సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మీడియా-వినోద పరిశ్రమ ప్రపంచ స్థాయికి చేరడంలోప్రభుత్వం సంధానకర్తగా.. మద్దతుదారుగా తనవంతు పాత్ర పోషిస్తుంది
మానవ వనరులు.. మౌలికసదుపాయాల సమస్యల పరిష్కారం దిశగామీడియా-వినోద రంగంతో సంయుక్త కృషికి ప్రభుత్వం కట్టుబడి ఉంది;
‘ఎవిజిసి’ రంగంలో ప్రపంచ మార్గదర్శి కాగల సామర్థ్యం భారతదేశానికి ఉంది;
యువ చిత్రనిర్మాతల ప్రతిభా ప్రదర్శన కోసం ‘ఎన్‌ఎఫ్‌డిసి’ ఒక ‘ఒటిటి’వేదికను రూపొందిస్తుంది: కేంద్ర సమాచార-ప్రసారమంత్రిత్వ శాఖ కార్యదర్శి;
‘ఫిక్కి ఫ్రేమ్స్’ 23వ సమావేశంలో కేంద్ర సమాచార-ప్రసార
మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ప్రారంభ ప్రసంగం
Posted On:
03 MAY 2023 4:27PM by PIB Hyderabad
“భారత మీడియా-వినోద పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిని అందుకోవడంలో ప్రభుత్వం సంధానకర్తగా, మద్దతుదారుగా తనవంతు పాత్ర పోషిస్తుంది” అని కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా మీడియా-వినోద పరిశ్రమ ముందుకు దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆ పరుగును ‘అందిపుచ్చుకునేలా’ మనమూ శరవేగంతో ముందంజ వేయాలని ఆయన పేర్కొన్నారు. “భారత కథలు-గాథలు, భారతీయ సంస్కృతిపై ప్రపంచం నేడు ఎంతో మక్కువ చూపుతోంది” అని గుర్తుచేశారు. ముంబై నగరంలోని పొవైలో 2023 మే 3 నుంచి 5వ తేదీవరకూ జరిగే ‘ఫిక్కి ఫ్రేమ్స్’ 23వ వార్షిక సమావేశంలో భాగంగా శ్రీ అపూర్వ చంద్ర ప్రారంభ ప్రసంగం చేశారు. ఇది వినోద వ్యాపార రంగంపై ఆసియా ఖండంలోనే అతిపెద్ద, నిర్ణయాత్మక అంతర్జాతీయ వేదిక కావడం గమనార్హం.
ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగం కొనసాగిస్తూ- దేశంలో ఈ పరిశ్రమకు నేడు మానవ వనరులు, మౌలిక సదుపాయాలకు సంబంధించి సవాళ్లున్నాయని పేర్కొన్నారు. వీటిని అధిగమించే దిశగా- “పరిశ్రమలోకి మానవ శక్తి మరింతగా ప్రవేశించేందుకు వీలుగా మరిన్ని ఇన్‌స్టిట్యూట్‌ల ఏర్పాటుకు పరిశ్రమతో సంయుక్త కృషికి ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని ప్రకటించారు. “యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ అద్భుత సామర్థ్యంగల రంగాలు. ఆ మేరకు ‘ఎవిజిసి’ కార్యాచరణ బృందం ఏర్పాటుసహా దీనిపై ఒక జాతీయ విధాన రూపకల్పన ద్వారా ఈ పరిశ్రమలో ప్రపంచ మార్గదర్శిగా భారత్ ఎదగడానికి అవకాశాలు అపారం” అని అపూర్వ చంద్ర తన ప్రసంగంలో వివరించారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులు ‘ఎవిజిసి’ రంగంపై విస్తృత అవగాహన పెంచుకునేలా పాఠ్యాంశాల్లో దీన్ని ప్రవేశపెట్టే మార్గాలను ప్రభుత్వం అన్వేషించనుందని తెలిపారు. తద్వారా ఉత్తేజకర భవిష్యత్ అవకాశాలుగల ఈ రంగంపై చిన్న వయస్సులోనే వారు ప్రతిభను ప్రదర్శించే వీలుంటుందని చెప్పారు. ఈ కృషిలో భాగంగా వచ్చే ఏడాదికల్లా ముంబైలో ‘నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
