గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ప్రధాన పర్యావరణ పరిరక్షణ కోసం నగరాలకు సహకారం అందించడం లక్ష్యంగా బెంగళూరులో సదస్సు
Posted On:
22 APR 2023 2:53PM by PIB Hyderabad
పర్యావరణ పరిరక్షణ కోసం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి "నగరాల ప్రధాన స్రవంతి వాతావరణ చర్య" అనే అంశంపై బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొన్నారు. పర్యావరణ అంశంపై జీ-20 గుర్తించిన ప్రాధాన్యత అంశాలు, భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో పర్యావరణ పరిరక్షణ ప్రణాళికలను వేగంగా అమలు చేయడానికి అమలు చేయాల్సిన చర్యలను చర్చించడానికి సమావేశం ఏర్పాటయింది. యూ20 గుర్తించిన ఆరు ప్రాధాన్యత అంశాలలో మూడు అంశాలు (పర్యావరణ పరిరక్షణకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడం, నీటి భద్రత కల్పించడం, పర్యావరణహిత జీవన శైలి అలవర్చుకోవడం) సమావేశంలో చర్చకు వచ్చాయి.
పర్యావరణ పరిరక్షణ కోసం నగరాలు అమలు చేస్తున్న కార్యక్రమాలను మరింత వేగంగా అమలు కావాల్సిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తగ్గుతున్న వర్షపాతం వల్ల ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం అమలు జరుగుతున్న కార్యక్రమాలకు ప్రభుత్వాలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు నిధులు సమకూర్చాలని సమావేశం సూచించింది. బడ్జెట్ రూపొందించే ముందు వాతావరణ పరంగా ఎదురయ్యే ప్రమాదం ఉన్న అంశాలను గుర్తించి స్థానిక సంస్థలు తగిన నిధులు సమకూర్చుకోవడానికి చర్యలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న నిపుణులు సూచించారు. దీనికోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలను ప్రోత్సహించాలని, నిధుల సేకరణ కోసం ఉన్న గ్రీన్ బాండ్ల జారీ తో సహా అన్ని అవకాశాలు పరిశీలించాలని నిపుణులు పేర్కొన్నారు. నీటి భద్రత కల్పించడానికి పటిష్ట చర్యలు అమలు చేయడం, జల వనరుల సంరక్షణ, పునరుద్ధరణ కోసం నియంత్రణ పరమైన సంస్కరణలు అమలు చేయడం, పట్టణ ప్రాంతాలలో సమగ్ర నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేయడానికి, ప్రజలకు అవసరమైన పరిమాణంలో నీరు సరఫరా చేసి, వరదలు లాంటి జల సంబంధింత సమస్యల నుంచి ప్రజలకు రక్షణ కల్పించడానికి తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి స్థానిక సంస్థలు కృషి చేయాలని కూడా నిపుణులు సూచించారు.
సమావేశంలో ప్రసంగించిన కేంద్ర ప్రభుత్వ గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి స్మార్ట్ సిటీస్ మిషన్ డైరెక్టర్ కునాల్ కుమార్ ' సుస్థిర నగరాల అభివృద్ధిలో వినూత్న, సమగ్ర ప్రణాళిక కీలకంగా ఉంటుంది. కార్యాచరణ ప్రణాళిక లేకుండా ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం, విధాన నిర్ణయాల్లో మార్పులు తీసుకు రావడం సాధ్యం కాదు. విధానాల అమలులో అవసరమైన మార్పులు తీసుకు రావడానికి, ధరల నియంత్రణకు తగిన చర్యలు అమలు చేయాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంతాలలో సమస్యలు లేకుండా ప్రజలు జీవించడానికి తగిన చర్యలు అమలు జరగాలి. తెలంగాణలో అమలు జరుగుతున్న' కూల్ రూఫ్' విధానం అన్ని ప్రాంతాల్లో అమలు జరగాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు కోసం పర్యావరణపర అంశాలకు నిధులు సమీకరించాల్సిన అవసరం ఉంది' అని అన్నారు.

సీ-40 దక్షిణ, పశ్చిమ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్ శృతి నారాయణ్ మాట్లాడుతూ పర్యావరణపరంగా ఎదురవుతున్న సమస్యలను ఎదుర్కోవడానికి భారతదేశంలోని నగరాలతో సహా ప్రపంచవ్యాప్తంగా నగరాలు సిద్ధమవుతున్నాయని అన్నారు. అయితే, సమస్యలను పూర్తిగా పటిష్టంగా ఎదుర్కోవడానికి అవసరమైన సౌకర్యాల కొరతను నగరాలు ఎదుర్కొంటున్నాయని శృతి నారాయణ్ పేర్కొన్నారు. దీనికోసం పర్యావరణ పరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం కావాలని అన్నారు. సమస్యలను జాతీయ అంతర్జాతీయ వేదికల్లో వినిపించడానికి నగర పరిపాలనా యంత్రాంగాలు కృషి చేయాలనీ శృతి నారాయణ్ సూచించారు. పర్యావణ అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రణాళిక రూపొందించడానికి సమావేశం సహకరిస్తుందని శృతి నారాయణ్ అన్నారు.
