వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

పీఎం గతి శక్తి కింద మౌలిక సదుపాయాల అభివృద్ధికి నాలుగు ప్రాజెక్టులు చేపట్టాలని సిఫార్సు చేసిన ఎన్‌పిజి


రైల్వే యొక్క మొత్తం 4 ప్రాజెక్టులు బ్రాడ్ గేజ్ లైన్‌లో 3, ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్‌లో 1 ప్రాజెక్టు సిఫార్సు

Posted On: 07 APR 2023 11:24AM by PIB Hyderabad

పీఎం గతి శక్తి కింద మౌలిక సదుపాయాల అభివృద్ధికి నాలుగు ప్రాజెక్టులు చేపట్టాలని నెట్ వర్క్ ప్లానింగ్ గ్రూప్ (  ఎన్‌పిజి  ) 46వ సమావేశం సిఫార్సు చేసింది. డీపీఐఐటీ రవాణా విభాగం ప్రత్యేక కార్యదర్శి కార్యదర్శి శ్రీమతి సుమితా దావ్రా అధ్యక్షతన జరిగిన సమావేశం వివిధ ప్రతిపాదనలు పరిశీలించి నాలుగు ప్రాజెక్టులు సిఫార్సు చేసింది. సమావేశంలో టెలికమ్యూనికేషన్ శాఖ, పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పు,రైల్వే,  పోర్ట్‌లు, షిప్పింగ్ మరియు జలమార్గాలు, పౌర విమానయాన, ఇంధన శాఖ, నీతి ఆయోగ్, రహదారి రవాణా, జాతీయ రహదారులు, పెట్రోలియం, సహజ వాయువు, నూతన పునరుత్పాదక శక్తి   వంటి కీలక సభ్య మంత్రిత్వ శాఖల/విభాగాల నుంచి సీనియర్ అధికారులు  పాల్గొన్నారు. సమావేశంలో రైల్వే శాఖ ప్రతిపాదించిన నాలుగు ప్రాజెక్టులను సమావేశం పరిశీలించి ఆమోదం తెలిపింది. సంపూర్ణ, సమగ్ర విధానంలో పీఎం గతిశక్తి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రాజెక్టులను అమలు చేస్తారు. బహుళ ప్రయోజన  ప్రాజెక్టుల నిర్మాణంతో సరుకులు, ప్రయాణీకుల రవాణా వేగంగా జరుగుతుంది.దేశంలో రవాణా వ్యవస్థ సామర్థ్యం పెరుగుతుంది. 

   రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయ్ మాధోపూర్- జైపూర్ మధ్య బ్రాడ్-గేజ్ డబుల్ లైన్ నిర్మాణం కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన  ప్రాజెక్టు వివరాలు సమావేశం పరిశీలించింది. సవాయ్ మాధోపూర్ నుంచి  జైపూర్ వరకు సుమారు 131 కిలోమీటర్ల మేరకు ప్రాజెక్టు అమలు జరుగుతుంది.ప్రాజెక్టు వల్ల   మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి. పూర్తయిన తర్వాత, ప్రాజెక్ట్ 2026-27 నాటికి లైన్ సామర్థ్యాన్ని 71% (మెయింటెనెన్స్ బ్లాక్ లేకుండా) , 80% (మెయింటెనెన్స్ బ్లాక్‌తో)కి మెరుగుపరుస్తుంది. జైపూర్-సవాయి మాధోపూర్ మార్గం ఢిల్లీ-ముంబై మార్గానికి ఫీడర్‌గా పనిచేస్తుంది. జైపూర్, దాని పరిసర ప్రాంతాలు, ముంబై, భారతదేశంలో దక్షిణ మరియు తూర్పు ప్రాంతాలను కలిపే ప్రాథమిక మార్గంగా ఈ మార్గం ఉపకరిస్తుంది. ప్రతిపాదిత ప్రాజెక్ట్ ఇప్పటికే ఉన్న సింగిల్ లైన్ నెట్‌వర్క్‌లో రద్దీని తగ్గించి  అంతరాయం లేకుండా రాకపోకలు జరిగేలా సహాయపడుతుంది. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఈశాన్య రైల్వేలో మహరాజ్‌గంజ్ మీదుగా ఆనంద్ నగర్ ఘుఘులీ మధ్య కొత్త బ్రాడ్-గేజ్ లైన్ నిర్మాణం కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ప్రాజెక్ట్‌ను సమావేశం సమీక్షించింది.  ప్రతిపాదిత ప్రాజెక్టు ఆనంద్ నగర్ నుంచి  సుమారు 53 కిలోమీటర్ల దూరంలో ఉంది.  బ్రాడ్ గేజ్ (BG)  మార్గాన్ని నిర్మించడం వల్ల  ప్రాజెక్ట్ ప్రాంతం  ఆర్థిక అభివృద్ధి సాధిస్తుందని అంచనా వేశారు. గోరఖ్‌పూర్ జంక్షన్‌లో ఆగకుండా వాల్మీకినగర్ నుంచి  మహరాజ్‌గంజ్ మీదుగా గోండాకు  రైళ్లు నడిచేందుకు  కొత్త లైన్ ప్రత్యామ్నాయ, దగ్గర మార్గంగా  ఉపయోగపడుతుంది. ఈ విభాగంలో ప్రస్తుతం రాకపోకలు రోడ్డు ద్వారా సాగుతున్నాయి. రైల్వే లైన్ నిర్మాణం వల్ల  ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలవుతుంది. అదనంగా, రైల్వే లైన్ సిమెంట్, ఎరువులు, బొగ్గు మరియు ఆహార ధాన్యాల తరలింపును సులభతరం చేస్తుంది, దీని వల్ల  సంబంధిత పరిశ్రమలు ప్రయోజనం పొందుతాయి.  రైల్వే లైన్ నేపాల్‌కు సరుకు రవాణాకు సౌకర్యం అందిస్తుంది. 

