పర్యటక మంత్రిత్వ శాఖ

అంబేద్కర్ సర్క్యూట్ లో భారత్ గౌరవ్ యాత్రికుల రైలు : నాగపూర్ లో దీక్షాభూమి మరియు డ్రాగన్ ప్యాలేస్ సందర్శన

Posted On: 16 APR 2023 8:12PM by PIB Hyderabad

     భారత్ గౌరవ్ యాత్ర రైలు న్యూఢిల్లీ నుంచి బయలుదేరి ఇండోర్, డాక్టర్ భీంరావు అంబేద్కర్ జన్మస్థలం మావ్ కు ఏప్రిల్ 15న చేరింది.  అంబేద్కర్ యాత్రా స్పెషల్ రైలులో వెళ్లిన ప్రయాణీకులు రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ కు ప్రణామం చేసి నివాళులు అర్పించారు.
      భీం జన్మభూమిలోని స్మారక మందిరంలో ప్రయాణీకులు సమావేశమై అంబేద్కర్ జీవితం, పోరాటాలు మొదలైన వాటి గురించి  చర్చించారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో ప్రారంభించిన ఈ యాత్రవల్ల బాబాసాహెబ్ భీంరావు అంబేద్కర్ జీవితానికి సంబంధించిన ప్రాంతాలను చూసే అవకాశం కలిగినందుకు ప్రత్యేక రైలు ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేశారు.  
      భారత్ గౌరవ్ యాత్రికుల రైలు 16వ తేదీ ఆదివారం ఉదయం నాగపూర్ చేరింది.  నాగపూర్ చేరిన యాత్రికులు దీక్షాభూమి,  డ్రాగన్ ప్యాలేస్ చూశారు.  దీక్షభూమి చారిత్రాత్మక స్థలం.  డాక్టర్ అంబేద్కర్  లక్షలాది మంది తన అనుచరులతో కలిసి 1956 అక్టోబరులో బౌద్ధమతాన్ని స్వీకరించారు.   బాబాసాహెబ్ భౌతిక అవశేషాలు దీక్షాభూమి స్థూపం కేంద్ర గుమ్మటంలో ఉంచారు.  నాగపూర్ లోని కాంపీటీ  పట్టణంలో  డ్రాగన్ ప్యాలేస్ ఉంది.   అక్కడ ధ్యానం చేసుకోవడానికి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.  గంధపు చెక్కతో చేసిన బుద్ధ విగ్రహం ప్రధాన ఆకర్షణ.   ఆదివారం సాయంత్రం పొద్దుపోయాక  నాగపూర్ వదిలిన యాత్రికులు తమ యాత్రలో తదుపరి మజిలీ మధ్యప్రదేశ్ లోని సాంచీకి బయలుదేరి వెళ్లారు.  
       సాంచి తరువాత వారి తదుపరి మజిలీ వారణాసి.   సారనాధ్  మరియు కాశీ విశ్వనాథ్ ఆలయ సందర్శన ఒకరోజు వినోదయాత్రలో భాగం.  యాత్రలో ఆరవ రోజు ప్రత్యేక రైలు గయకు చేరుతుంది.   అదే చివరి గమ్యస్థానం.   బోధ గయలో యాత్రికులు ప్రఖ్యాత మహాబోధి ఆలయాన్ని,  ఇతర బౌద్ధ ఆరామాలను చూస్తారు.   ఆ మరునాడు యాత్రికులు రహదారి మార్గంలో రాజగిర్ మరియు నలంద వెళ్తారు.  అక్కడ బౌద్ధ ప్రదేశాలు  మరియు నలందలోని శిథిలాలు యాత్రికులకు దర్శనీయ స్థలాలు.  రైలు గయ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్తుంది.  అదే చివరి గమ్యస్థానం.  
      అంబేద్కర్ సర్క్యూట్ లో భారత్ గౌరవ్ యాత్రికుల రైలును హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లో  కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు.  
      పర్యాటక మంత్రిత్వ శాఖతో కలసి ఐఆర్ సీటీసీ అంబేద్కర్ సర్క్యూట్ లో తమ మొదటి 8రోజుల ప్రత్యేక టూర్ ను హజ్రత్ నిజాముద్దీన్ నుంచి 14 ఏప్రిల్, 2023న ప్రారంభించింది.   యాత్రలో భాగంగా పర్యాటకులు బాబా సాహెబ్ అంబేద్కర్  జీవితానికి సంబంధించిన న్యూఢిల్లీ, మావ్, నాగపూర్ మరియు పవిత్ర బౌద్ధమత స్థలాలు సాంచి, సారనాధ్, గయ మరియు రాజగిర్ మరియు నలంద సందర్శించడం యాత్రలో భాగం.  
       ఈ రైలులో యాత్రికుల కోసం తాజా శాఖాహార భోజనం వడ్డించే అత్యంత అధునాతన పాంట్రీ కార్ ఉంది. యాత్రికులకు వారి సీట్లలోనే భోజనం వడ్డించే ఏర్పాటు ఉంది. వినోదం కోసం  అవసరమైన వ్యవస్థ ఉంది. సిసిటివి కెమెరా,  పరిశుభ్రమైన టాయిలెట్, ప్రతి కోచ్ కు సెక్యూరిటీ గార్డ్ సేవలు కూడా యాత్రికులకు రైల్లో లభ్యమవుతాయి.   సెక్యూరిటీ గార్డ్ సేవలు కూడా యాత్రికులకు రైల్లో లభ్యమవుతాయి.  
       దేశీయ పర్యాటకంలో ప్రత్యేక సర్క్యూట్లు ప్రోత్సహించడంలో భాగంగా భారత ప్రభుత్వ 'దేకో అప్నా దేశ్' ఉపక్రమణ లో భాగంగా  భారత్ గౌరవ్ యాత్రికుల రైలు ప్రారంభించడం జరిగింది.
      మరిన్ని వివరాల కోసం ఐ ఆర్ సి టి సి  వెబ్సైట్ https://www.irctctourism.com. సందర్శించండి.

 

***



(Release ID: 1917345) Visitor Counter : 159


Read this release in: English , Urdu , Hindi , Marathi