రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2023 ఏప్రిల్ లో నెల రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 42 కంటే ఎక్కువగా అక్రమ సాఫ్ట్‌ వేర్‌ లను ధ్వంసం చేసి, 955 మంది అక్రమ సాఫ్ట్‌వేర్‌ తయారీదారులను, రిటైలర్లనూ, అదుపులోకి తీసుకున్న - రైల్వే రక్షణ దళం


రాళ్లు రువ్వడం వల్ల కలిగే పరిణామాల గురించి ప్రజలకు తెలియజెప్పేందుకు పలు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించిన - ఆర్‌.పి.ఎఫ్.

Posted On: 10 MAY 2023 4:14PM by PIB Hyderabad

రైల్వే ప్రయాణికులు, ప్రయాణీకులు సంచరించే ప్రాంతాలతో పాటు, రైల్వే ఆస్తులను నిరంతర, ముందస్తు, నివారణ చర్యలతో పాటు నేర పరిశోధన ద్వారా రక్షించడానికి రైల్వే రక్షణ దళం (ఆర్.పి.ఎఫ్) నిబద్ధతతో  స్థిరంగా పనిచేస్తుంది.  రైళ్లను సజావుగా నడిపించడంలో రైల్వేలకు సహాయం చేయడం, ఆపదలో ఉన్న ప్రయాణికులకు సహాయం చేయడం, రైళ్లలో అనుమానితులుగా సంచరిస్తున్న వారిని గుర్తించి పట్టుకోవడంలో చట్టాన్ని అమలు చేసే సంస్థలకు సహాయం చేయడం వంటి అదనపు బాధ్యతలను కూడా ఆర్.పి.ఎఫ్. నిర్వహిస్తుంది.

 

రైల్వే భద్రతను పెంపొందించే లక్ష్యంతో, రైల్వే భద్రతకు సంబంధించిన రెండు క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించడం కోసం, ఆర్.పి.ఎఫ్. 2023 ఏప్రిల్ లో నెల రోజుల పాటు, దేశవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టింది.   ఈ రెండు క్లిష్టమైన రెండు సవాళ్ళలో - రైల్వే ఇ-టికెట్లను అనధికారికంగా విక్రయించే దళారులతో సహా, ఇందులో పాల్గొన్న నేరస్థులను గుర్తించి, వారిపై చట్టం నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవడం మొదటిది కాగా; బ్లాక్ స్పాట్లు, రాళ్లు రువ్వే సంఘటనలకు గురయ్యే రైళ్ళను గుర్తించి, అటువంటి దుర్ఘటనలు జరగకుండా నివారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం రెండో కార్యక్రమం. 

ఈ తనిఖీ కార్యక్రమంలో భాగంగా - అనధికారిక టికెట్ బుకింగ్ ఏజెంట్లను గుర్తించి, పట్టుకోవడం కోసం, రైల్వే స్టేషన్లు, రిజర్వేషన్ కౌంటర్లతో పాటు, ఆన్‌ లైన్ వ్యవస్థలపై ఆర్.పి.ఎఫ్. సిబ్బంది క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించారు.  అనధికారిక ఏజెంట్ల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవడం వల్ల కలిగే నష్టాలపై ఆర్.పి.ఎఫ్. సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు.  టిక్కెట్లను కొనుగోలు చేయడానికి చట్టబద్ధమైన మార్గాలను ఉపయోగించే విధంగా ప్రజలను ప్రోత్సహించారు.  ఈ ప్రయత్నాల ఫలితంగా, రైల్వే ఇ-టికెట్లను అనధికారికంగా విక్రయించే దళారులు, అక్రమ సాఫ్ట్‌వేర్‌ తయారీదారులు, సూపర్ సెల్లర్లు, విక్రేతలతో పాటు, అటువంటి చట్టవిరుద్ధ సాఫ్ట్‌వేర్‌ లను ఉపయోగిస్తున్న రిటైలర్లను అదుపులోకి తీసుకున్న ఆర్.పి.ఎఫ్. 42 కంటే ఎక్కువ అక్రమ సాఫ్ట్‌ వేర్‌ లను కూడా నిర్వీర్యం చేసింది. 

 

వీటితో పాటు, నడుస్తున్న రైళ్లపై రాళ్లు రువ్వే సంఘటనలు అకస్మాత్తుగా పెరగడాన్ని ఆర్.పి.ఎఫ్. గమనించింది, ఇది ప్రయాణీకుల భద్రత, రక్షణ కు తీవ్రమైన ముప్పుగా పరిగణించడం జరిగింది. ఇందుకు ప్రతిస్పందనగా, ఆర్.పి.ఎఫ్. స్థానిక అధికారులు, గ్రామ పంచాయతీలు, ప్రజా ప్రతినిధులు, కళాశాలలు, పాఠశాలల విద్యార్థులతో పాటు, ట్రాక్ వెంబడి నివాసం ఉంటున్న వారి కుటుంబ సభ్యులకు, రాళ్లతో రైళ్ళపై దాడి చేస్తే, సంభవించే పరిణామాల గురించి ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించడం కోసం ఆర్.పి.ఎఫ్. అనేక ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది.  వార్తాపత్రికల్లో నోటీసులు, కరపత్రాలు ప్రచురించారు. ఈ విషయంపై అవగాహన పెంచడానికి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు.  వీటితో పాటు, బ్లాక్ స్పాట్ల వద్ద మోహరింపు, రైలు ఎస్కార్టింగ్, అతిక్రమణ దారులపై చర్యలు వంటి అనేక ఇతర చర్యలను ఆర్.పి.ఎఫ్. చేపట్టింది.  ఇది రైల్వే చట్టంలోని నిబంధనల ప్రకారం 2,773 మంది వ్యక్తులను అరెస్టు చేయడానికి దారితీసింది.  ఈ విషయంలో పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో పాటు, చట్టాలను అమలు చేసే ఇతర సంస్థలతో ప్రత్యేక సమన్వయ సమావేశాలు కూడా నిర్వహించారు.  ఫలితంగా ఇటువంటి నేరాలకు పాల్పడిన మరో 84 మందిని కూడా అరెస్టు చేశారు.

 

రైల్వే ప్రయాణీకుల భద్రత, రక్షణ లను నిర్ధారించడానికి రైల్వే రక్షణ దళం కట్టుబడి ఉంది.   ఈ నెల రోజుల ఈ ప్రత్యేక తనిఖీ కార్యక్రమ విజయం ఈ మిషన్ పట్ల దాని తిరుగులేని నిబద్ధతకు నిదర్శనం.  భారతదేశానికి చెందిన మొత్తం రైల్వే వ్యవస్థ లో పూర్తి భద్రతను నిర్ధారించడానికి, ఆర్.పి.ఎఫ్. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక తనిఖీ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటుంది. 

 

 

*****


(Release ID: 1923287) Visitor Counter : 148