ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్-19, కోవిడ్-19 వ్యాక్సినేషన్ పురోగతిపై రాష్ట్రాలతో ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించిన కేంద్రం


పాజిటివ్ నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ పై దృష్టి సారించి నిఘాను బలోపేతం చేయాలని, ఆర్టీ-పీసీఆర్ పరీక్షల అధిక నిష్పత్తితో పరీక్షలను పెంచాలని రాష్ట్రాలకు ఆదేశం

ఆక్సిజన్ సిలిండర్లు, పిఎస్ఎ ప్లాంట్లు, వెంటిలేటర్లు ,మానవ వనరులతో సహా ఆసుపత్రి మౌలిక సదుపాయాల నిర్వహణ సంసిద్ధతను నిర్ధారించడానికి మాక్ డ్రిల్స్ చేపట్టాలని రాష్ట్రాలకు సలహా

టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్ ,కోవిడ్ సముచిత ప్రవర్తనకు కట్టుబడి
ఉండడాన్ని కోవిడ్ నిర్వహణ కోసం నిర్దేశించిన వ్యూహంగా కొనసాగించాలి

प्रविष्टि तिथि: 27 MAR 2023 8:33PM by PIB Hyderabad

కేసుల పెరుగుదల దృష్ట్యా కోవిడ్ 19 మహమ్మారి నిర్వహణ విస్తృత పరిధికి సంబంధించిన సంసిద్ధత స్థితిని సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్, ఆరోగ్య పరిశోధన శాఖ కార్యదర్శి డాక్టర్ రాజీవ్ బహల్ పాల్గొన్నారు.

 

కేంద్ర ఆరోగ్య కార్యదర్శి 2023 మార్చి 22 న జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నుండి గౌరవ ప్రధాన మంత్రి సందేశాన్ని ప్రస్తావించారు .కోవిడ్ 19 నిర్వహణకు అప్రమత్తంగా ఉండాలని ,సంసిద్ధతను నిర్ధారించాలని రాష్ట్రాలకు సూచించారు.

2023 మార్చి 25 న ఆరోగ్య పరిశోధన, ఆరోగ్య - కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్తంగా జారీ చేసిన అడ్వైజరీ లో పేర్కొన్న ప్రాధాన్యతలను అనుసరించాలని ఆయన రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు స్పష్టం చేశారు. ఆర్టీ-పీసీఆర్ అధిక నిష్పత్తితో పరీక్షలను పెంచాలని, పాజిటివ్ శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అన్నివేళలా కోవిడ్ సముచిత ప్రవర్తనను పాటించాలని కోరారు. ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజలలో ముందుజాగ్రత్త మోతాదును పెంచాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

 

భారత్ లో పెరుగుతున్న కేసులతో సహా ప్రపంచ కోవిడ్ -19 పరిస్థితిని వివరిస్తూ ఈ సందర్భంగా సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు.2023 మార్చి 3తో ముగిసిన వారంలో 313 సగటు రోజువారీ కేసుల నుండి 2023 మార్చి 23 తో ముగిసిన వారంలో సగటు రోజువారీ కేసులు 966 కు పెరగడంతో భారతదేశంలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు వివరించారు. అదే సమయంలో వారం రోజుల పాజిటివిటీ 1.08 శాతానికి పెరిగింది.

 

2023 మార్చి 3తో ముగిసిన వారంలో 0.54 శాతంగా ఉన్న వీక్లీ పాజిటివిటీ 2023 మార్చి 24 నాటికి 4.58 శాతానికి పెరిగింది. గుజరాత్ లో 0.07 శాతం నుంచి 2.17 శాతానికి పెరిగింది.

కేరళలో వీక్లీ పాజిటివిటీ 1.47 శాతం నుంచి 4.51 శాతానికి పెరిగింది. కర్ణాటకలో వీక్లీ పాజిటివిటీ రేటు 1.65 శాతం నుంచి 3.05 శాతానికి, ఢిల్లీలో వీక్లీ పాజిటివిటీ 0.53 శాతం నుంచి 4.25 శాతానికి పెరిగింది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ వీక్లీ పాజిటివిటీ రేటు 1.92 శాతం నుంచి 7.48 శాతానికి పెరిగింది. రాజస్థాన్ లో 0.12 శాతం నుంచి 1.62 శాతానికి, తమిళనాడులో వీక్లీ పాజిటివిటీ 0.46 శాతం నుంచి 2.40 శాతానికి పెరిగింది.

 

22 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు సగటు రోజువారీ టిపిఎంను జాతీయ సగటు కంటే తక్కువగా నివేదిస్తున్నాయి. 2023 మార్చి 24తో ముగిసిన వారంలో భారతదేశంలోని 24 జిల్లాల్లో 10% కంటే ఎక్కువ వీక్లీ పాజిటివిటీ నమోదైందని, అదే సమయంలో 43 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ 5-10% మధ్య నమోదైందని పేర్కొన్నారు.

