ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ చిరుధాన్య (శ్రీ అన్న) సదస్సుకు ప్రధానమంత్రి శ్రీకారం


స్మారక తపాలా బిళ్లతోపాటు స్మారక నాణెం ఆవిష్కరించిన ప్రధాని;

డిజిటల్‌ రూపంలో భారత చిరుధాన్య (శ్రీ అన్న).. అంకుర
సంస్థల సంగ్రహం.. చిరుధాన్య ప్రమాణాలపై పుస్తకం ఆవిష్కరణ;

‘ఐసిఎఆర్’ పరిధిలోని భారత చిరుధాన్య పరిశోధన
సంస్థకు ప్రపంచ నైపుణ్య కేంద్రంగా గుర్తింపు;

“ప్రపంచ శ్రేయస్సుపై భారత కర్తవ్య నిబద్ధతకు ప్రపంచ చిరుధాన్య సదస్సు ప్రతీక”;

“భారతదేశ సమగ్రాభివృద్ధికి మాధ్యమంగా శ్రీ అన్న..
గ్రామం-గ్రామీణ పేదలతో ఇది ముడిపడి ఉంది”;

ప్రతి ఇంట్లో చిరుధాన్యాల తలసరి వాడకం 3 కిలోల నుంచి 14 కిలోలకు పెరిగింది”;

“భారత చిరుధాన్య కార్యక్రమం వాటిని సాగుచేసే 2.5 కోట్లమంది రైతులకు వరం”;

“ప్రపంచం పట్ల బాధ్యత.. మానవాళికి సేవపై
సంకల్పానికి భారత్‌ సదా ప్రాధాన్యమిస్తుంది”;

“మన ఆహార భద్రత.. అలవాట్ల సమస్యలకు ‘శ్రీ అన్న పరిష్కారం చూపగలదు”;

“భారత్ తన వారసత్వ స్ఫూర్తితో ప్రపంచ శ్రేయస్సుకు
ప్రాధాన్యమిస్తూ సమాజంలో మార్పును నడిపిస్తుంది”;

“చిరుధాన్యాలతో అపార అవకాశాలు అందివస్తాయి”

Posted On: 18 MAR 2023 1:39PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రపంచ చిరుధాన్య (శ్రీ అన్న) సదస్సును ప్రారంభించారు. న్యూఢిల్లీలోని పూసా రోడ్డులో ‘ఎన్‌ఎఎస్‌సి’ సముదాయంలోగల ‘ఐఎఆర్‌ఐ’ ప్రాంగణంలోని సుబ్రమణ్యం హాలులో ఉదయం 11:00 గంటలకు మొదలైన ఈ సదస్సు రెండు రోజులపాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా చిరుధాన్యాల సంబంధిత అంశాలన్నిటిపైనా చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. చిరుధాన్యాలపై రైతులు, వినియోగదారులు, ఇతర భాగస్వాములకు ప్రోత్సాహం-అవగాహన; చిరుధాన్య విలువ శ్రేణి విస్తరణ; చిరుధాన్యాలతో ఆరోగ్య-పోషక ప్రయోజనాలు; మార్కెట్‌ సంధానం; పరిశోధన-అభివృద్ధి వంటివన్నీ ఇందులో భాగంగా ఉంటాయి. ప్రపంచ సదస్సుతోపాటు చిరుధాన్య ప్రదర్శన, విక్రయ-కొనుగోలుదారుల సమావేశ సంబంధిత కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించి, సందర్శించారు. అంతేగాక స్మారక తపాలా బిళ్ల, నాణేన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. అనంతరం డిజిటల్‌ రూపంలో భారత చిరుధాన్యాలు (శ్రీ అన్న).. అంకుర సంస్థల సంగ్రహాన్ని, చిరుధాన్య ప్రమాణాల పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు.

