ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గోవాలో 17 న ప్రారంభం కానున్న రెండవ జి-20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశం


జి-20 దేశాల, ఆహూతులైన దేశాల, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు 180 మందికి పైగా ఈ రెండవ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి హాజరు

Posted On: 16 APR 2023 2:50PM by PIB Hyderabad

భారతదేశపు జి-20 అధ్యక్షతన రెండవ హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు 2023 ఏప్రిల్ 17-19 తేదీల మధ్య గోవాలో జరగబోతున్నాయి. 19 జి-20 సభ్య దేశాల, ఆహూతులైన దేశాల, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు 180 మందికి పైగా ఈ రెండవ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి హాజరవుతున్నారు.    జి-20 హెల్త్ ట్రాక్ కింద గుర్తించిన మూడు ప్రాధాన్య అంశాలమీద ఈ సమావేశాల్లో చర్చలు జరుగుతాయి: .

మొదటి ప్రాధాన్యం : ఆరోగ్య అత్యవసరాల నిరోధం, సంసిద్ధత, స్పందన ( వన్ హెల్త్, ఏఎంఆర్ మీద ప్రధాన  దృష్టి)   

రెండవ ప్రాధాన్యం: ఫార్మాస్యూటికల రంగంలో సహకారాన్ని బలోపేతం చేస్తూ సురక్షితమైన, సమర్థవంతమైన, నాణ్యమైన, సరసమైన ధరలకే వైద్య పరమైన నివారణ చర్యలు ( టీకాలు,  చికిత్సలు, వ్యాధి నిర్థారణ) అందుబాటులో ఉండేలా చూడటం  

మూడవ ప్రాధాన్యం : డిజిటల్  ఆరోగ్య నవకల్పనలు, పరిష్కారాల ద్వారా సార్వత్రిక ఆరోగ్య అందుబాటుకు సహాయపడటం, వైద్య సేవల అందుబాటును మెరుగు పరచటం  

‘అతిథి దేవో భవ’ అనే భారతీయ తత్వం ఆధారంగా భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటుతూ, గోవా సంస్కృతిని ప్రతిబింబిస్తూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు   చేశారు. ప్రతినిధులకు గోవా రుచులు ఆస్వాదించే అనుభూతిని కలిగించటంతోబాటు అందమైన గోవా ప్రకృతి దృశ్యాలు చూపించి అతిథి మర్యాదలు చేస్తారు.  

భారత్ అధ్యక్షతన సాగే జి-20 హెల్త్ ట్రాక్ లో నాలుగు హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు, ఒక ఆరోగ్య మంత్రుల స్థాయి  సమావేశం జరుగుతాయి.  హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలతో జి 20 చర్చలకు మద్దతుగా నాలుగు అనుబంధ సమావేశాలు కూడా జరపాలని భారత్ నిర్ణయించింది. గోవాలో జరిగే రెండో సమావేశానికి అనుబంధంగా డిజిటల్ ఆరోగ్యం మీద  18-19 తేదీలలో ఒక అనుబంధ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశాలు దేశంలోని వివిధ ప్రదేశాలలో జరుగుతాయి. దీనివలన భారతదేశపు సుసంపన్నమైన, వైవిధ్య భరితమైన సంస్కృతులను ప్రదర్శించేందుకు అవకాశం కలుగుతుంది.

భారతదేశం ఒక కీలకమైన మైలురాయిని చేరుకున్నదనటానికి నిదర్శనంగా 2022 డిసెంబర్ 1 న జి 20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది.  భారతదేశం  ప్రస్తుతం జి 20 త్రయమైన ఇండోనేసియా, ఇండియా, బ్రెజిల్ లో భాగం. మొదటి సారిగా ఈ త్రయంలో మూడు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి.

భారతదేశపు జి 20 అధ్యక్షత గురించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటిస్తూ సమ్మిళిత, కార్యాచరణ లక్షితమైన, నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తుందన్నారు.  ప్రధాని ఆవిష్కరించిన ‘ ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ భావన భారతీయ తత్వమైన “వసుధైవ కుటుంబకమ్” మీద ఆధారపడింది. ఇది యావత్ ప్రపంచం నోట నానుతూ అందరూ కోవిడ్ సంక్షోభానంతర ఆరోగ్యవంతపు ప్రపంచాన్ని నిర్మించటంలో ఉమ్మడి కృషికి ఉపయోగపడుతుంది.   

జి 20 అధ్యక్ష హోదాలో భారతదేశం ఆరోగ్య ప్రాధాన్యాలను కొనసాగించటమే లక్ష్యంగా పనిచేస్తూ, గత అధ్యక్ష దేశాల ముఖ్యాంశాలను పరిగణనలోకి తీసుకుంటూ బలోపేతం కావాల్సిన అంశాలకు ప్రాధాన్యమిస్తుంది.  ఆరోగ్య సహకారంలో నిమగ్నమైన వివిధ వేదికలలో జరిగే చర్చలను ఏకోన్ముఖం చేస్తూ, సమీకృత కార్యాచరణకు భారతదేశం కృషి చేస్తుంది.   

***


(Release ID: 1917161) Visitor Counter : 153