Posted On:
08 APR 2023 8:54PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు చెన్నైలోని ఆల్ స్ట్రామ్ క్రికెట్ గ్రౌండ్ లో తమిళనాడుకు చెందిన అనేక కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపనాలు, పూర్తయిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయపు కొత్త సమీకృత టెర్మినల్ మొదటి దశ ప్రారంభించారు. చెన్నై-కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరైన వారి నుద్దేశించి ఆయన ప్రసంగించారు. చరిత్ర, సాంస్కృతిక సంపద, భాష, సంస్కృతుల నిలయంగా తమిళనాడు ను అభివర్ణించారు. మన స్వాతంత్ర్య సమరయోధులు అనేకమంది తమిళనాడుకు చెందినవారేనని గుర్తు చేశారు. దేశభక్తికీ, జాతీయవాద స్పృహకు తమిళనాడు కేంద్రబిందువన్నారు. త్వరలో తమిళులు జరుపుకోబోయే కొత్త సంవత్సరం కొత్త ఆశలకు, ఆకాంక్షలకు, కొత్త ప్రారంభాలకు సంకేతం కావాలని అభిలషించారు. ఈ రోజు నుంచి అనేక కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్నాయని, రైల్వే, రోడ్డు, విమాన యాణాలకు సంబంధించిన కొత్త ప్రాజెక్టులతో కొత్త సంవత్సరం మొదలవుతోందన్నారు.
వహారతదేశం అత్యంత వేగంతో, భారీ స్థాయిలో సాగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చూస్తోందని, ఈ ఏడాది బడ్జెట్ లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకే 10 లక్షల కోట్లు బడ్జెట్ లో కేటాయించటాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది 2014 తో పోల్చుకుంటే ఐదు రెట్లు ఎక్కువని, అందులోనూ రైల్వేలకు అత్యధిక కేటాయింపులున్నాయని అన్నారు. వేగం గురించి మాట్లాడుతూ, 2014 తరువాత జాతీయ రహదారుల పొడవు ఏటా రెట్టింపు అవుతూ వస్తోందన్నారు. రైలు మార్గం విద్యుదీకరణ 600 కిలోమీటర్ల నుంచి 4000 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 150 కి పెరిగిందని కూడా చెప్పారు.
దేశంలో 2014 కు ముండు 380 వైద్య కళాశాలలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 660 కి చేరిందని, డిజిటల్ చెల్లింపులలో ప్రపంచంలోనే భారత దేశం నెంబర్ వన్ అయిందని ప్రధాని చెప్పారు. 6 లక్షల కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ లైన్లు వేసి దాదాపు 2 లక్షల గ్రామపంచాయితీలను అనుసంధానం చేశామన్నారు.
పని సంస్కృతి, దార్శనికతలో మార్పు వల్లనే ఈ సానుకూల మార్పులు సాధ్యమయ్యాయన్నారు. గతంలో మౌలిక వసతుల ప్రాజెక్టులు అనగానే విపరీతమైన ఆలస్యానికి ఆనవాళ్ళని, ఇప్పుడు అత్యంత వేగంగా పూర్తవుతున్నాయని చెప్పుకొచ్చారు. పన్ను చెల్లించే ప్రజల ప్రతి రూపాయికీ ప్రభుత్వం జవాబుదారుగా ఉంటుందని, అందుకే ప్రాజెక్టుల ఆలస్యం వల్ల ఖర్చు పెరగకుండా నిర్దిష్ట గడువులోగా పూర్తయ్యేలా జాగ్రత్త పడుతోందని అన్నారు. గతంలో మౌలిక సదుపాయాలు అంటే కేవలం కాంక్రీట్ , ఇటుకలు అనే భావన ఉండేదని, కానీ ఇప్పుడు మానవీయ కోణంలో చూస్తున్నామని ప్రజల ఆకాంక్షలు వాస్తవరూపం ధరించటమే తమ ప్రాధాన్యమని వ్యాఖ్యానించారు.
ఈ రోజు ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ, ప్రత్తి పండించే విరుదునగర్, తెన్ కాశీ ప్రాంతాలను ఇతర మార్కెట్లతో అనుసంధానం చేస్తున్నాయన్నారు. చెన్నై-కోయంబత్తూరు మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు చిన్న వ్యాపారులను కొనుగోలుదారులతో అనుసంధానం చేస్తోందన్నారు, కొత్త అంతర్జాతీయ టెర్మినల్ వలన ప్రపంచమే తమిళనాడు ముంగిట ఉంటుందని, మరిన్ని పెట్టుబడులు రావటానికి, యువతకు అవకాశాలు మెరుగుపడటానికి దోహదం చేస్తుందన్నారు. “వేగం పుంజుకుంటున్నది వాహనాలు మాత్రమే కాదు, ప్రజల కళలు, యువత వ్యాపార దక్షత, తద్వారా ఆర్థిక వ్యవస్థ కూడా” అన్నారు.
