ఆర్థిక మంత్రిత్వ శాఖ
2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి ప్రభుత్వ రుణ నిర్వహణపై త్రైమాసిక నివేదిక
Posted On:
01 APR 2023 9:25AM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రుణ నిర్వహణ విభాగం (పీడీఎంసీ), ప్రభుత్వ రుణ నిర్వహణపై 2010-11 ఏప్రిల్-జూన్ త్రైమాసికం (క్యూ1) నుంచి క్రమం తప్పకుండా నివేదిక విడుదల చేస్తోంది. ఇప్పుడు, 2022 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన (క్యూ3ఎఫ్‌వై23) నివేదికను విడుదల చేసింది.
క్యూ3ఎఫ్‌వై23లో, కాల గడువు సెక్యూరిటీల ద్వారా, కేంద్ర ప్రభుత్వం రుణ క్యాలెండర్‌లో నోటిపై చేసిన రూ.3,18,000 కోట్ల మొత్తానికి బదులు రూ.3,51,000 కోట్లను సేకరించింది. (క్యూ2ఎఫ్‌వై23 చివరి వేలం మొత్తం క్యూ3ఎఫ్‌వై23లో సర్దుబాటు జరిగింది). ఈ త్రైమాసికంలో కాల గడువు ముగిసిన రూ.85,377.9 కోట్లను తిరిగి చెల్లించింది. ప్రాథమిక జారీల సగటు రాబడి క్యూ2ఎఫ్‌వై23లోని 7.33 శాతం నుంచి క్యూ3ఎఫ్‌వై23లో 7.38 శాతానికి పెరిగింది. కొత్తగా జారీ చేసిన సెక్యూరిటీల సగటు మెచ్యూరిటీల కాల గడువు క్యూ2ఎఫ్‌వై23లోని 15.62 సంవత్సరాలతో పోలిస్తే క్యూ3ఎఫ్‌వై23లో 16.56 సంవత్సరాలకు పెరిగింది. 2022 అక్టోబర్-డిసెంబర్‌లో, క్యాష్ మేనేజ్‌మెంట్ బిల్లుల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సేకరించలేదు. ఈ త్రైమాసికంలో ప్రభుత్వ సెక్యూరిటీల కోసం రిజర్వ్ బ్యాంక్ ఒక్క ఓపెన్ మార్కెట్ లావాదేవీని కూడా చేపట్టలేదు. ఆ త్రైమాసికంలో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ సహా లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ (ఎల్‌ఏఎఫ్) కింద ఆర్‌బీఐ నికర రోజువారీ సగటు ద్రవ్యత రూ.39,604 కోట్లుగా ఉంది.
తాత్కాలిక సమాచారం ప్రకారం, ప్రభుత్వ స్థూల రుణాలు ('ప్రజా పద్దుల' రుణాలు సహా) 2022 సెప్టెంబర్ చివరి నాటికి ఉన్న రూ.1,47,19,572.2 కోట్ల నుంచి 2022 డిసెంబర్ చివరి నాటికి రూ.1,50,95,970.8 కోట్లకు స్వల్పంగా పెరిగాయి. త్రైమాసిక ప్రాతిపదికన 2.6 శాతం నృద్ధిని ఇది సూచిస్తుంది. మొత్తం స్థూల రుణాల్లో ప్రజా పద్దుల రుణం 2022 సెప్టెంబర్ చివరి నాటి 89.1 శాతంగా ఉంటే, 2022 డిసెంబర్ చివరి నాటికి 89.0 శాతంగా ఉంది. దాదాపు 28.29 శాతం సెక్యూరిటీలు 5 సంవత్సరాల కంటే తక్కువ కాల గడువుతో ఉన్నాయి.
10-సంవత్సరాల ప్రామాణిక సెక్యూరిటీపై రాబడి 2022 సెప్టెంబర్ త్రైమాసికం ముగిసే సమయానికి 7.40% నుంచి 2022 డిసెంబర్ త్రైమాసికం ముగింపు నాటికి 7.33%కి తగ్గింది. తద్వారా ఆ త్రైమాసికంలో 7 బేసిస్ పాయింట్లు తగ్గింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు, 2022 డిసెంబర్ 7న, రెపో రేటును 5.90% నుంచి 6.25%కు 35 బేసిస్ పాయింట్ల మేర ఆర్‌బీఐ ఎంపీసీ పెంచింది.
ద్వితీయ మార్కెట్‌లో, సమీక్ష కాల త్రైమాసికంలో 10 సంవత్సరాల ప్రామాణిక సెక్యూరిటీల్లో ఎక్కువ ట్రేడింగ్ కారణంగా, 7-10 సంవత్సరాల కాల గడువు సెక్యూరిటీల్లో ట్రేడింగ్ కార్యకలాపాలు తగ్గాయి. ఈ త్రైమాసికంలో, ద్వితీయ మార్కెట్‌లో మొత్తం “కొనుగోలు” లావాదేవీల్లో 24.41 శాతం, మొత్తం “విక్రయ” లావాదేవీల్లో 24.08 శాతం వాటాతో ప్రైవేట్ రంగ బ్యాంకులు ఆధిపత్యం చెలయించాయి. ఆ తర్వాతి స్థానాల్లో విదేశీ బ్యాంకులు, ప్రాథమిక డీలర్లు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్‌లు ఉన్నాయి. నికర ప్రాతిపదికన చూస్తే, సెకండరీ మార్కెట్‌లో విదేశీ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాథమిక డీలర్లు నికర విక్రయదార్లుగా ఉండగా; సహకార బ్యాంకులు, ఎఫ్‌ఐలు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్‌లు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, 'ఇతరులు' నికర కొనుగోలుదార్లుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోళ్లలో, 2022 సెప్టెంబర్ చివరి నాటికి వాణిజ్య బ్యాంకుల వాటా 38.3 శాతంగా ఉండగా, 2022 డిసెంబర్ చివరి నాటికి అది స్వల్పంగా 38.0 శాతానికి తగ్గిందని గణాంకాలు సూచిస్తున్నాయి.
పూర్తి నివేదికను ఇక్కడ చూడండి: అక్టోబర్-డిసెంబర్ (క్యూ3ఎఫ్‌వై23) కాలానికి ప్రభుత్వ రుణ నిర్వహణపై త్రైమాసిక నివేదిక
***
(Release ID: 1912848)