ఒడిశా రాష్ట్రంలోని జునాఘర్ నుంచి  నబరంగ్‌పూర్ స్టేషన్ మధ్య కొత్త బ్రాడ్-గేజ్ లైన్ నిర్మాణం కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన  మరో ప్రాజెక్టును ఎన్‌పిజి పరిశీలించింది.జునాఘర్ నుంచి  నబరంగ్‌పూర్ వరకు దాదాపు 116 కిలోమీటర్ల పొడవున్న రైల్వే లైన్  ఈ కొత్త లైన్ నిర్మించాలని ప్రాజెక్టులో ప్రతిపాదించారు. దీని వల్ల బైలడెలా ఇనుప ఖనిజం గనుల నుంచి  రాయ్‌పూర్ ప్రాంతంలోని వివిధ ఉక్కు కర్మాగారాలకు 131 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది అని  భావిస్తున్నారు. అదనంగా, ఈ ప్రాజెక్ట్ స్టీల్ ప్లాంట్ రవాణా అవసరాలు తీరుస్తుంది. బహుళ మార్గ రవాణా వ్యవస్థలో భాగంగా ఆర్వీ  లైన్‌లోని జునాగర్ రోడ్, జైపూర్, కోరాపుట్, ఇతర గూడ్స్ షెడ్‌లలో గూడ్స్ షెడ్‌లు ఏర్పాటవుతాయి. ఈ కొత్త లైన్ విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఓడరేవుల నుంచి రాయ్‌పూర్ ప్రాంతంలోని వివిధ స్టీల్ ప్లాంట్‌లకు బొగ్గు తరలింపునకు ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుంది. రోడ్డు- రైల్ రవాణా విధానం వల్ల జైపూర్,జునాఘర్ , నబరంగ్‌పూర్ మార్గంలో సరకుల రవాణా పెరుగుతుంది. 

 పశ్చిమ రైల్వేలో సరుకు రవాణా ఎక్కువగా ఉన్న మార్గంలో  ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్‌ను అభివృద్ధి చేయడానికి రైల్వే శాఖ ప్రతిపాదించిన ప్రాజెక్టు సమావేశం పరిశీలనకు వచ్చింది. మహారాష్ట్ర , గుజరాత్ రాష్ట్రంలోని 895 RKM, పశ్చిమ రైల్వే లోని నాలుగు ప్రధాన విభాగాలు ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి. దీనిలో భాగంగా   రవాణా ఒత్తిడి ఎక్కువగా ఉన్న మార్గాలను  ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్‌  వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే పశ్చిమ రైల్వే హై డెన్సిటీ నెట్‌వర్క్ (HDN) మార్గాల్లో  ఇప్పటికే ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్‌ వ్యవస్థ  మంజూరు చేయబడింది లేదా ఉనికిలో ఉంది. ప్రాజెక్టు వల్ల రైల్వే మార్గం సామర్థ్యం పెరుగుతుంది. రైళ్లు గంటకు 110 నుంచి 130 కిలోమీటర్ల వేగం గా నడుస్తాయి. దీనివల్ల   రైల్వేలకు ఖర్చు తగ్గడానికి, మొత్తం రవాణా  సామర్థ్యాన్ని పెంచడానికి వీలు కల్పిస్తుంది.  ఉద్నా - జల్గావ్, అహ్మదాబాద్ - పాలన్‌పూర్, అహ్మదాబాద్- విరామ్‌గామ్- సమాఖియాలీ మరియు విరామ్‌గామ్- రాజ్‌కోట్ విభాగాలలో ప్రయాణ సమయం, రైళ్లు అనుమతి కోసం వేచి చూడాల్సిన సమయం తగ్గుతాయి. 

నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ (NPG) 46వ సెషన్ 03.04.2023న న్యూఢిల్లీలో జరిగింది.

***



(Release ID: 1914753) Visitor Counter : 137