వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
కొత్త వాణిజ్య & భాగస్వామ్య ఒప్పందం (టీఈపీఏ) కోసం భారతదేశం, ఈఎఫ్‌టీఏ అడుగులు
సమగ్ర టీఈపీఏ కోసం విధివిధానాలపై ఈఎఫ్‌టీఏ ప్రతినిధులతో శ్రీ పీయూష్ గోయల్ చర్చ
భారత్-ఈఎఫ్‌టీఏ టీఈపీఏపై చర్చల్లో గణనీయమైన పురోగతి
प्रविष्टि तिथि:
15 MAY 2023 12:57PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్యం & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, 'యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్' ప్రతినిధుల మధ్య సాగిన చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా విడుదల చేసిన పత్రిక ప్రకటన ఇది:
“భారతదేశం-'యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్' (ఈఎఫ్‌టీఏ) దేశాల (ఐస్‌లాండ్, లీచ్‌టెన్‌స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్) మధ్య కొత్త వాణిజ్య & ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టీఈపీఏ) కోసం జరిగిన చర్చల్లో గణనీయమైన పురోగతి ఉంది. ఈరోజు బ్రస్సెల్స్‌లో జరిగిన సమావేశంలో శ్రీ పీయూష్ గోయల్, భారత వాణిజ్యం & పరిశ్రమల శాఖ మంత్రి; గై పార్మెలిన్, స్విస్ ఫెడరల్ కౌన్సిలర్, ఫెడరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్; ఐనార్ గున్నార్సన్, ఐస్‌లాండ్ రాయబారి; కర్ట్ జాగెర్, లిచ్టెన్‌స్టెయిన్ రాయబారి; ఎరిక్ ఆండ్రియాస్ అండర్లాండ్, నార్వే వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలో స్పెషల్ డైరెక్టర్ పాల్గొన్నారు. సమగ్ర టీఈపీఏ కోసం విధానాలపై చర్చించారు. గత వారం ఆన్‌లైన్‌లో జరిగిన నిపుణుల సమావేశానికి కొనసాగింపుగా ఈ సమావేశం జరిగింది.
భారతదేశం-ఈఎఫ్‌టీఏ మధ్య టీఈపీఏపై చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని ఈ సమావేశం అధిగమించింది. న్యాయమైన, సమానమైన, సమతుల్య ఒప్పందాన్ని సాధించడానికి పరస్పర విశ్వాసం, గౌరవం ప్రాతిపదికన చర్చలు సాగించాల్సిన విషయాన్ని అన్ని పక్షాలు స్పష్టం చేశాయి. నిజానికి, ఈఎఫ్‌టీఏ-భారతదేశం మధ్య కుదిరే టీఈపీఏ ద్వారా గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. సమగ్ర & స్థితిస్థాపక సరఫరా గొలుసులు, రెండు వైపులా వాణిజ్యం, పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధికి దోహదపడేలా అటు వ్యాపారాలు, ఇటు వ్యక్తులకు కొత్త అవకాశాలు సృష్టిస్తాయి.
ప్రయత్నాలను వేగవంతం చేయడానికి, టీఈపీఏకి సంబంధించిన క్లిష్టమైన సమస్యలపై ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చేలా రాబోయే నెలల్లో మరిన్ని సమావేశాలు నిర్వహించి, ఇదే వేగంతో చర్చలు కొనసాగించడానికి ఇరు వర్గాలు అంగీకరించాయి".
***
(रिलीज़ आईडी: 1924169)
आगंतुक पटल : 261