నౌకారవాణా మంత్రిత్వ శాఖ
వాణిజ్యం మరియు ఆర్థిక వృద్ధిని పెంచడం ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరంలో రికార్డ్-అధిగమించే మైలురాళ్లను దాటిన భారతదేశపు ప్రధాన నౌకాశ్రయాలు - శ్రీ సర్బానంద సోనోవాల్
ఎగుమతులలో వృద్ధిని, సముద్ర రంగంలో సాంకేతిక పురోగమనం కోసం ప్రతిష్టాత్మక ప్రణాళికలను ప్రముఖంగా ప్రస్తావించిన శ్రీ సోనోవాల్
Posted On:
28 APR 2023 3:00PM by PIB Hyderabad
2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని ప్రధాన ఓడరేవుల పనితీరు అపూర్వమైన శిఖరపు అంచులను తాకాయని, వివిధ కీలక పనితీరు సూచికలలో కొత్త రికార్డులను నెలకొల్పాయని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాలు, ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ అన్నారు.
న్యూఢిల్లీలో జరిగిన ఫిక్కీ పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాన్‌క్లేవ్ 2వ ఎడిషన్‌లో శ్రీ సోనోవాల్ మాట్లాడుతూ, ప్రధాన ఓడరేవులు సమిష్టిగా రికార్డు స్థాయిలో 795 మిలియన్ టన్నుల కార్గోను నిర్వహించాయని, గత ఏడాదితో పోలిస్తే 10.4% వృద్ధిని నమోదు చేశాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, గత సంవత్సరంతో పోలిస్తే 6% పెరుగుదలతో రోజుకు అత్యధికంగా 17,239 టన్నుల ఉత్పత్తిని సాధించాయని అయన వెల్లడించారు. 48.54% అత్యుత్తమ నిర్వహణ నిష్పత్తిని సాధించడం మరొక ముఖ్యమైన సాఫల్యం అని తెలిపారు. జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జెఎన్ప్ఏ) 6 మిలియన్లకు పైగా టిఈయూలను నిర్వహించడం ద్వారా కొత్త రికార్డును నెలకొల్పిందని అన్నారు. ప్రధాన ఓడరేవులు అత్యధిక నౌకల నిర్వహణ చేసి, ఏడాదిలో మొత్తం 21,846 ఓడలను నిర్వహించేలా పనితీరు ప్రదర్శించాయని ఆయన చెప్పారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ నౌకాయాన పరిశ్రమలో నౌకల సంఖ్య, స్థూల టన్నుల రాకపోకలు, నౌకాయానల సంఖ్య గణనీయంగా పెరిగిందని శ్రీ సోనోవాల్ పేర్కొన్నారు. భారతదేశ జెండా కింద ప్రయాణించే నౌకల సముదాయం 2014లో 1,205 నుండి 2023 నాటికి 1,526కి విస్తరించిందని, ఇది తన సముద్ర కార్యకలాపాలను బలోపేతం చేయడంలో దేశానికి ఉన్న నిబద్ధతను ప్రదర్శిస్తుందని ఆయన అన్నారు. ఈ పెరుగుదల స్థూల సరకు రవాణాలో గణనీయమైన పెరుగుదలతో కూడి ఉందని, 2014లో 10.3 మిలియన్ల నుండి 2023లో 13.7 మిలియన్లకు పెరిగిందని తెలిపారు. ఇది మెరుగైన సామర్థ్యం, కార్యకలాపాల స్థాయిని ప్రతిబింబిస్తుందన్నారు. అంతేకాకుండా, భారతీయ నావికుల సంఖ్య 2014లో 1,17,090 నుండి 2022 నాటికి 2,50,071కి పెరిగిందని, కేవలం తొమ్మిదేళ్లలో దాదాపు 114% వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు.