సమావేశంలో మాట్లాడిన కర్ణాటక పట్టణాభివృద్ధి శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి శ్రీ రాకేష్ సింగ్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో బెంగళూరు అగ్ర స్థానంలో ఉందన్నారు. ' ప్రజా రవాణా, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రజల సహకారంతో బెంగళూరులో కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రజల సహకారం అవసరం.' అని శ్రీ రాకేష్ సింగ్ అన్నారు.
కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో సీ40 సిటీస్ క్లైమేట్ లీడర్‌షిప్ గ్రూప్ సమావేశాన్ని2023 ఏప్రిల్ 21న బెంగళూరులో నిర్వహించింది. జీ-20 అధ్యక్ష హోదాలో భారతదేశం నిర్వహిస్తున్న అర్బన్ 20 (యూ-20) సమావేశాల్లో భాగంగా ఈ సమావేశం జరిగింది. మొదటి సమావేశానికి అహ్మదాబాద్ నగరం ఆతిథ్యం ఇచ్చింది. సమావేశాన్ని నిర్వహించడానికి కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇతర సంస్థలు సహకారం అందించాయి. ఈ ఏడాది జరగనున్న జీ-20 సదస్సులో యూ-20 ఆమోదించిన తీర్మానాలు, సూచనలు పరిశీలనకు వస్తాయి.
సమావేశాలకు 135 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. వీరితో పాటు దేశం వివిధ ప్రాంతాలకు చెందిన నగరాల అధికారులు, నిపుణులు, పెట్టుబడిదారులు, భాగస్వామ్య సంస్థలు వర్చువల్ విధానంలో సమావేశంలో పాల్గొంటారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి అంశాలపై పనిచేస్తున్న అంకుర సంస్థలు కూడా సమావేశంలో పాల్గొని చర్చల్లో పాల్గొంటున్నాయి.
సమావేశం సందర్భంగా నగరాల నుంచి వచ్చిన అధికారులు, పట్టణ ప్రాంతాల ప్రణాళిక వేత్తలు,ఇంజినీర్లు ఇతరుల కోసం రెండు ప్రత్యేక సదస్సులు (ప్రకృతి ఆధారిత పరిష్కారాలు ,వాతావరణ బాండ్లు) నిర్వహించాయి.
అర్బన్ 20:
జీ-20 సభ్య దేశాలకు చెందిన నగరాలను ఒక వేదిక పైకి తెచ్చి అంతర్జాతీయ ఆర్థిక, వాతావరణ,అభివృద్ధి అంశాలు చర్చిండానికి అర్బన్-20 ఏర్పాటయింది. వివిధ అంశాలపై చర్చలు జరిపి, సమస్యల పరిష్కారం, అభివృద్ధి సాధన కోసం అమలు చేయాల్సిన చర్యలు, అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ అంశాల్లో నగరాలకు తగిన ప్రాధాన్యత కల్పించడం లాంటి అంశాలపై జీ-20 కి అర్బన్-20 సలహాలు, సూచనలు అందిస్తుంది.
యూ-20 శాశ్వత వేదికగా పనిచేస్తుంది. ప్రతి ఏడాది ఒకో దేశం యూ-20 అధ్యక్ష బాధ్యతలు చేపడుతుంది. గతంలో బ్యూనస్ ఎయిర్స్ మరియు పారిస్ (2018), టోక్యో (2019), రియాద్ (2020), రోమ్ మరియు మిలన్ (2021), జకార్తా మరియు వెస్ట్ జావా (2022) అధ్యక్షత వహించాయి.
సీ-40 సిటీస్ క్లైమేట్ లీడర్‌షిప్ గ్రూప్ :
ప్రపంచంలోని ప్రముఖ నగరాలకు చెందిన దాదాపు 100 మంది మేయర్లు సీ-40 సిటీస్ క్లైమేట్ లీడర్‌షిప్ గ్రూప్ సభ్యులుగా ఉన్నారు. వాతావరణ సమస్యలు ఎదుర్కోవడానికి సంఘటిత కృషి చేసి ప్రతి ఒక్క నగరానికి భవిష్యత్తు ప్రణాళిక రూపొందించడానికి సీ-40 సిటీస్ క్లైమేట్ లీడర్‌షిప్ గ్రూప్ కృషి చేస్తోంది. ప్రజల సహకారంతో ప్రపంచ ఉష్ణోగ్రత 1.5°Cకి మించి పెరగకుండా చూసి ప్రజలందరికీ అందుబాటులో ఆరోగ్యకరమైన,సుస్థిర అభివృద్ధి సాధించడానికి అవసరమైన పరిస్థితి అభివృద్ధి చేయడానికి సీ-40 సిటీస్ క్లైమేట్ లీడర్‌షిప్ గ్రూప్ కృషి చేస్తోంది. పర్యావరణహిత హరిత అభివృద్ధి సాధించడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం, కార్మిక, వ్యాపార రంగాలు, యువతను పర్యావరణ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించి వేగంగా అభివృద్ధి సాధించడానికి అనువైన కార్యక్రమాలను సీ-40 సిటీస్ క్లైమేట్ లీడర్‌షిప్ గ్రూప్ రూపొందిస్తోంది.
సందేహాల నివృత్తి, ఇతర సమాచారం కోసం info@urban20.org , me dia@c40.org సంప్రదించవచ్చు.
(Release ID: 1918805)