   ఈ సదస్సు ప్రారంభం నేపథ్యంలో అంతర్జాతీయ నేతలు తమ సందేశాలు పంపారు. ఈ కార్యక్రమ నిర్వహణపై ఇథియోపియా అధ్యక్షురాలు గౌరవనీయ సాహ్లే-వార్క్ జెవ్దే భారత ప్రభుత్వాన్ని అభినందించారు. నేటి కాలంలో ప్రజలకు ఆహార సరఫరా, పోషకాల లభ్యతకు చిరుధాన్యాలు భరోసా ఇస్తాయని ఆమె అన్నారు. ఉప-సహారా ఆఫ్రికాలో ఇథియోపియా ఒక ముఖ్యమైన చిరుధాన్య ఉత్పాదక దేశం. ఈ నేపథ్యంలో చిరుధాన్యాలపై ప్రచార విస్తృతి కోసం విధానపరంగా శ్రద్ధ చూపాల్సిన ఆవశ్యకతను సదస్సు గుర్తుచేస్తుందని ఆమె పేర్కొన్నారు. అలాగే వాటి పర్యావరణ వ్యవస్థకు అనుగుణంగా పంటల సాగు సానుకూలతపై అధ్యయనం దిశగా ఈ కార్యక్రమం ప్రయోజనాన్ని ఆమె నొక్కిచెప్పారు.

   చిరుధాన్యాలకు ప్రాచుర్యం కల్పించడంలో భారత్‌ ప్రపంచ నాయకత్వ బాధ్యత చేపట్టిందని గయానా అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ తన సందేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచంలోని ఇతర దేశాల ప్రయోజనార్థం తన నైపుణ్యాన్ని అందుబాటులో ఉంచుతోందని కొనియాడారు. సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్‌డిజి) సాధనలో అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం విజయం ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. ఆహార భద్రతకు భరోసా కల్పించడంలో చిరుధాన్యాల కీలక ప్రాధాన్యాన్ని గయానా గుర్తించిందని ఆయన తెలిపారు. తమ దేశంలో చిరుధాన్యాల ఉత్పత్తి పెంపు లక్ష్యంగా 200 ఎకరాల భూమిని ప్రత్యేకంగా కేటాయించడం ద్వారా భారత్‌తో సహకారానికి గయానా శ్రీకారం చుట్టింది. తదనుగుణంగా గయనా ప్రభుత్వానికి భారతదేశం తన సాంకేతిక మార్గదర్శకత్వంసహా మద్దతు అందిస్తుంది.

   స‌దస్సును ప్రారంభించిన అనంతరం ప్ర‌ధానమంత్రి ప్ర‌సంగిస్తూ- ఈ కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకున్న ప్ర‌తి ఒక్క‌రినీ అభినందించారు. ప్రపంచ శ్రేయస్సుకు ఇలాంటి కార్య‌క్ర‌మాలు అవసరం మాత్రమేగాక ఆ దిశగా భార‌త‌దేశానికిగల కర్తవ్య నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఒక సంకల్పాన్ని వాంఛనీయ ఫలితంగా మార్చడంలోని ప్రాముఖ్యాన్ని ఎత్తిచూపుతూ- భారత్‌ నిరంతర కృషివల్లనే ఐక్యరాజ్యసమితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరంగా ప్రకటించిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ మేరకు ప్రపంచం అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సర సంబరం నిర్వహించుకుంటున్న తరుణంలో భారత్‌ చేపట్టిన కార్యక్రమం ఈ దిశగా ఒక ముఖ్యమైన ముందడుగని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా చిరుధాన్యాల సాగు, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య ప్రయోజనాలు, రైతులకు ఆదాయం వంటి అంశాలపై పంచాయితీలు, వ్యవసాయ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలే కాకుండా వివిధ దేశాల, రాయబార కార్యాలయాల చురుకైన భాగస్వామ్యంతో మేధోమథన గోష్ఠులు నిర్వహిస్తారని ప్రధానమంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇవాళ దాదాపు 75 లక్షల మంది రైతులు ఈ కార్యక్రమంతో వర్చువల్‌గా మమేకం అయ్యారని కూడా ఆయన తెలిపారు. కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా ఆయన చిరుధాన్య  ప్రమాణాలపై పుస్తకావిష్కరణతోపాటు ‘ఐసిఎఆర్‌’ పరిధిలోని భారత చిరుధాన్య పరిశోధన సంస్థను ప్రపంచ నైపుణ్య కేంద్రంగా ప్రకటించారు. అలాగే ప్రపంచ చిరుధాన్య సదస్సు స్మారక తపాలా బిళ్ల, నాణేన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు.