ఈ చారిత్రాత్మక విజయాలు వాణిజ్యాన్ని పెంచడానికి, ఆర్థిక వృద్ధికి తోడ్పాటునందించేందుకు తన పోర్టు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ఆధునీకరించడం పట్ల భారతదేశ అంకితభావాన్ని నొక్కిచెబుతున్నాయని శ్రీ సోనోవాల్ స్పష్టం చేశారు.
అత్యాధునిక నౌకాశ్రయ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో భారతదేశం పురోగతి, సముద్ర నౌక రంగానికి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికలను వివరించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
పోర్ట్ కార్యకలాపాలలో సాంకేతికత ప్రాముఖ్యతను శ్రీ సోనోవాల్ ప్రముఖంగా ప్రస్తావించారు. "స్మార్ట్ పోర్ట్‌లాదే భవిష్యత్తు. మేము ఇప్పటికే ఈ లక్ష్యం వైపు గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నాము." అని కేంద్ర మంత్రి అన్నారు. డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, పోర్ట్ కార్యకలాపాలను అనుకూలపరచడం, సామర్థ్యాన్ని పెంచడం భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి ఎన్ఎల్పి-మెరైన్, సాగర్-సేతు యాప్ వంటి ఇటీవలి డిజిటల్ కార్యక్రమాలను ప్రస్తావించారు. వాటాదారులందరినీ ఒకే ప్లాట్‌ఫారమ్‌పైకి తీసుకురావడం, లాజిస్టికల్ ఖర్చులు, సమయాన్ని తగ్గించడం, మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై సాధించిన ప్రగతిని కేంద్ర మంత్రి వివరించారు.
గ్రీన్ హైడ్రోజన్ నిర్వహణ, నిల్వ, రవాణా కోసం ప్రధాన ఓడరేవులు హైడ్రోజన్ హబ్‌లుగా మారేందుకు అభివృద్ధిలో ఉన్నాయని శ్రీ సోనోవాల్ చెప్పారు. దీనదయాళ్, పారాదీప్, చిదంబరనార్ ఓడరేవులు హైడ్రోజన్ బంకరింగ్ కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను ఇప్పటికే అభివృద్ధి చేయడం ప్రారంభించాయని ఆయన చెప్పారు.
రవాణా మౌలిక అవసరాల FICCI కమిటీ, పోర్ట్స్, షిప్పింగ్ చైర్మన్ ధృవ్ కోటక్, సుస్థిరత, గ్రీన్ పోర్ట్ కార్యక్రమాలకు ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ప్రశంసించారు. గ్రీన్ పోర్ట్ పాలసీ స్కోప్ వన్, స్కోప్ టూ, స్కోప్ త్రీ ఉద్గారాలలో ఉద్గార నిర్వహణపై దృష్టి సారించడం ద్వారా పోర్ట్ పర్యావరణ వ్యవస్థను మార్చడం లక్ష్యంగా పెట్టుకుందని కోటక్ పేర్కొన్నారు.
శ్రీ సోనోవాల్ 'స్మార్ట్, సేఫ్, సస్టైనబుల్ పోర్ట్స్'పై ఫిక్కీ-క్రిసిల్ నాలెడ్జ్ పేపర్‌ను ఆవిష్కరించారు. స్మార్ట్, సురక్షితమైన, స్థిరమైన పోర్ట్‌ల రూపకల్పనలో దోహదపడే కీలక అంశాలను నాలెడ్జ్ పేపర్ లో పొందుపరిచారు. ఇది పోర్ట్ సామర్థ్యాన్ని ఆప్టిమైజ్ చేయడానికి, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి పోర్ట్ ఆపరేటర్లు అవలంబించగల తాజా సాంకేతిక పురోగతులు, కార్యాచరణ ఉత్తమ పద్ధతులు, సుస్థిరత కార్యక్రమాల సమగ్ర అవలోకనాన్ని అందిస్తుంది.
****
(Release ID: 1920924)
Visitor Counter : 180