కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

2023 ఫిబ్రవరి నెలలో 13.96 లక్షల మంది నికర సభ్యులను చేర్చుకున్న - ఈ.పి.ఎఫ్.ఓ.

Posted On: 20 APR 2023 5:10PM by PIB Hyderabad

ఈరోజు విడుదల చేసిన ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈ.పి.ఎఫ్.ఓ) కు చెందిన తాత్కాలిక పేరోల్ డేటా ప్రకారం 2023 ఫిబ్రవరి నెలలో ఈ.పి.ఎఫ్.ఓ. లో ​​13.96 లక్షల మంది నికర సభ్యులు చేరారు. 

ఈ నెలలో చేరిన మొత్తం 13.96 లక్షల మంది నికర సభ్యుల్లో, దాదాపు 7.38 లక్షల మంది కొత్త సభ్యులు మొదటిసారిగా ఈ.పిఎఫ్.ఓ. ​​పరిధిలోకి వచ్చారు.  కొత్తగా నమోదైన 2.17 లక్షల మంది సభ్యుల్లో,  18-21 సంవత్సరాల వయస్సు గల వారి సంఖ్య అత్యధికంగా ఉంది. ఆ తర్వాత 22-25 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు 1.91 లక్షల మంది సభ్యులుగా నమోదయ్యారు.   ఈ నెలలో ఈ.పిఎఫ్.ఓ. లో నమోదైన మొత్తం కొత్త సభ్యులలో 55.37 శాతం మంది 18-25 సంవత్సరాల మధ్య వయస్కులు ఉన్నారు.  దేశంలోని సంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల్లో ఈ నెలలో ఈ.పిఎఫ్.ఓ. లో చేరిన మెజారిటీ సభ్యులు మొదటి సారి ఉద్యోగార్ధులు అని ఇది సూచిస్తోంది. 

దాదాపు 10.15 లక్షల మంది సభ్యులు ఈ.పీ.ఎఫ్‌.ఓ. తిరిగి సభ్యత్వం తీసుకున్నారనీ, ఇది గత ఏడాదితో పోలిస్తే 8.59 శాతం పెరిగిందని కూడా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  ఈ సభ్యులు తమ ఉద్యోగాలను మార్చుకుని, ఈ.పి.ఎఫ్.ఓ. ​​కింద ఉన్న సంస్థల్లో తిరిగి చేరారు.  వారి సామాజిక భద్రతా రక్షణను పొడిగిస్తూ తుది పరిష్కారం కోసం దరఖాస్తు చేయడానికి బదులుగా వారి ఖాతాలో ఉన్న నిల్వలను బదిలీ చేయడానికి ఎంచుకున్నారు.

2023 ఫిబ్రవరి లో నికర మహిళా సభ్యుల నమోదు 2.78 లక్షలు కాగా, ఈ సంఖ్య నెలలో నికర సభ్యుల చేరికలో దాదాపు 19.93 శాతం.   వీరిలో 1.89 లక్షల మంది మహిళా సభ్యులు కొత్తగా సభ్యులుగా చేరారు.  కొత్తగా చేరిన వారిలో ఇది దాదాపు 25.65 శాతం అదనం.  మహిళా భాగస్వామ్య పరంగా, నికర మహిళా సభ్యుల చేరిక, కొత్త మహిళా సభ్యుల చేరిక, గత నాలుగు నెలల్లో అత్యధిక నిష్పత్తిని నమోదు చేసింది.   వ్యవస్థీకృత శ్రామిక శక్తి లో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్న ధోరణిని ఇది సూచిస్తోంది. 

నికర సభ్యుల చేరికలో నెలవారీగా పెరుగుతున్న ధోరణి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ప్రతిబింబిస్తోందని రాష్ట్రాల వారీగా పేరోల్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.   నికర సభ్యుల చేరిక విషయానికొస్తే, మొదటి 5 రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ ఉన్నాయి.  ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం కలిసి నెలలో నికర సభ్యుల చేరిక 58.62 శాతంగా ఉంది.  అన్ని రాష్ట్రాలతో పోలిస్తే, మహారాష్ట్ర 20.90 శాతం నికర సభ్యులను జోడించడం ద్వారా ప్రథమ స్థానంలో ఉండగా, తమిళనాడు 11.92 శాతంతో తరువాతి స్థానంలో ఉంది.

పరిశ్రమల వారీగా పేరోల్ డేటా వర్గీకరణ గమనిస్తే, 'నిపుణుల సేవలు' (మానవశక్తి సరఫరాదారులు, సాధారణ కాంట్రాక్టర్లు, భద్రతా సేవలు, ఇతర కార్యకలాపాలు మొదలైనవి) నెలలో మొత్తం సభ్యుల చేరికలో 41.17 శాతంగా ఉంది.   పరిశ్రమల వారీగా డేటాను గత నెలతో పోల్చి చూస్తే, 'తోలు ఉత్పత్తులు', 'దుస్తుల-తయారీ', 'కొరియర్ సేవలను అందించడంలో నిమగ్నమైన సంస్థలు', 'చేపల ప్రాసెసింగ్, నాన్-వెజ్ ఫుడ్ ప్రిజర్వేషన్' వంటి పరిశ్రమల్లో అధిక సంఖ్యలో సభ్యులు నమోదయ్యారు.  

ఉద్యోగి రికార్డులను సవరించడం అనేది ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి, డేటా ఉత్పత్తి అనేది నిరంతర వ్యాయామం కాబట్టి పేరోల్ డేటా తాత్కాలికంగా ఉంటుంది.  కాబట్టి మునుపటి డేటా ప్రతి నెలా మారుతూనే ఉంటుంది.  2017 ​​సెప్టెంబర్ నాటి సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకుని, ఈ.పి.ఎఫ్.ఓ. 2018 ఏప్రిల్ నెల నుంచి ప్రతీ నెలా పేరోల్ డేటాను సవరించి, తాజా సమాచారాన్ని  విడుదల చేస్తోంది.  నెలవారీ పేరోల్ డేటాలో, ఆధార్ చెల్లుబాటు చేయబడిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యు.ఏ.ఎన్) ద్వారా మొదటిసారి ఈ.పి.ఎఫ్.ఓ. లో చేరిన సభ్యులు, ఈ.పి.ఎఫ్.ఓ. నుంచి నిష్క్రమించిన ప్రస్తుత సభ్యులు, నిష్క్రమించి-తిరిగి చేరిన సభ్యుల వివరాలను, నికర నెలవారీ పేరోల్‌ డేటాకు చేర్చడం జరుగుతుంది. 

ఈ.పి.ఎఫ్.ఓ. అనేది ఉద్యోగుల భవిష్యనిధి, ఇతర ప్రొవిజన్స్ చట్టం-1952 నిబంధనలకు అనుగుణంగా దేశంలోని వ్యవస్థీకృత ఉద్యోగులకు భవిష్య పింఛన్, బీమా నిధుల రూపంలో సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ.

*****



(Release ID: 1918420) Visitor Counter : 168


Read this release in: English , Urdu , Hindi , Punjabi