   ఈ సదస్సు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించాల్సిందిగా ప్రతినిధులందరికీ ప్రధాని సూచించారు. అక్కడ చిరుధాన్యాల సాగు సంబంధిత అన్ని కోణాలనూ ఒకే కప్పుకింద అవగాహన చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. చిరుధాన్య సంబంధిత వ్యాపారాలు, సాగువైపు అంకుర సంస్థలను మళ్లించడంలో యువత చూపుతున్న చొరవను ఆయన అభినందించారు. “చిరుధాన్యాలపట్ల భారత కర్తవ్య నిబద్ధతకు ఇదొక నిదర్శనం” అని ఆయన అన్నారు.

   చిరుధాన్యాలకు భారత ముద్రలో భాగంగా ‘శ్రీ అన్న’గా నామకరణం చేసినట్లు ప్రధానమంత్రి విదేశీ ప్రతినిధులకు వెల్లడించారు. ‘శ్రీ అన్న’ ఇప్పుడు కేవలం ఆహారం లేదా వ్యవసాయానికి పరిమితం కాదని ఆయన అన్నారు. చిరుధాన్యాలకు ‘శ్రీ’ అనే ఉపసర్గను చేర్చడానికిగల ప్రాధాన్యాన్ని భారత సంప్రదాయంపై అవగాహన గలవారు అర్థం చేసుకోగలరని పేర్కొన్నారు. “భారతదేశ సమగ్రాభివృద్ధికి శ్రీ అన్న ఒక మాధ్యమంగా మారుతోంది. గ్రామం-గ్రామీణ పేదలతో ఇది ముడిపడి ఉంది” అని ప్రధాని వ్యాఖ్యానించారు. అలాగే “శ్రీ అన్న- దేశంలోని చిన్నకారు రైతుల సౌభాగ్య ప్రదాయని; శ్రీ అన్న- కోట్లాది దేశపౌరుల పౌష్టికతకు పునాది; శ్రీ అన్న- ఆదివాసీ సమాజానికి సత్కారం; శ్రీ అన్న- తక్కువ నీటితో ఎక్కువ పంట; శ్రీ అన్న- రసాయన రహిత వ్యవసాయానికి మూలస్తంభం; శ్రీ అన్న- వాతావరణ మార్పుపై పోరాటంలో తిరుగులేని ఆయుధం” అని ప్రధానమంత్రి చిరుధాన్యాల ప్రాశస్త్యాన్ని ఘనంగా చాటారు.

   శ్రీ అన్న’ను ప్రపంచ ఉద్యమంగా మార్చడంలో ప్రభుత్వ నిరంతర కృషి గురించి నొక్కిచెబుతూ- 2018లో చిరుధాన్యాలను పోషక-తృణధాన్యాలుగా ప్రకటించినట్లు గుర్తుచేశారు. అలాగే రైతులకు వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పనతోపాటు వాటి మార్కెటింగ్‌పై ఆసక్తి కలిగించడందాకా అన్ని స్థాయులలోనూ ఈ కృషి కొనసాగిందని తెలిపారు. దేశంలోని 12-13 రాష్ట్రాల్లో చిరుధాన్యాలు ప్రధానంగా పండిస్తుండగా ప్రతి ఇంట్లో నెలకు తలసరి వినియోగం 3 కిలోలకు మించేది కాదని, నేడు ఇది 14 కిలోలకు పెరిగిందని ప్రధాని పేర్కొన్నారు. అదేవిధంగా చిరుధాన్య ఆహార ఉత్పత్తుల అమ్మకాల్లోనూ దాదాపు 30 శాతం  వృద్ధి నమోదైందని ఆయన తెలిపారు. చిరుధాన్యాలపై వంటకాలకు ప్రత్యేకించిన సామాజిక మాధ్యమ మార్గాలతోపాటు ‘మిల్లెట్ కేఫ్‌’ల ప్రారంభాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. “ఒక జిల్లా - ఒక ఉత్పత్తి’ పథకం కింద దేశంలోని 19 జిల్లాల్లో సాగుకు అనువైన చిరుధాన్య రకాలను ఎంపిక చేశాం” అని శ్రీ మోదీ తెలిపారు.

