాధి నిర్మూలన కోసం సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ మాండవీయ అన్నారు. “కోవిడ్ -19 మహమ్మారిని అరికట్టిన విధంగా క్షయ వ్యాధిని నిర్మూలించడానికి, రోగ నిర్ధారణ,చికిత్స విధానాలు అభివృద్ధి చేయడానికి సంఘటిత చర్యలు అమలు జరగాలి. 2030 నాటికి క్షయవ్యాధి  నిర్మూలన లక్ష్యంగా ఐక్యరాజ్య సమితి నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమావేశం  లక్ష్యాలను సాధించడానికి,  క్షయ వ్యాధిని నిరోధించడానికి, నిర్ధారించడానికి, చికిత్స అందించడానికి  రోగి-కేంద్రీకృత వినూత్న విధానాలను కనుగొనాలి. భారతదేశం తన అభ్యాసాలను ప్రపంచంతో పంచుకోవడానికి, ఇతరుల నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది" అని డాక్టర్ మాండవీయ అన్నారు. 

 నిరంతర కృషి, దృఢ సంకల్పంతో 2030 కి ముందు  క్షయ వ్యాధిని పూర్తిగా  నిర్మూలించడానికి అవకాశం ఉందని డాక్టర్ మాండవీయ అన్నారు.  

***



(Release ID: 1927260) Visitor Counter : 252