కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

నెట్‌వర్క్‌లో భారీ అంతరాయం ఉంటే తెలియజేయమంటూ అన్ని టెలికాం సంస్థలకు ట్రాయ్‌ ఆదేశం

Posted On: 28 MAR 2023 3:34PM by PIB Hyderabad

సాంకేతిక కారణాల వల్ల లేదా ప్రకృతి వైపరీత్యాల కారణంగా సంభవించే భారీ టెలికాం నెట్‌వర్క్‌ అంతరాయాల గురించి టెలికాం సేవల ప్రదాతలు (టీఎస్‌పీ) ట్రాయ్‌కి నివేదించడం లేదని తేలింది. సుదీర్ఘకాలం పాటు కొనసాగే పెద్ద నెట్‌వర్క్ అంతరాయాలు, ప్రత్యేకించి సరిహద్దు, కొండ ప్రాంతాల్లో సంభవించే అంతరాయాలు ఆయా ప్రభావిత ప్రాంతాల్లో సేవల లభ్యతను లేదా నాణ్యతను మందగింపజేస్తాయి.

ప్రధాన నెట్‌వర్క్ అంతరాయాలకు మూల కారణాన్ని అర్థం చేసుకోవడానికి, టెలికాం సంస్థలు స్థానిక అధికారుల నుంచి అవసరమైతే సాయం పొందేందుకు, ఆ తరహా అంతరాయాలకు సంబంధించిన సమాచారాన్ని జిల్లా స్థాయిలో సేకరించాలని ట్రాయ్‌ నిర్ణయించింది.

ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని, ఈ క్రింది చర్యలను తమకు నివేదించమని టెలికాం సంస్థలను ట్రాయ్‌ ఆదేశించింది:

  1. ఒక జిల్లా (కేంద్రం/రాష్ట్ర ప్రభుత్వ ప్రకారం రెవెన్యూ జిల్లా) మొత్తం వినియోగదార్లను ప్రభావితం చేసే టెలికాం నెట్‌వర్క్ అంతరాయాలు నాలుగు గంటల కంటే ఎక్కువ సేపు కొనసాగితే, అవి సంభవించిన 24 గంటల లోపు నిర్దేశిత నమూనాలో ఆ విషయాన్ని తెలియజేయాలి
  2. అటువంటి అంతరాయానికి మూల కారణం, ఆ తర్వాత తీసుకున్న దిద్దుబాటు చర్యలను సేవలను పునరుద్ధరించిన 72 గంటల లోపు నిర్దేశిత నమూనాలో అందించాలి

ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి.

***



(Release ID: 1911641) Visitor Counter : 117