జాతీయ చలనచిత్ర వారసత్వ కార్యక్రమం (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎం) గురించి ఆయన మాట్లాడుతూ- తమ అభిమాన చలనచిత్రాల డిజిటలీకరణ/పునరుద్ధరణకు ఔత్సాహిక చలనచిత్ర నిర్మాతలు, సాధారణ పౌరులు నిధులు సమకూర్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం త్వరలో ప్రారంభిస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా ఐదు వేలకుపైగా చలనచిత్రాలు, లఘుచిత్రాల డిజిటలీకరణ/పునరుద్ధరణను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నదని ఆయన తెలిపారు. వీటిలో ఇప్పటికే 1400 చలనచిత్రాలు, 1100 లఘుచిత్రాల డిజిటలీకరణ పూర్తయినట్లు వెల్లడించారు. భారత జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డిసి) పాత్రను నొక్కిచెబుతూ- “ఈ సంస్థ ద్వారా మనం ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయాల్సి ఉంది. దీంతోపాటు నిధుల లభ్యత కరవైన యువ చిత్రనిర్మాతలకు అండగా నిలవాలి. అలాగే మార్కెట్‌లో చోటుదక్కని చిత్రాల ప్రదర్శనకు ఒక వేదికగా ‘ఎన్‌ఎఫ్‌డిసి’ సొంత ‘ఒటిటి’ ఏర్పాటుపై మేం యోచిస్తున్నాం. తద్వారా యువ ప్రతిభ వెలుగులోకి వచ్చే అవకాశం లభిస్తుంది” అని కార్యదర్శి చెప్పారు.
చలన చిత్ర చౌర్యాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం ఇటీవల విధాన నిర్ణయాలు తీసుకున్నదని కార్యదర్శి చెప్పారు. ఈ మేరకు “చలనచిత్ర చౌర్యంపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా కేంద్ర మంత్రిమండలి ఇటీవల సినిమాటోగ్రఫీ చట్టాన్ని నవీకరించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. సంబంధిత బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుండగా, చట్టసభ దీనికి సత్వర ఆమోదం ఇస్తుందని ఆశిస్తున్నాం. ఇది చట్టరూపం దాలిస్తే చౌర్యానికి గురైన చలనచిత్రాలను ప్రదర్శించే వెబ్‌సైట్లపై ప్రభుత్వం నేరుగా చర్యలు చేపట్టే అధికారం దఖలు పడుతుంది” అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా “విండోస్ ఆఫ్ ఆపర్చ్యునిటీ: ఇండియాస్ ఎం అండ్ ఇ సెక్టార్ మాగ్జిమైజింగ్ అక్రాస్ సెగ్మెంట్స్” పేరిట ‘ఫిక్కి-ఇవై మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్’ రూపొందించిన నివేదికను శ్రీ అపూర్వ చంద్ర ఆవిష్కరించారు. మీడియా-వినోద పరిశ్రమ రెండు లక్షల కోట్ల మైలురాయిని అధిగమించినట్లు ఈ నివేదిక పేర్కొంది. తదనుగుణంగా 2021తో పోలిస్తే 20 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపింది.
