యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
సుస్థిర శాంతిపై వై-20 సంప్రదింపులకు జమ్ము విశ్వవిద్యాలయం ఆతిథ్యం
Posted On:
18 APR 2023 2:39PM by PIB Hyderabad
జమ్ము విశ్వవిద్యాలయం 2023 ఏప్రిల్ 18, 19 తేదీల్లో ‘వై-20 సుస్థిర శాంతి-సామరస్యం’పై సంప్రదింపుల సమావేశం నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి విశ్వవిద్యాలయ ఉప-కులపతి ప్రొఫెసర్ ఉమేష్ రాయ్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- భారత్ 2022 డిసెంబరు 1న జి-20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించగా, 2023 నవంబరు 30దాకా ఈ హోదాలో కొనసాగనుండటాన్ని గుర్తుచేశారు. ఈ బాధ్యతల నిర్వహణ భారతీయ సాంస్కృతిక విలువలతో సుసంపన్నం కావాలనే లక్ష్యంతో ‘వసుధైవ కుటుంబకం’ ఆదర్శాన్ని ఇతివృత్తంగా స్వీకరించిందని పేర్కొన్నారు. ఆ మేరకు ‘ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు’ ధ్యేయంగా ముందుకు వెళ్తున్నదని తెలిపారు.
“ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న అనేక సవాళ్లను మానవాళి సమష్టిగా ఎదుర్కొనాల్సిన నేటి పరిస్థితులకు ‘వసుధైవ కుటుంబకం’ అనే ఆలోచన ఎంతైనా సముచితం. వాతావరణ మార్పు సమస్య నుంచి మహమ్మారి బెడద వరకూ జాతీయత, నేపథ్యాలతో నిమిత్తం లేకుండా మానవాళి మొత్తానికీ మేలు కోసం మనం కలసికట్టుగా పరిష్కారాన్వేషిణ చేయాల్సి ఉంది” అని ప్రాఫెసర్ రాయ్ అన్నారు. ఈ దిశగా కృషికి తోడ్పడేందుకు భారత జి-20 అధ్యక్షత చట్రం కింద యువజన వ్యవహారాల శాఖ ‘యూత్-20 మహాసదస్సు-2023’ (వై-20) నిర్వహిస్తున్నదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ మేరకు మెరుగైన భవిష్యత్తుపై యువతరం ఆలోచనల సమీకరణ, కార్యాచరణ ముసాయిదా తయారీకి యూత్-20 కార్యాచరణ బృందం దేశవ్యాప్తంగా యువజనంతో చర్చలు-సంప్రదింపులు నిర్వహించాలని తలపెట్టిందన్నారు. జి20 కూటమి ప్రాథమ్యాలపై యువతరం తమ దృక్కోణాన్ని, ఆలోచనలను పంచుకునేందుకు ‘వై-20’ వేదిక కానుందని ఆయన చెప్పారు.
ఈ చర్చలు-సంప్రదింపుల నిర్వహణకు దేశవ్యాప్తంగా ఎంపికచేసిన 15 భాగస్వామ్య విద్యా సంస్థలలో జమ్మూ విశ్వవిద్యాలయం ఒకటి కావడం విశేషమని ప్రొఫెసర్ రాయ్ అన్నారు. ఈ మేరకు ‘సుస్థిర శాంతి-సామరస్యం: యుద్ధరహిత యుగానికి నాంది’ ప్రధానాంశంగా విశ్వవిద్యాలయం చర్చాగోష్ఠి నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. దాదాపు 18 మంది జాతీయ-అంతర్జాతీయ వక్తలతో మూడు బృందాల నడుమ సాగే గోష్ఠులకు “వివాద నివారణ-సుస్థిర శాంతిపై అంతర్జాతీయ ఏకాభిప్రాయ సమీకరణ; సమష్టి కృషితో వెలుపలి శక్తుల నియంత్రణ; సుస్థిర శాంతి సాధనలో చురుకైన పాత్ర దిశగా యువతకు ప్రోత్సాహం” ఇతివృత్తాలుగా ఉంటాయన్నారు. తదనుగుణంగా యూత్-20 సంప్రదింపుల సదస్సు బహిరంగ చర్చలు, ప్రదర్శనలు, పరస్పర చర్చాగోష్ఠులకు వేదికవుతుంది. ముఖ్యంగా ప్రపంచ యువత ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. ఈ మేరకు 2023 ఏప్రిల్ 19న ప్రారంభోత్సవ కార్యక్రమాలను ప్రొఫెషర్ ఉమేష్ రాయ్ విలేకరులకు వివరించారు.
