మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హజ్ యాత్రికులకు ఆరోగ్య పరిరక్షణకు సమగ్ర ఏర్పాట్లు


విమానాశ్రయాలలో హెల్త్ డెస్క్లు

ప్రభుత్వ వైద్యులచే ఆరోగ్య పరీక్షలు.

మక్కా, మదీనా, జెడ్డాలలో విస్తృత ఆరోగ్య మౌలిక సదుపాయాలు.

Posted On: 29 MAR 2023 5:34PM by PIB Hyderabad

యాత్రికులకు నాణ్యమైన ఆరోగ్య సేవలకు మద్దతు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సమన్వయంతో
మక్కా సందర్శించే యాత్రికులకు సమగ్ర ఆరోగ్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది.
ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 25 లక్షల నుంచి 30 లక్షలమంది యాత్రికులు ప్రపంచంలోని వివిధ దేశాలనుంచి
మక్కాను సందర్శిస్తుంటారు. వీరికి సౌదీ అరేబియా ఆతిథ్యం ఇస్తూ ఉంటుంది. ప్రపంచంలో మక్కా యాత్రకు వెళ్లేవారి సంఖ్యను గమనించినపుడు, ఇండియా మూడవ స్థానంలో ఉంటుంది.
ఇంత పెద్ద సంఖ్యలో యాత్రికులు వెళుతున్నప్పుడు మక్కా, మదీనా, జెడ్డాలో వారి ఆరోగ్య అవసరాలు తీర్చడం
సవాలు. కోవిడ్ 19 కారణంగా గత 3 సంవత్సరాలుగా మక్కా కు వెళ్ళే యాత్రికుల సంఖ్య తగ్గినప్పటికీ, ఈ ఏడాది పెద్ద సంఖ్యలో యాత్రికులు
మక్కాను సందర్శించే అవకాశం ఉంది. ప్రస్తుత సంవత్సరం ఇండియాకు 1,75,025 మంది హజ్ యాత్రికుల కోటాను కేటాయించారు.
హజ్ యాత్రికులకు సమగ్రమైన , నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి,
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, ఉభయ మంత్రిత్వశాఖల అధికారుల తో పలు సమావేశాలు నిర్వహించారు. గత 3 నెలలలో
ఈ అంశంపై ఉభయ మంత్రిత్వశాఖ ల మధ్య  పది సమావేశాలు జరిగాయి. ఇందుకు సంబంధించి సవివరమైన కార్యాచరణ ప్రణాళిక
ను ఖరారుచేశారు.

మెడికల్ స్క్రీనింగ్, ఫిట్నెస్ సర్టిఫికేట్
హజ్ యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్న వారిని  పరీక్షించి వారికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ
ఆదేశాలు జారీచేసింది.  ఇందుకు సంబంధించి సవివరమైన నమూనాను విడుదల చేసింది. దీనిని రాష్ట్రాలకు పంపింది.
దరఖాస్తు దారులకు సహాయపడేందుకు ఈ ఏడాది , మెడికల్ స్క్రీనింగ్ , ఫిట్ నె సర్టిఫికేట్ను దరఖాస్తుదారుకు ఎవరైనా ప్రభుత్వ
ఆలోపతి డాక్టర్ ఇవ్వవచ్చునని తెలిపింది. ఇది దేశవ్యాప్తంగా మెడికల్ స్క్రీనింగ్ సర్టిఫికేట్లు పొందే ప్రక్రియను సులభతరం చేయనుంది.

