రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఇన్నోవేషన్స్‌ ఫర్‌ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్) పథకం

Posted On: 27 MAR 2023 3:11PM by PIB Hyderabad

ఎంఎస్‌ఎంఈలు, అంకుర సంస్థలు, వ్యక్తిగత ఆవిష్కర్తలు, ఆర్‌&డీ సంస్థలు, విద్యాసంస్థలు సహా పరిశ్రమలోని సంస్థల నుంచి రక్షణ, విమాన రంగంలో ఆవిష్కరణలు, సాంకేతిక వృద్ధిని సాధించే లక్ష్యంతో ఇన్నోవేషన్స్‌ ఫర్‌ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్) విధివిధానాలను కేంద్రం తీసుకొచ్చింది. ఈ రంగంలో స్వయం సంవృద్ధి సాధన కోసం ఈ పథకాన్ని ప్రకటించింది. 2023 ఫిబ్రవరి 28 వరకు, 139 ఐడెక్స్‌ విజేతలకు గ్రాంట్లు/నిధులు అందించడం జరిగింది. విజయవంతమైన పరీక్షల తర్వాత, మూడు ఐడెక్స్‌ సంస్థలకు భద్రత దళాలు సరఫరా ఆర్డర్‌లు అందించాయి. అంతేకాకుండా, మరో 13 ఐడెక్స్ ఉత్పత్తుల కోసం "యాక్సెప్టెన్స్‌ ఆఫ్‌ నెసిసిటీ"కి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

19 అనుబంధ భాగస్వామ్య ఇంక్యుబేటర్ల ద్వారా సాంకేతిక సాయాన్ని ఐడెక్స్‌ అందిస్తుంది. వివిధ ప్రభుత్వ సంస్థల వద్ద అందుబాటులో ఉన్న పరీక్ష కేంద్రాలు/మౌలిక సదుపాయాలను సులభంగా, వేగంగా ఉపయోగించుకోవడం, సులభమైన నిర్వహణ విధానాలు, తక్కువ నిబంధనల ద్వారా కలిసి ఆవిష్కరణలు రూపొందించడం వంటివి ఐడెక్స్‌ విజేతలకు అందుబాటులో ఉంటాయి. తద్వారా మొత్తం వ్యవస్థ వారికి అనుకూలంగా ఉంటుంది. కృత్రిమ మేధ, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్‌)/వర్చువల్ రియాలిటీ (వీఆర్‌), స్వతంత్ర/మానవరహిత పరిష్కారాలు, స్టెల్త్, డొమైన్ అవగాహన, సురక్షిత సమాచారం, సిమ్యులేషన్, నావిగేషన్, అంచనాల నిర్వహణ వంటి సాంకేతికతలు/డొమైన్‌లపై ఆవిష్కరణలను ఐడెక్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. తద్వారా, భారత భద్రత దళాలు తమ ప్రత్యర్థుల కంటే ఎక్కువ సాంకేతికతను కలిగి ఉన్నాయని నిర్ధరించడం దీని ఉద్దేశం.

రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.

***



(Release ID: 1911149) Visitor Counter : 190


Read this release in: English , Urdu , Marathi