ఈ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ, భూవిజ్ఞాన శాఖ, ప్రధాని కార్యాలయ, ప్రజా ఫిర్యాదులు-పెన్షన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల (స్వతంత్ర బాధ్యతగల) సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్; జమ్ము విశ్వవిద్యాలయ కులపతి, జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా కూడా పాల్గొంటారని ప్రొఫెసర్ రాయ్ చెప్పారు. ప్రముఖ రచయిత అశ్విన్ సంఘి కీలకోపన్యాసం చేస్తారని తెలిపారు. అలాగే కేంద్ర యువజన వ్యవహారాల శాఖ ఇన్‌చార్జి డైరెక్టర్ శ్రీ పంకజ్ కుమార్ సింగ్, ‘వై-20’ సచివాలయ కన్వీనర్ శ్రీ అజయ్ కశ్యప్ తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో మార్గనిర్దేశం చేస్తున్న యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీమతి మీతా రాజీవ్‌లోచన్‌కు ప్రొఫెసర్ రాయ్ కృతజ్ఞతలు తెలిపారు.
సమాజ సేవ, జర్నలిజం, భౌగోళిక రాజకీయ వ్యవహారాలు, పోలీసు తదితర రంగాలకు చెందిన నిపుణులు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఈ మేరకు బ్రిటన్ నుంచి రచయిత, సామాజిక కార్యకర్త మనుఖజూరియా సింగ్; న్యూఢిల్లీకి చెందిన కాలమిస్టు, శాస్త్రవేత్త, రచయిత డాక్టర్ ఆనంద్ రంగనాథన్; అమెరికా నుంచి రచయిత, వ్యాఖ్యాత సునందవశిష్ట్; జమ్ముకశ్మీర్ పోలీసు శాఖ ఐపీఎస్ అధికారి, ఏడీజీపీ ఎం.కె.సిన్హా కూడా పాల్గొంటారని చెప్పారు. సంప్రదింపుల సందర్భంగా వివిధ చర్చాగోష్ఠులలో ఇతివృత్తాలపై వారు చర్చిస్తారని తెలిపారు. అలాగే అమెరికా నుంచి రచయిత్రి, సంపాదకురాలు, కాలమిస్ట్ సహానా సింగ్ వంటి ప్రముఖ నిపుణుల నుండి విశ్లేషణ కూడా లభిస్తుందన్నారు. వీరితోపాటు రాజకీయ విశ్లేషకుడు, ఔత్సాహిక చరిత్రకారుడు రోహిత్ పఠానియా తదితరులు కూడా చర్చల్లో పాలుపంచుకుంటారు.
యూత్-20 సంప్రదింపుల ద్వారా ఇతర భాగస్వాములతో సహకారం, నెట్‌వర్కింగ్ అవకాశాలు లభిస్తాయని, యువత వికాసానికీ ఇది దోహదం చేస్తుందని ప్రొఫెసర్ రాయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యక్ష భాగస్వామ్యం ద్వారా ఆదానప్రదానాలకు, నెట్‌వర్క్ ఏర్పరచుకోవడానికి, పరస్పరం మమేకం కావడానికి ఇదొక అర్థవంతమైన, ఉత్తేజకర కార్యక్రమంగా రూపుదిద్దుకునేలా సంబంధిత భాగస్వాములంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశం సందర్భంగా మీడియా కమిటీ కన్వీనర్ డాక్టర్ గరిమా గుప్తా స్వాగత ప్రసంగం చేయగా మీడియా సెల్ ఇన్‌చార్జి డాక్టర్ వినయ్ తుసూ కార్యక్రమాన్ని పర్యవేక్షించడంతోపాటు వందన సమర్పణ చేశారు.
ఈ కార్యక్రమంలో జమ్మూ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అరవింద్ జస్రోటియా; విద్యార్థి సంక్షేమ విభాగం డీన్ ప్రొఫెసర్ ప్రకాష్ సి.అంతహళ్; జి-20 జెయు కమిటీ కన్వీనర్ దీపాంకర్ సేన్ గుప్తా; విద్యార్థి సంక్షేమ విభాగం సహకార డీన్ ప్రొఫెసర్ అనిల్ గుప్తా; విశ్వవిద్యాలయ వ్యవస్థాపన-నైపుణ్యాభివృద్ధి కేంద్రం కన్వీనర్ అల్కా శర్మ; ఉప-కులపతి ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ నీరజ్ శర్మ; ‘డిఐక్యూఎ’ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గిన్ని డోగ్రా; విద్యార్థి సంక్షేమ విభాగం సహాయ డీన్ డాక్టర్ ప్రీతమ్ సింగ్; అమృతకాల కార్యక్రమం నోడల్ అధికారి డాక్టర్ ఇమ్రాన్ ఫరూక్, మీడియా అధికారి శ్రీమతి మాన్సీ మంటూ తదితరులు కూడా పాల్గొన్నారు.
*****
(Release ID: 1917785)