వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఇండియా-ఈయూ ఎఫ్‌టీఏ చర్చలు ఫలవంతంగా సాగుతున్నాయి: పీయూష్ గోయల్
ఎఫ్‌టీఏ చర్చలకు అనుబంధంగా భారతదేశం-ఈయూ ట్రేడ్ & టెక్నాలజీ కౌన్సిల్ ఉపయోగపడుతుంది: గోయల్
'కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం'పై ఈయూతో భారత్ చేయి కలిపింది, సరైన పరిష్కారం కనుగొనడానికి కలిసి పని చేస్తోంది: గోయల్
భారతదేశం సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తప్పుగా భావించారు, వాస్తవానికి సుంకాలు చాలా తక్కువగా ఉన్నాయి: గోయల్
Posted On:
17 MAY 2023 2:42PM by PIB Hyderabad
బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో జరిగిన మొదటి ఇండియా-ఈయూ ట్రేడ్ & టెక్నాలజీ కౌన్సిల్ (టీటీసీ) సమావేశం తర్వాత, భారత వాణిజ్యం & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నిన్న మీడియాతో మాట్లాడారు. ఇండియా-ఈయూ ఎఫ్‌టీఎ చర్చలు ఫలవంతంగా సాగుతున్నాయని చెప్పారు. ఎఫ్‌టీఏ చర్చలకు అనుబంధంగా టీటీసీ ఉపయోగపడుతుందని, భారత్-ఈయూ బంధాన్ని శతాబ్దపు భాగస్వామ్యంగా ఎఫ్‌టీఏ మారుస్తుందని గోయల్ అన్నారు.
'కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం'పై (సీబీఏఎం) ఈయూతో భారత్ చేయి కలిపిందని, వాణిజ్యానికి అడ్డంకిని సృష్టించడం ఈయూ ఉద్దేశం కాదని, అయితే సమిష్టి ప్రయత్నాల్లో భాగంగా స్థిరంగా ముందుకు వెళ్లే మార్గాన్ని కనుగొనాలని పీయూష్ గోయల్ అన్నారు. సీబీఏఎం సమస్యకు సరైన పరిష్కారాన్ని కనుగొనడానికి భారతదేశం-ఈయూ కలిసి పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు.
భారతదేశం సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తప్పుగా భావిస్తున్నారని, అయితే వాస్తవానికి సుంకాలు చాలా తక్కువగా ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడే సాంకేతిక అంశాలపై సుంకాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. డబ్ల్యూటీవో వద్ద అంగీకరించిన రేట్ల కంటే ఇప్పుడు వర్తింపజేస్తున్న రేట్లు తక్కువగా ఉన్నాయని వెల్లడించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ నుంచి లభించిన మార్గదర్శకత్వం రెండు పక్షాల మధ్య అత్యుత్తమ బంధానికి బాటలు వేయడంలో ప్రోత్సాహకరంగా ఉందని గోయల్ చెప్పారు. భారతదేశం, ఈయూ మధ్య వాణిజ్యం, సాంకేతికత, భద్రతకు సంబంధించిన కీలక సమస్యలను పరిష్కరించడానికి టీటీసీని సమన్వయ వేదికగా మార్చడాన్ని మంత్రి ప్రశంసించారు. భారతదేశం, ఈయూ రెండూ బహిరంగ మార్కెట్ ఆర్థిక వ్యవస్థలు, శక్తివంతమైన ప్రజాస్వామ్యాలు, భద్రత, శ్రేయస్సు, స్థిరమైన ఆర్థిక వృద్ధి లక్ష్యాలతో నడుస్తున్న బహుళత్వ సమాజాలుగా పీయూష్ గోయల్ అభివర్ణించారు.
***
(Release ID: 1925018)
Visitor Counter : 163