“తమిళనాడు అభివృద్ధి ప్రభుత్వానికి అత్యంత ప్రధానం” అని ప్రధాని స్పష్టం చేశారు. రాష్ట్రానికి అత్యధికంగా రైల్వేలకోసం ఈ బడ్జెట్ లో 6000 కోట్లు కేటాయించామన్నారు. 2009-2014 లో సగటు కేటాయింపు రూ.900 కోట్లకంటే తక్కువే ఉండేదన్నారు. 2004-2014 మధ్య జోడించిన జాతీయ రహదారుల పొడవు 800 కిలోమీటర్లు కాగా, 2014-2023 మధ్య దాదాపు 2000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మించిన సంగతి గుర్తు చేశారు. జాతీయ రహదారుల నిర్వహణకు తమిళనాడులో 2014-15 లో 1200 కోట్లు వెచ్చించగా 2022-23 లో ఆరు రెట్లు ఎక్కువగా 8200 కోట్లు వెచ్చించామన్నారు.
ఇప్పుడు చేపడుతున్న ప్రాజెక్టుల వలన రాష్ట్రంలో ప్రధాన నాగరాలైన చెన్నై, మదురై, కోయంబత్తూరు నేరుగా లబ్ధి పొందుతాయన్నారు. కొత్త అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ పెరుగుతున్న ప్రయాణీకుల రాడదేని తట్టుకోవటానికి ఉపయోగపడుతుందని , దీని డిజైన్ తమిళ సంస్కృతిలోని అందాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. పర్యావరణ హిత పదార్థాలతో నిర్మాణం జరిగిందని, సౌర శక్తి, ఎల్ ఇ డి బల్బుల వినియోగం అందుకు నిదర్శనమన్నారు. కొత్తగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ స్వదేశంలో తయారైందని, వివో చిదంబరం పిళ్లై లాంటివారు పుట్టిన నేలకు ఇది గర్వకారణమని అన్నారు.
కోయంబత్తూరు నగరం పారిశ్రామిక కేంద్రమని, అది జౌళి అయినా, ఎంఎస్ఎంఈ లు అయినా, పరిశ్రమలు అయినా ఆధునిక అనుసంధానత వలన ప్రజల ఉత్పాదక శక్తి పెరుగుతుందన్నారు. వందే భారత్ వలన చెన్నై, కోయంబత్తూరు మధ్య ప్రయాణ సమయం కేవలం 6 గంటలేనని గుర్తు చేస్తూ అది సేలం, ఈరోడ్, తిరుప్పూర్ పారిశ్రామిక కేంద్రాలకు కూడా ఎంతో ప్రయోజనం కలిగిస్తుందన్నారు. మదురై గురించి ప్రస్తావిస్తూ, తమిళనాడు సాంస్కృతిక రాజధాని అయిన మదురై ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాలలో ఒకటిగా అభివర్ణించారు. ఇప్పుడు ఈ నగరానికి ఆధునిక ప్రాజెక్టులు జోడిస్తున్నామన్నారు.
ప్రధాని మోదీ తన ప్రసంగం ముగిస్తూ, తమిళనాడు భారతదేశ గ్రోత్ ఇంజన్స్ లో ఒకటని అన్నారు. అత్యంత నాణ్యమైన మౌలిక వసతులవలన ఉపాధి అవకాశాలు పెరిగి ఆదాయాలు పెరుగుతాయని, ఆ విధంగా తమిళనాడు పెరిగితే దేశం పెరుగుతుందని ప్రధాని ఆకాంక్షించారు.
తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్ ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్, రైల్వే శాఖామంత్రి శ్రీ అశ్విన్ వైష్ణవ్, పౌర విమానయాన శాఖామంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర మత్స్య, పశుగణాభివృద్ధి, పాడి, సమాచారప్రసార శాఖల సహాయమంత్రి శ్రీ ఎల్. మురుగన్ శ్రీపెరుంబుదూరు ఎంపీ శ్రీ టీ ఆర్ బాలు, తమిళనాడు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
రూ. 3700 కోట్ల విలువ చేసే రోడ్డు ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనాలు చేశారు. మదురై నగరంలో 7.3 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభించారు. జాతీయ రహదారి 785 లో 24.4 కిలోమీటర్ల నాలుగు లేన్ల రోడ్డు కూడా ప్రారంభించారు. జాతీయ రహదారి 744 లో రోడ్డు ప్రాజెక్టులకు శంకు స్థాపన చేశారు. రూ.2400 కోట్లతో చేపట్టే ప్రాజెక్ట్ వలన తమిళనాడు, కేరళ మధ్య అనుసంధానత పెరిగి మదురైలోని మీనాక్షి ఆలయానికి, శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాళ్ ఆలయానికి, కేరళలోని శబరిమలకు వెళ్ళేవారికి ప్రయాణం సులువవుతుంది.
తిరుదురైపూండి-ఆగస్త్యంపల్లి మధ్య 294 కోట్లతో 37 కిలోమీటర్ల గేజ్ మార్పిడి పూర్తి కావటంతో దీన్ని ప్రారంభించటం వల్ల నాగపట్టణం జిల్లాలో అగస్త్యం పల్లి నుంచి ఉప్పు రవాణా సులువవుతుంది.
తాంబరం-సెంగొట్టై మధ్య ఎక్స్ ప్రెస్ సర్వీస్ ను కూడా ప్రధాని ప్రారంభించారు. అదే విధంగా తిరుదురై పూండి -ఆగస్త్యం పల్లి డెమూ ప్రారంభించటం వల్ల కోయంబత్తూరు, తిరువారూరు, నాగపట్టణం జిల్లాల ప్రయాణీకులకు ప్రయోజనం కలుగుతుంది.