హెల్త్‌ , వాక్సినేషన్‌ క్యాంప్‌లు......
హజ్‌ యాత్రకు ఎంపికైన యాత్రికులకు రాష్ట్రాలు, జిల్లా ఆరోగ్య అధికార యంత్రాంగం, ప్రత్యేక ఆరోగ్యక్యాంపులు నిర్వహిస్తారు. వీరు యాత్రకు బయలుదేరి వెళ్లడానికి ముందు , వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. వాక్సినేషన్‌ కూడా జరుగుతుంది. ప్రతి యాత్రికుడికి హెల్త్‌ కార్డును ఇస్తారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఇతర సమస్యలు ఏవైనా ఉంటే వాటి గురించి ప్రస్తావిస్తారు.  అలాగే డిజిటల్‌ పద్ధతిలో , సౌదీ అరేబియాలోని వైద్య బృందాలకు , యాత్రికుల ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉండేట్టు చూస్తారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఇది ఉపయోగపడుతుంది. ఇందుకు అనుగుణంగా ప్రతి రాష్ట్రం ఏర్పాట్లు చేసుకోవలసిందిగా ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ విభాగంతో కలిసి కార్యకలాపాలు నిర్వహించేందుకు నోడల్‌ అధికారిని కూడా నామినేట్‌ చేయవలసిందిగా ప్రభుత్వం సూచించింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అవసరమైన మేరకు క్యుఎంఎంవి వాక్సిన్‌లను , సీజనల్‌ఇన్‌ఫ్ల్యూయంజా వాక్సిన్‌ (ఎస్‌ఐవి)లను యాత్రికులకోసం సమకూర్చనుంది.
విమానాశ్రయాలలో హెల్త్‌ డెస్క్‌లు....
హజ్‌ యాత్రికులు యాత్రకు బయలుదేరి వెళుతున్న విమానాశ్రయాలలో , వారి ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా హెల్త్‌ డెస్క్‌లు ఏర్పాటుచేస్తారు.

సౌదీ అరేబియాలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు (అందుబాటులో వైద్యులు, పరికరాలు, మందులు):
సౌదీ అరేబియాలో ఆరోగ్య మౌలిక సదుపాయాల అవసరానికి అనుగుణంగా , కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సీనియర్‌ వైద్యుల బృందాలను అక్కడకు పంపుతున్నది. 2023 ఏప్రిల్‌ మొదటి వారంలో వారు అక్కడకు వెళతారు. అక్కడ తాత్కాలిక ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, ఫార్మసీలు, క్యాంపులను మక్కాలో, మదీనాలో జెడ్డాలో అరాఫత్‌లో మినాలో ఏర్పాటు చేస్తారు. ఈ బృందం నిపుణులైన వైద్యుల సేవల అవసరాన్ని , వైద్య పరికరాలు, మందుల అవసరాన్ని అంచనా వేస్తుంది. వీటిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందుబాటులో ఉంచుతుంది. నాణ్యతకు హామీ ఇచ్చే విధంగా మందులను జన ఔషధి కేంద్రాలనుంచి సమకూర్చుకుంటారు.

ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఆరోగ్య సదుపాయాలలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న ప్రభుత్వ వైద్యులను వారి అనుభవం, స్పెషలైజేషన్‌, ఇందుకు తగిన అర్హతలు వంటి వాటి ఆధారంగా ఎంపికచ ఏయాల్సిందిగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఎంపిక అయిన ఆరోగ్య నిపుణులకు యాత్రికుల ఆరోగ్య అవసరాలపై వివరించి, యాత్రికులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూస్తారు.

హజ్‌ యాత్రికులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.యాత్ర సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తే అవకాశం ఉందేమో పరిశీలిస్తారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, కేంద్ర ఆరోగ్య కుటుంబ  సంక్షేమ మంత్రిత్వశాఖ ల సమన్వయ కృషితో హజ్‌యాత్రికులు వైద్య పరీక్షలు, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్లు, వాక్సినేషన్‌, సకాలంలో వైద్య సేవలను పొందడానికి అన్ని ఏర్పాట్లూచేశారు. యాత్రకు బయలుదేరిన దగ్గర నుంచి యాత్ర ముగించుకుని సురక్షితంగా తిరిగి వచ్చే వరకు వారి ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది.

***


(Release ID: 1912764) Visitor Counter : 256


Read this release in: English , Urdu , Punjabi , Tamil