పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇంధన రంగంలో జీవ ఇంధనాలు అత్యంత ప్రాధాన్యం :కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి జీ 20 దేశాల సహకారంతో జీవ ఇంధనాల పూర్తి సామర్థ్యం వినియోగం

Posted On: 18 MAY 2023 11:46AM by PIB Hyderabad

ఇంధన రంగంలో జీవ ఇంధనాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర  పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి  శ్రీ పంకజ్ జైన్ అన్నారు. జీ-20 దేశాల సహకారంతో జీవ ఇంధనాల వినియోగం పూర్తి సామర్థ్యం మేరకు జరుగుతుందన్నారు. ముంబైలో జరిగిన 3వ ఎనర్జీ ట్రాన్సిషన్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్‌లో భాగంగా 2003 మే 15న ముంబైలో  కేంద్ర  పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ నిర్వహించిన గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ సెమినార్‌లో ఆయన ప్రసంగించారు.

జీవ ఇంధనాల ప్రాధాన్యత వివరించిన శ్రీ పంకజ్ జైన్ జీవ ఇంధనాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదన్నారు. స్వచ్ఛమైన ఇంధన వినియోగానికి పెరుగుతున్న ప్రాధాన్యత, బహుళ వినియోగానికి ఉన్న అవకాశాలు, సాంకేతికంగా ఉన్న ఆర్థిక వెసులుబాటు, నిధుల సమీకరణ తదితర అంశాల్లో జీవ ఇంధనాలు సానుకూల ప్రయోజనాలు కలిగి ఉన్నాయని శ్రీ జైన్ పేర్కొన్నారు. సానుకూల ప్రయోజనాలు కలిగి ఉన్న జీవ ఇంధన రంగం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తోందని అన్నారు. 

జీవ ఇంధనాల వినియోగం వల్ల ఆర్థికాభివృద్ధిని సులభంగా సాధించవచ్చునని శ్రీ జైన్ అన్నారు. ఇంధన భద్రత కల్పించడం, అందుబాటు, వెసులుబాటు అంశాల్లో కూడా జీవ ఇంధనాలు సహకారం అందిస్తాయన్నారు.జీవ ఇంధన వనరుల వినియోగం వల్ల కర్బన ఉద్గారాల విడుదల తగ్గుతుందన్నారు.  

 "సాంకేతికంగా సాధించిన పురోగతి వల్ల వివిధ రూపాల్లో జీవ ఇంధనాలు ( చెరకు, మొక్కజొన్న, వ్యవసాయ వ్యర్థాలు, వెదురు మొదలైనవి) అందుబాటులోకి వచ్చాయి. జీ-20 దేశాల మధ్య సహకారం మరింత పెరిగితే  ప్రపంచ బయో-ఇంధన మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేయడానికి అవకాశం కలుగుతుంది.  ఇంధనాలను  పూర్తి సామర్థ్యం మేరకు వినియోగించడానికి వీలవుతుంది." అని శ్రీ జైన్ వివరించారు. 

సెమినార్ లో ప్రముఖ చమురు, సహజవాయువు సంస్థల  చైర్‌పర్సన్‌లు , ఎగ్జిక్యూటివ్‌లు, ఐఈఎ,  , టోటల్ ఎనర్జీస్, షెల్, లాంజాటెక్, SHV ఎనర్జీ ఫ్యూటూరియా వంటి అనేక అంతర్జాతీయ ఇంధన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సాంకేతిక అంశాలు , జీవ ఇంధన వినియోగం, సహకారం, వాణిజ్య అంశాలపై చర్చలు జరిగాయి.  బయో-ఇంధన రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశం అభిప్రాయపడింది.  సాఫ్  ఆల్కహాల్ నుంచి జెట్, బయోడీజిల్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ఇథనాల్ ఉత్పత్తి, పునరుత్పాదక డీఎంఈ  మొదలైన అంశాలు చర్చకు వచ్చాయి. 

చమురు సహజవాయువు రంగం, ఐఈఎ, బయోఫ్యూచర్ ప్లాట్‌ఫారమ్ వంటి అంతర్జాతీయ సంస్థలు, జీ-20  దేశాల ప్రతినిధులు,సీఐఐ, అసోచం వంటి  సంస్థలు, ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారులు, ఉత్పత్తిదారులు,  సాంకేతిక నిపుణులు సెమినార్ లో పాల్గొని సూచనలు, సలహాలు అందించారు.  

 

****


(Release ID: 1925224) Visitor Counter : 208