ఈ కార్యక్రమంలో ‘ఫిక్కి’ అధ్యక్షుడు, ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో అల్లాయ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సుభ్రకాంత్ పాండా; ‘ఫిక్కి’ ఎం అండ్ ఇ కమిటీ చైర్‌పర్సన్, వయాకామ్ 18 మీడియా లిమిటెడ్ సీఈవో, రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మీడియా-కంటెంట్ బిజినెస్ అధ్యక్షురాలు శ్రీమతి జ్యోతి దేశ్‌పాండే; ప్రముఖ నటుడు శ్రీ ఆయుష్మాన్ ఖురానా; ఎం అండ్ ఇ, ఇవై భాగస్వామి శ్రీ ఆశిష్ ఫేర్వానీ; ‘ఫిక్కి’ సెక్రెటరీ జనరల్ శ్రీ శైలేష్ కె.పాఠక్ తదితరులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ- “స్థానికంగా మనమెంత లోతుగా వెళ్తే అంత ఎక్కువగా అంతర్జాతీయ స్థాయికి చేరువ కాగలం. చలనచిత్ర పరిశ్రమ ఇప్పటికే ప్రపంచ ఆధిపత్య శిఖరాగ్రానికి చేరువలో ఉంది. ప్రపంచం సంస్కృతిని రూపుదిద్దే సృజనాత్మక వేదికగా మారిన నేపథ్యంలో ఇందులో భాగస్వామిని కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. భారతదేశం ఒక సృజనాత్మక జీవనాడిగా పరిగణించబడటమే కాకుండా మన పరిశ్రమకు ప్రపంచవ్యాప్త ఆదరణ లభిస్తోంది” అని పేర్కొన్నారు.
భారత మీడియా-వినోద పరిశ్రమ ప్రగతి పయనం గురించి ‘ఫిక్కి’ అధ్యక్షుడు శ్రీ సుభ్రకాంత్ పాండా తన స్వాగతోపన్యాసంలో వివరించారు. “వినోద-మీడియా పరిశ్రమ కొన్నేళ్లుగా 10.5 శాతం ‘సీఏజీఆర్’తో సుస్పష్ట వృద్ధి పథంలో సాగుతోంది. ఆ మేరకు 2022 -2023లో ఇది సగటున 11.4 శాతానికిపైగా వృద్ధిని సాధించింది. పరిశ్రమ ప్రతిరోధకత, శరవేగపు ప్రగతి నేపథ్యంలో ఈ వృద్ధి కొత్త అవకాశాలను సృష్టించగల ఈ రంగం సామర్థ్యాన్ని తెలియజేస్తోంది. భారతీయ మీడియా-వినోద పరిశ్రమ డిజిటల్ విప్లవంతో ప్రభావితం అవుతున్నందున సానుకూల పరివర్తనకు ఇదొక కీలకాంశం కాగలదు” అని ఆయన వివరించారు.
మూడు రోజుల పాటు సాగే ‘ఫిక్కి ఫ్రేమ్స్’ 23వ వార్షిక సమావేశం వ్యక్తులు, దేశాలు, సమ్మేళనాల మధ్య ఆలోచనలు, విజ్ఞాన ఆదానప్రదానానికి ఒక సుస్థిర వేదిక అవుతుంది. ఈ సంవత్సరం “ఇన్‌స్పైర్-ఇన్నోవేట్-ఇమ్మర్స్: సెలిబ్రేటింగ్ ది ఇవల్యూషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ రిఫ్లెక్టింగ్ ఆన్ ఇట్స్ ఫ్యూచర్” ఇతివృత్తంగా సమావేశం నిర్వహించబడుతోంది. ఈ సమావేశ చర్చనీయాంశాల్లో బృంద చర్చలు, సమావేశాలు, ప్రదర్శనలు, చలిమంటల సంభాషణలు, నిపుణుల అనుభవ ప్రదానం, కార్యశాలలు, చలనచిత్ర-టెలివిజన్-యానిమేషన్, గేమింగ్, సంగీతం, డిజిటల్ మీడియా, మీడియా-వినోద పరిశ్రమలోని ఇతర ఉప రంగాలు వగైరాలపై గోష్ఠులు వంటివి ఉంటాయి. ఆయా కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి నిర్వహణ క్రమాన్ని
https://www.ficci-frames.com/assets/download/FICCIFRAMES2023-Programme.pdf ద్వారా మరింత విస్తృతంగా తెలుసుకోవచ్చు.
*****
(Release ID: 1921855)
Visitor Counter : 170