   భారతదేశంలో 2.5 కోట్లమంది చిన్నకారు రైతులు చిరుధాన్యాల ఉత్పత్తిలో ప్రత్యక్షంగా నిమగ్నమై ఉన్నారని ప్రధానమంత్రి తెలియజేశారు. వారి భూకమతాలు చాలా చిన్నవే అయినప్పటికీ అంతకుముందు వాతావరణ మార్పు సవాళ్లను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో “భారత చిరుధాన్య ఉద్యమం- శ్రీ అన్నపై ప్రచారంతో దేశంలోని ఈ 2.5 కోట్ల మంది రైతులకు వాటి సాగు ఒక వరమని రుజువవుతుంది” అని ప్రధాని అన్నారు. స్వాతంత్య్రానంతరం చిరుధాన్యాలు పండించే 2.5 కోట్ల మంది చిన్నకారు రైతులను ప్రభుత్వం ఆదుకోవడం ఇదే తొలిసారి అని ఆయన వివరించారు. మరోవైపు చిరుధాన్యాలు ప్రాసెస్‌, ప్యాకేజ్‌ ఆహారాల రూపంలో ఇప్పుడు దుకాణాలు, మార్కెట్లకు చేరుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. ‘శ్రీ అన్న’ మార్కెట్‌కు ఊతం లభిస్తే ఈ 2.5 కోట్ల మంది చిన్నకారు రైతుల ఆదాయం కూడా పెరిగి, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుందని నొక్కిచెప్పారు. అదేవిధంగా ‘శ్రీ అన్న’పై కృషిచేస్తున్న 500కుపైగా అంకుర సంస్థలు వచ్చాయని, వీటితోపాటు కొన్నేళ్లుగా ‘ఎఫ్‌పిఒ’లు కూడా పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నాయని ప్రధానమంత్రి వివరించారు. చిన్న గ్రామాల్లోని స్వయం సహాయ సంఘాల మహిళల ద్వారా మాల్స్, సూపర్ మార్కెట్లలో ప్రవేశించగల చిరుధాన్య ఉత్పత్తులతో దేశంలో పూర్తిస్థాయి సరఫరా గొలుసు అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.

   జి-20కి భారత అధ్యక్ష బాధ్యతలకు “ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు” ప్రధాన నినాదంగా ఉండటాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావిస్తూ- యావత్‌ ప్రపంచాన్నీ ఒకే కుటుంబంగా పరిగణించడమన్నది అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరంలోనూ ప్రతిఫలిస్తుందని పేర్కొన్నారు. “ప్రపంచం పట్ల బాధ్యత, మానవాళికి సేవపై సంకల్పానికి భారత్ సదా ప్రాధాన్యమిస్తుంది” అని ప్రధానమంత్రి అన్నారు. ఈ మేరకు యోగాను ఉదాహరిస్తూ-  అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా యోగాభ్యాస ప్రయోజనాలు ప్రపంచం మొత్తానికీ అందేవిధంగా భారతదేశం కృషి చేసిందని గుర్తుచేశారు. నేడు ప్రపంచంలోని 100కుపైగా దేశాల్లో యోగా ఉద్యమం కొనసాగుతుండగా, 30కిపైగా దేశాలు ఆయుర్వేదానికీ గుర్తింపు ఇచ్చాయని పేర్కొంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా అంతర్జాతీయ సౌర కూటమి గురించి  కూడా ఆయన ప్రస్తావించారు. ఇందులో 100కుపైగా దేశాలు భాగస్వాములైన నేపథ్యంలో సుస్థిర భూగోళం రూపకల్పనకు ఇదొక సమర్థ వేదికగా పనిచేస్తుందన్నారు.

