నౌకారవాణా మంత్రిత్వ శాఖ
జాతీయ సముద్ర రవాణా పోర్టల్ అనువర్తనం ‘సాగర్ సేతు’కు శ్రీ సర్బానంద సోనోవాల్ శ్రీకారం
ఈ మొబైల్ యాప్‌తో సరకు నిర్వాహకులకు సౌలభ్యం మెరుగు: శ్రీ సోనోవాల్;
ప్రత్యక్ష పర్యవేక్షణ.. ఆమోదాలు.. లావాదేవీలకు ‘సాగర్ సేతు’ ఎనలేని తోడ్పాటు
Posted On:
31 MAR 2023 4:57PM by PIB Hyderabad
కేంద్ర ఓడరేవులు-నౌకాయాన-జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఇవాళ జాతీయ రవాణా పోర్టల్ (సముద్ర) అనువర్తన రూపం ‘సాగర్-సేతు’ యాప్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ సహాయమంత్రి శ్రీ శ్రీపాద్ వై.నాయక్, కార్యదర్శి శ్రీ సుధాంశ్ పంత్ సహా ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఈ యాప్ రూపకల్పనలో “లాగిన్ మాడ్యూల్, సర్వీస్ కేటలాగ్, కామన్ అప్లికేషన్ ఫార్మాట్, లెటర్ ఆఫ్ క్రెడిట్, బ్యాంక్ గ్యారంటీ, సర్టిఫికేషన్, ట్రాక్-ట్రేస్” తదితర విశిష్ట సేవలకు ప్రాధాన్యమిచ్చారు. ఓడ సమాచారంసహా సాధారణంగా ఎగుమతి-దిగుమతిదారులు, మధ్యవర్తులకు అందుబాటులో ఉండని కార్యకలాపాల ప్రత్యక్ష సమాచారం అందించడంతోపాటు పర్యవేక్షణకు వీలు కల్పిస్తుంది. అలాగే గేట్, కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు, ఇతర లావాదేవీలు ఈ యాప్ ద్వారా చిటికెలో లభ్యమవుతాయి. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ ఛార్జీలు, షిప్పింగ్ లైన్ ఛార్జీలు, రవాణా ఛార్జీలు తదితర ఎగుమతి-దిగుమతి అనుమతుల ప్రక్రియ సంబంధిత అవసరమైన చెల్లింపుల నిమిత్తం డిజిటల్ లావాదేవీల నిర్వహణ వెసులుబాటు కూడా ఈ యాప్‌తో లభిస్తుంది.
ఈ అనువర్తనాన్ని ప్రారంభించిన సందర్భంగా శ్రీ సోనోవాల్ మాట్లాడుతూ- “చేతిలో ఇమిడే పరికరంలో పొందుపరచిన ‘సాగర్ సేతు’ యాప్ అన్నిరకాల కార్యకలాపాలను సులభంగా నిర్వహించడంలో సరకు నిర్వాహకులకు తోడ్పడుతుంది. అలాగే సమాచార ఆదానప్రదానానికి హామీ ఇస్తుంది కాబట్టి మంత్రిత్వశాఖతోపాటు రేవు అధికారులు, ఇతర భాగస్వాములకు అనుమతులు-పర్యవేక్షణ సంబంధిత సమాచారం వేలి కొసలమీదనే ఉంటుంది” అన్నారు.
వ్యాపారులకు ప్రయోజనాలు
- లావాదేవీల ఆరంభం నుంచి ముగింపు మధ్య సమయం ఆదా అవుతుంది కాబట్టి అనుమతులు, నిబంధనల పాటింపు సదుపాయం మెరుగుపడుతుంది.
- కార్యకలాపాలు-అనుసరణపై ప్రత్యక్ష పర్యవేక్షణ వెసులుబాటు పెరుగుతుంది
సేవాప్రదాతలకు ప్రయోజనాలు
- సేవల సంబంధిత లావాదేవీలు-రికార్డుల అనుసరణకు తోడ్పాటు
- సేవల కోసం అభ్యర్థనలు అందుకునే సౌలభ్యం.
సముద్య వాణిజ్యం పెంపు.. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పాటు లక్ష్యంగా కేవలం రెండు నెలల వ్యవధిలో ‘సాగర్ సేతు’ యాప్ ప్రారంభం కావడం విశేషం. సకల సేవల డిజిటల్ వేదిక నేషనల్ లాజిస్టిక్ పోర్టల్ (మెరైన్) ను అందుబాటులోకి తేవడంపై కేంద్ర ఓడరేవులు-నౌకాయాన-జలమార్గాల మంత్రిత్వ శాఖ, వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2023 జనవరిలో నిర్ణయం తీసుకోగా రెండునెలల్లో యాప్ రూపొంది, ప్రారంభం కావడం విశేషం.
*****
(Release ID: 1912765)
Visitor Counter : 229