 

ఆక్సిజన్ సిలిండర్లు, పిఎస్ఎ ప్లాంట్లు, వెంటిలేటర్లు, లాజిస్టిక్స్ ,మానవ వనరులతో సహా ఆసుపత్రి మౌలిక సదుపాయాల నిర్వహణ సంసిద్ధతను ధృవీకరించడానికి 2023 ఏప్రిల్ 10 , 11 తేదీలలో అన్ని ఆరోగ్య కేంద్రాల్లో మాక్ డ్రిల్స్ చేపట్టాలని శ్రీ రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు సూచించారు. 2023, డిసెంబర్ 27న నిర్వహించిన చివరి మాక్ డ్రిల్ స్థితిగతులను ఆయన తెలియజేశారు.

16,601 ప్రభుత్వ ఆస్పత్రులు, 5,338 ప్రైవేటు ఆస్పత్రులు కలిపి మొత్తం 21,939 చోట్ల ఈ మాక్ డ్రిల్  నిర్వహించారు. దేశవ్యాప్తంగా 94 శాతానికి పైగా పీఎస్ఏ ప్లాంట్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పని చేస్తుండగా, 87 శాతానికి పైగా ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు, ఓ2 బెడ్లు, ఐసోలేషన్ బెడ్లు పని చేసే స్థితి లో ఉన్నట్టు కనుగొన్నారు.

 

కొత్త కోవిడ్ వేరియంట్లతో సంబంధం లేకుండా, 'టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్ ,  కోవిడ్ సముచిత ప్రవర్తనకు కట్టుబడి ఉండటం' అనేది కోవిడ్ నిర్వహణకు నిర్దేశించిన వ్యూహంగా కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి తెలిపారు. తద్వారా తగిన ప్రజారోగ్య చర్యలు చేపట్టేందుకు వీలవుతుందని తెలిపారు. రాష్ట్రాలలో తగినంత ప్రత్యేక పడకలు, ఆరోగ్య కార్యకర్తల లభ్యతను నిర్ధారించాలని, వ్యాధి ,వ్యాక్సినేషన్ గురించి ప్రజలలో అవగాహనను పెంచాలని ,కోవిడ్ ఇండియా పోర్టల్ లో కోవిడ్ -19 డేటాను క్రమం తప్పకుండా అప్డేట్ చేయాలని రాష్ట్రాలను కోరారు.

 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్ల వ్యాప్తి, వ్యాక్సిన్ ఇమ్యూనిటీ ఓ మోస్తరు స్థాయిలో ఉన్నందున అప్రమత్తత పెంచాల్సిన అవసరాన్ని డాక్టర్ వీకే పాల్ నొక్కి చెప్పారు. ఆర్టీపీసీఆర్ టెస్టులతో సహా సంసిద్ధతను పెంచాలని, ప్రజల్లో ప్రికాషన్ మోతాదు కవరేజీని పెంచాలని ఆయన రాష్ట్రాలను కోరారు.

 

పరీక్షలను పెంచాలని, ముఖ్యంగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను పెంచాలని, జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ రాజీవ్ బహల్ రాష్ట్రాలకు తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పంపిన సలహాలను పాటించాలని, కమ్యూనిటీ అవగాహన పెంచాలని కోరారు. ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలు కొత్త కేసులు, తీవ్రమైన కేసుల క్లస్టర్లను పర్యవేక్షించాలని ఆయన కోరారు.

 

కోవిడ్ నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై సమగ్రంగా, సవివరంగా చర్చించారు. గౌరవ ప్రధాని, కేంద్ర ఆరోగ్య మంత్రి అధ్యక్షతన సకాలంలో సమీక్షా సమావేశాలు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలను రాష్ట్రాలు అభినందించాయి. కొవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్రంతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చాయి. తాము అప్రమత్తంగా ఉన్నామని, ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తున్నామని  తెలియజేశాయి.

2023 ఏప్రిల్ 10 - 11 తేదీల్లో ఆసుపత్రుల మౌలిక సదుపాయాల సంసిద్ధత కోసం మాక్ డ్రిల్ నిర్వహిస్తామని రాష్ట్రాలు హామీ ఇచ్చాయి.

 

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎఎస్ శ్రీ లవ్ అగర్వాల్, మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల  ఎన్ హెచ్ ఎం మిషన్ డైరెక్టర్  ఈ సమీక్షలో పాల్గొన్నారు.

 

****


(रिलीज़ आईडी: 1911323) आगंतुक पटल : 156
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Marathi , Odia , Kannada