   “లైఫ్‌’ ఉద్యమానికి నేతృత్వంలోగానీ లేదా వాతావరణ మార్పు లక్ష్యాలను గడువుకు ముందే సాధించడంలోగానీ భారతదేశం తన వారసత్వ స్ఫూర్తితో ప్రపంచ శ్రేయస్సుకు ప్రాధాన్యమిస్తూ సమాజంలో మార్పును నడిపిస్తుంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇవాళ ‘చిరుధాన్య ఉద్యమం’లోనూ అదే ప్రభావాన్ని మనం ప్రత్యక్షంగా చూడవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండే జొన్న, సజ్జ, సామ, రాగి, కొర్ర, శనగ, అరికె, చిట్టి గోధుమ వంటి చిరుధాన్యాలు శతాబ్దాలుగా భారతీయ జీవనశైలిలో భాగంగా ఉన్నాయని ప్రధాని చెప్పారు. ఈ నేపథ్యంలో ‘శ్రీ అన్న’ సంబంధిత వ్యవసాయ పద్ధతులను, అనుభవాలను ఇతర దేశాలతో పంచుకోవడంతోపాటు వాటినుంచి నేర్చుకోవడానికి భారత్‌ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఈ దిశగా స్థిరమైన యంత్రాంగానికి రూపకల్పన చేయాలని మిత్రదేశాల వ్యవసాయ మంత్రులకు ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా పొలం నుంచి మార్కెట్‌కు, ఒక దేశం నుంచి మరో దేశానికి సరికొత్త సరఫరా శృంఖలాన్ని భాగస్వామ్య బాధ్యతలతో రూపొందించాలని కూడా ఉద్ఘాటించారు.

   వాతావరణ ప్రభావాన్ని ఎదుర్కొనడంలో చిరుధాన్యాల సామర్థ్యాన్ని కూడా ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నడుమ కూడా వాటిని సులభంగా పండించవచ్చునని చెప్పారు. వీటి సాగుకు సాపేక్షంగా తక్కువ నీరు సరిపోతుంది కాబట్టి నీటి కొరతగల ప్రాంతాల్లో ఇది సముచిత పంట కాగలదని ఆయన స్పష్టం చేశారు. రసాయనాలతో నిమిత్తం లేకుండా సహజసిద్ధంగా చిరుధాన్యాలను పండించవచ్చని, తద్వారా మానవ ఆరోగ్యం సహా భూసారాన్ని పరిరక్షించుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు.

   ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న ఆహార భద్రత సమస్యను ప్రస్తావిస్తూ- దక్షిణార్థ గోళ దేశాల పేదలకు ఆహార భద్రతను, ఉత్తరార్థ గోళ దేశాల ఆహార అలవాట్లతో ముడిపడిన వ్యాధుల సవాలును ప్రధానమంత్రి ఎత్తిచూపారు. పంటల సాగులో రసాయనాల విపరీత వాడకంపై ఆందోళనను వివరిస్తూ- “మనం ఒకవైపు ఆహార భద్రత సమస్యను, మరోవైపు ఆహారపు అలవాట్ల సమస్యను ఎదుర్కొంటున్నాం” అని ప్రధాని గుర్తుచేశారు. ఈ సమస్యలన్నిటికీ ‘శ్రీ అన్న’ సరైన పరిష్కారమని ఆయన పేర్కొన్నారు. సులభ సాగు, పరిమిత వ్యయం, ఇతర పంటలకన్నా సత్వర దిగుబడి వంటివి ఈ పంటల సాగుకు అనువైన కారణాలని ప్రధాని వివరించారు. అలాగే ‘శ్రీ అన్న’ ప్రయోజనాలను ఏకరవు పెడుతూ- ఇందులో పోషకాలు పుష్కలమని, రుచి ప్రత్యేకమని, పీచు పదార్థం అధికమని ఆయన చెప్పారు. ఇవన్నీ శరీరానికి-ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, జీవనశైలి సంబంధ వ్యాధుల నివారణకు తోడ్పడతాయని చెప్పారు.

    భారత జాతీయ ఆహారధాన్యాల దిగుబడిలో ‘శ్రీ అన్న’ వాటా ఇప్పుడు కేవలం 5 నుంచి 6 శాతం మాత్రమేనని ప్రధానమంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో “చిరుధాన్యాల ద్వారా అవకాశాలు అపారం” అని ఆయన వ్యాఖ్యానించారు. కాబట్టి ప్రతి సంవత్సరంలోనూ నిర్దిష్ట దిగుబడి లక్ష్యంతో వీటి వాటాను పెంచడానికి వ్యవసాయ రంగ శాస్త్రవేత్తలు, నిపుణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆహార తయారీ పరిశ్రమకు ఉత్తేజమివ్వడం కోసం ప్రభుత్వం ‘పిఎల్‌ఐ’ పథకాన్ని కూడా ప్రారంభించిందని ఆయన తెలిపారు. ఈ పథకం నుంచి చిరుధాన్యాల రంగం గరిష్ఠ ప్రయోజనం పొందేలా కృషి చేయాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కిచెప్పారు. తద్వారా చిరుధాన్య ఉత్పత్తుల తయారీకి అనేక కంపెనీలు ఆసక్తి చూపుతాయన్నారు. అనేక రాష్ట్రాలు తమ ప్రజా పంపిణీ వ్యవస్థలో ‘శ్రీ అన్న’ను చేర్చాయని, ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని అనుసరిస్తే మంచిదని సూచించారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకంలో ‘శ్రీ అన్న’ను చేరిస్తే, బాలలకు సరైన పోషకాహారం లభిస్తుందని, దీంతోపాటు ఆహారానికి కొత్త రుచిని, వైవిధ్యాన్ని జోడించాలని కూడా ఆయన కోరారు.

   చివరగా- తాను ప్రస్తావించిన అంశాలన్నింటిపైనా కూలంకషంగా చర్చించి, వాటి అమలు దిశగా ఈ సదస్సు ఒక మార్గ ప్రణాళికను రూపొందించగలదని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. “రైతులుసహా భాగస్వాములందరి సమష్టి కృషితో జాతీయ, అంతర్జాతీయ శ్రేయస్సుకు ఈ ఆహారం కొత్త కాంతిని జోడించగలదు” అంటూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవీయ, వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రులు శ్రీ కైలాష్ చౌదరి, శ్రీమతి శోభా కరంద్లాజె తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

   భారతదేశ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం (యుఎన్‌జిఎ) 2023ను అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం (ఐవైఎం)గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘ఐవైఎం-2023’ వేడుకలను ‘ప్రజా ఉద్యమం’గా మలచాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా భారతదేశాన్ని ‘ప్రపంచ చిరుధాన్య కూడలి’గా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఈ కృషిలో అన్ని మంత్రిత్వ శాఖలు/విభాగాలు, రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు, రైతులు, అంకుర సంస్థలు, ఎగుమతిదారులు, చిల్లర వ్యాపారులు, ఇతర భాగస్వాములు పాలు పంచుకుంటున్నారు. తదనుగుణంగా వినియోగదారులు, సాగుదారులతోపాటు వాతావరణం కోసం చిరుధాన్య (శ్రీ అన్న) వినియోగంపై అవగాహన కల్పన ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా భారత్‌ నిర్వహిస్తున్న ప్రపంచ చిరుధాన్య (శ్రీ అన్న) సదస్సు ఓ కీలక కార్యక్రమంగా మారింది.

   రెండు రోజులపాటు సాగే ఈ సదస్సులో వివిధ ముఖ్యాంశాలపై చర్చా గోష్ఠులుంటాయి. ఆ మేరకు ఉత్పత్తిదారులు, వినియోగదారులు, ఇతర భాగస్వాములకు చిరుధాన్యాలపై

ప్రోత్సాహంతోపాటు అవగాహన కల్పిస్తారు. ఇందులో భాగంగా చిరుధాన్య విలువ శృంఖలం రూపకల్పన; చిరుధాన్యాలతో ఆరోగ్యం-పోషక విలువలు; మార్కెట్ అనుసంధానం; పరిశోధన-అభివృద్ధి తదితరాలు ఈ గోష్ఠులలో ప్రధాన చర్చనీయాంశాలుగా ఉంటాయి. ఈ సదస్సులో వివిధ దేశాల వ్యవసాయ మంత్రులు, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, పోషకాహార-ఆరోగ్య నిపుణులు, అంకుర సంస్థల సారథులు, ఇతర భాగస్వాములు పాల్గొంటున్నారు.

 

***

DS/TS


(Release ID: 1908618) Visitor Counter : 278